వినూత్నం.. విభిన్నం.. గిరిజన యువకుడి నూతన ఆలోచన

ABN , First Publish Date - 2021-01-25T04:55:08+05:30 IST

అందరూ రూ.కోట్లు, రూ.లక్షలు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటుంటే.. ఓ గిరిజన యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు.

వినూత్నం.. విభిన్నం..  గిరిజన యువకుడి నూతన ఆలోచన
గిరిజన యువకుడు నిర్మిస్తున్న ఇల్లు ఇదే..

 యూట్యూట్‌లో చూసి మంచుప్రాంతంలోలా ఇంటి నిర్మాణం

తానే స్వయంగా కట్టుకుంటున్న నాగరాజు

చర్ల, జనవరి 24 : అందరూ రూ.కోట్లు, రూ.లక్షలు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటుంటే.. ఓ గిరిజన యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. అందరి కంటే ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతో యూట్యూబ్‌లో చూసి మంచుప్రాంతాల్లో ఉండే ఇళ్ల తరహాలో నిర్మిస్తున్నాడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల అటవీప్రాంతంలోని సింగసముద్రం గ్రామానికి చెందిన  పాయల నాగరాజు. ఇంటర్‌ వరకు చదివిన నాగరాజు ప్రస్తుతం ఫొటోగ్రఫీ వృత్తిగా జీవిస్తున్నాడు. ఎప్పటి నుంచో తన సొంత స్థలం సుమారు 70గజాల్లో తక్కువ ఖర్చులో వినూత్నంగా ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. అయితే ఆ గిరిజన అన్నీ పూరిగుడిసెలే ఉండగా.. ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఇంటి నమూనాలను వెతికి.. మంచు ప్రాంతాల్లో ఉండే లాంటి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కర్రలు, ఇనుప రాడ్‌లు, రేకులతో రెండు స్టేర్ల ఇంటిని తానే స్వయంగా సుతారీలు లేకుండా నిర్మించుకుంటున్నాడు. ప్రసుత్తం 70శాతం పూర్తయిన ఈ ఇంటిలో హాల్‌, వంటగది, బెడ్‌రూమ్‌ ఉన్నాయి. పై స్టేర్‌కు వెళ్లేందుకు మెట్లనుకూడా లోపలే నిర్మించాడు. ప్రస్తుతం రూ.1.80 లక్షలు ఖర్చయ్యిందని, ఇంకా రూ.50వేల వరకు ఖర్చవుతుందని నాగరాజు చెబుతున్నాడు. అయితే ఈ ఇంటిని నాగరాజు ఒక్కడే యూట్యూబ్‌లో చూసి నిర్మించుకుంటున్నాడని, సుతారీలు లేకుండా ఇలా కట్టుకోవడం అభినందనీయమని స్థానికులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయితే చూడాలని తమకు ఆతృతగా ఉందంటున్నారు. 


Updated Date - 2021-01-25T04:55:08+05:30 IST