మండపేట విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుల గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-25T17:46:42+05:30 IST

మండపేట పట్టణంలో ఆర్‌సీఎం చర్చి గేటు వద్ద ఏసు క్రీస్తు, మేరీ మాత విగ్రహాల..

మండపేట విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుల గుర్తింపు

మండపేట(తూర్పు గోదావరి): మండపేట పట్టణంలో ఆర్‌సీఎం చర్చి గేటు వద్ద  ఏసు క్రీస్తు, మేరీ మాత విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రెండు రోజుల పాటు ఏలూరు రేంజ్‌ డీఐజీ రామ్మోహన్‌రావు మండపేటలోనే మకాం వేసి కేసు పురోగతిపై దిశానిర్దేశం చేశారు.    కాకినాడ డీఎస్పీ రామకృష్ణ, రామచంద్రపురం ట్రైనీ డీఎస్పీ బాలచంద్రరెడ్డితో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఎస్‌ఐలను ప్రత్యేక బృందాలుగా నియమించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే పట్టణంలో దేవాలయాలు, మసీదుల వద్ద బందోబస్తు కొనసాగుతోంది.  


పట్టణంలో కొనసాగుతున్న  బందోబస్తు

పట్టణంలో బందోబస్తు కొనసాగుతోంది. చర్చి సమీపంలో ఉన్న దుకాణాలు వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. పట్టణంలో రెండు పెట్రోలింగ్‌ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.  పెద్దకాల్వ వద్ద ఆలమూరు రోడ్డులో టోల్‌గేటు వద్ద పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. మండపేటరూరల్‌ సీఐ మంగాదేవి, అర్బన్‌ సీఐ ఎ.నాగమురళీతో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు   నిందితుల కోసం గాలిస్తున్నారు. 


పోలీసుల అదుపులో యువకులు 

గురువారం పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీనిపై ఎస్సీ సంఘం నాయకులు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్‌, వైసీపీ నాయకుడు కొవ్వాడ అప్పన్నబాబు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో విచారణ పేరిట ఉంచటం తగదన్నారు. సత్వరమే 12 మంది యువకులను వదిలేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణ ఎస్‌ఐ తోట సునీతతో వారు వాగ్వివాదానికి దిగారు.  


కొత్త విగ్రహాల ఏర్పాటు 

ఆర్‌సీఎం చర్చి వద్ద దుండగులు బద్దలుకొట్టిన యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాల స్థానంలో చర్చి నిర్వాహకుడు ఫాదర్‌ రత్నకుమార్‌ నూతన విగ్రహాలను ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఈ విగ్రహాలను తీసుకువచ్చారు. 








Updated Date - 2020-09-25T17:46:42+05:30 IST