బిల్లులు రావాలంటే.. చేతులు తడపాల్సిందే..

ABN , First Publish Date - 2022-08-20T04:59:38+05:30 IST

తెలంగాణ ధనిక రాష్ట్రం.. నిధులకు ఎలాంటి కొరత లేదంటూ ప్రభుత్వం ఓవైపు చెబుతోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వివిధ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి వచ్చే నెలసరి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు, బిల్లులు, సప్లమెంటరీ బిల్లుల మంజూరు కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

బిల్లులు రావాలంటే..  చేతులు తడపాల్సిందే..

- ఈ కుబేర్‌లో ఆగుతున్న బిల్లులు 

- చేతులెత్తేస్తున్న అధికారులు 

- చెల్లింపుల కోసం కార్యాలయాల చుట్టూ చక్కర్లు

- అవస్థలు పడుతున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలంగాణ ధనిక రాష్ట్రం.. నిధులకు ఎలాంటి కొరత లేదంటూ ప్రభుత్వం ఓవైపు చెబుతోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వివిధ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి వచ్చే నెలసరి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు, బిల్లులు, సప్లమెంటరీ బిల్లుల మంజూరు కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  వారికెవరికి సకాలంలో డబ్బులు చేతికి అందడం లేదు. ట్రెజరీలో బిల్లులు చేసి ఈ కుబేర్‌కు పంపించి నెలలు గడుస్తున్నా ఆ బిల్లులు, చెక్కులు ఎప్పుడు పాస్‌ అవుతాయో, వారి ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. జిల్లా ట్రెజరీ నుంచి ఈ కుబేర్‌కు బిల్‌ చేసి పంపించామని, చెక్‌ ఎప్పుడు వస్తుందో తమకు తెలియదంటూ సంబంధితశాఖల అధికారులతోపాటు ట్రెజరీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. 


 నెలల తరబడి తిరగలేక..


బిల్లుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పరుగులుపెట్టి ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ నిత్యం ఎంతో మంది ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ  పైరవీలు చేసుకోవడమో లేక అధికారులకు ఎంతో కొంత ముట్టచెప్పడమో చేస్తే తప్పా చెక్కులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి డబ్బుల కోసం నిరీక్షిస్తే వడ్డీ మీదపడడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. దీంతో అక్కడి అధికారులకు బిల్లు మొత్తాన్ని బట్టి పర్సెంటేజీ రూపంలో లంచం ముట్టజెప్పి చెక్కులు పాస్‌ చేయించుకుంటున్నామని పలువురు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తమ సొంత మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, జీపీఎఫ్‌ వంటి బిల్లులు కూడా ఈకుబేర్‌ నుంచి పాస్‌ చేయడం లేదని, తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. 


వందల సంఖ్యలో పెండింగ్‌


రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన చెల్లింపులపై ఎలాంటి ఆంక్షలు విధించక పోయినప్పటికీ రాష్ట్ర ఆర్థికశాఖలో వందల సంఖ్యలోనే బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి దాదాపు 1000 నుంచి 1500కు పైగా వివిధ శాఖలకు చెందిన బిల్లులు ట్రెజరీ నుంచి ఈ కుబేర్‌కు పంపించినవి అక్కడ పాస్‌ చేయక పోవడంతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో సీఎం అస్యూరెన్సు, పట్టణ ప్రగతి, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌తోపాటు వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన 22 కోట్ల విలువ చేసే చెక్కులు రాష్ట్ర ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 115 మంది వాటిని పాస్‌ చేయించుకునేందుకు మూడునాలుగు నెలల నుంచి  నిరీక్షిస్తున్నారు. ఏడాది, రెండేళ్ల క్రితమే పనులు చేసి వాటికి సంబంధించిన బిల్లులను చేయించుకొని మూడు నెలల క్రితమే రాయించుకున్న చెక్కులు కూడా ఆర్థిక శాఖ వద్ద ఆగిపోయాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దీతో కొత్తగా  పనులు చేపట్టడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో కూడా పదుల సంఖ్యలోనే ఈ కుబేర్‌కు పంపించిన బిల్లులు, చెక్కులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తోపాటు వివిధశాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన, చివరకు అద్దె వానాలకు సంబంధించిన బిల్లులు, పెట్రోల్‌ బిల్లులు కూడా వెంటవెంటనే ఇవ్వడం లేదు. తమ చెక్కులు మూడు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంటున్నాయని, డబ్బులు అప్పజెప్పితే తప్పా బిల్లులు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. 


 గ్రామ పంచాయతీల్లోనూ అదే ఇబ్బంది..


గ్రామ పంచాయతీల్లోనూ బిల్లులు రావడం లేదంటూ సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేసిన బిల్లులు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వకపోతే పల్లెప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని పలువురు సర్పంచులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఇటీవల 90 శాతం బిల్లులను మంజూరు చేసింది. ఇంకా 10 శాతానికి పైగా బిల్లులు రావాల్సి ఉందని సర్పంచులు అంటున్నారు. ఇక గ్రామపంచాయతీలో ఉన్న జనరల్‌ ఫండ్‌తో చేసిన పనుల బిల్లులను కూడా ఈ కుబేర్‌, ఆర్థికశాఖ చెల్లించడం లేదని వాపోతున్నారు. రామడుగు మండలం గోలిరామయ్యపల్లె అనే మైనర్‌ గ్రామపంచాయతీలో ఐదు లక్షల నిధులు ఉండడంతో వాటితో పనులు చేశారు. ఆ బిల్లులను ఇప్పటికి పాస్‌ చేయలేదని ఆ గ్రామ సర్పంచు ఉప్పు రాధమ్మ ఆరోపించారు. ఇదే తరహాలో ఇతర గ్రామపంచాయతీల్లో కూడా బిల్లులు పాస్‌ కావడం లేదని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల వరకు సీనరేజీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. 


 ప్రజాప్రతినిధులతో పైరవీలు


దీనితో కొందరు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో టోకెన్‌ నంబర్లు చెప్పి బిల్లులు పాస్‌ చేయించుకుంటున్నారు. మరికొందరు ఆరు శాతం వరకు లంచంగా ఇచ్చి బిల్లులు పాస్‌ చేయించుకున్నామని చెబుతున్నారు. ఆరు నెలల నుంచి వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, చివరకు రిటైర్డు ఉద్యోగులకు ఏరియర్స్‌, ఇతర అలవెన్సులు, అంత్యక్రియలకు సంబంధించిన దహనసంస్కారాల డబ్బులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. బిల్లులు సకాలంలో పాస్‌ చేయక పోవడంతో నెల, రెండు నెలల తర్వాత మళ్లీ బిల్లులు పంపించాల్సి వస్తోంది. కొన్ని నెలలుగా ఆసరా పెన్షన్లు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు గతంలో మాదిరిగా వెంటవెంటనే ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-20T04:59:38+05:30 IST