అధికారులు వినకపోతే కర్రలతో మోదండి: గిరిరాజ్ సింగ్

ABN , First Publish Date - 2021-03-07T22:28:31+05:30 IST

తరచు సంచలన వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈసారి విధినిర్వహణలో..

అధికారులు వినకపోతే కర్రలతో మోదండి: గిరిరాజ్ సింగ్

బెగుసరాయ్: తరచు సంచలన వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈసారి  విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కొరడా ఝళిపించారు. ప్రజల గోడు పట్టించుకోని అధికారులను వెదురు కర్రలతో మోదండంటూ తన నియోజకవర్గ ప్రజలకు సూచించారు. బెగుసరాయ్‌లోని ఖోడావాండ్‌పూర్‌లో ఉన్న అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


'ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే మీ ఇబ్బందులు పట్టించుకోకుంటే వెదురు కర్రతో బాదండి. మనమేమీ అధికారులను అక్రమమైన పనులు చేయమనో, నగ్న నృత్యాలు చేయమనో అడగడం లేదు. చిన్న చిన్న పనుల కోసం ప్రజలు నా వద్దకు రావాల్సిన పని లేదని చెబుతుంటాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు, విలేజ్ ముఖియాలు, డీఎంలు, ఎస్డీఎంలు, బీడీఓలు ఉన్నారు. వీరి పని ప్రజలకు సేవ చేయడమే. వారు మీ మాటలు వినకుంటే రెండు చేతులతో వెదురు కర్రలు తీసుకుని వాళ్ల తలపై బలంగా మోదండి' అని సింగ్ పేర్కొన్నారు. అప్పటికీ అధికారులు మాట వినకుంటే స్వయంగా తానే ప్రజలకు అండగా నిలబడతానని మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - 2021-03-07T22:28:31+05:30 IST