డ్యాం లీకవుతుంటే.. అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలి
ABN , First Publish Date - 2021-07-06T08:43:20+05:30 IST
కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్(కేఆర్ఎస్) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే, అడ్డుగా ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ జలాశయానికి పగుళ్లు ఏర్పడ్డాయని సుమలత పలుమార్లు ఆరోపించారు.
- కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు
- అదే ఆయన సంస్కృతి : సుమలత ఆగ్రహం
బెంగళూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్(కేఆర్ఎస్) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే, అడ్డుగా ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ జలాశయానికి పగుళ్లు ఏర్పడ్డాయని సుమలత పలుమార్లు ఆరోపించారు. దీంతో జలవనరుల విభాగం ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించింది. పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చింది. దీనిపై సోమవారం బెంగళూరులో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కేఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచుగా మాట్లాడుతున్నారని, జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలన్నారు.
కాగా కుమారస్వామి వ్యాఖ్యలతో ఆయన ఎటువంటివారో తెలుస్తోందని ఎంపీ సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. విమర్శలు చేయవచ్చు కానీ, మాట్లాడేటప్పుడు అదుపు ఉండాలన్నారు. కేఆర్ఎస్ ప్రాజెక్టు సమీపంలో గనుల తవ్వకాలతో సమస్య ఏర్పడుతోందని, లీకేజీ జరిగే చోట ఆయననే పడుకోబెడితే సరిపోతుందన్నారు. ‘ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీస జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుసు’ అని సుమలత పేర్కొన్నారు.