అన్ని మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-06T07:24:40+05:30 IST

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా మార్చాలని కలెక్టర్‌ హన్మంతరావు అఽన్నారు.

అన్ని మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చాలి: కలెక్టర్‌

సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 5: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా మార్చాలని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు, ఆర్డీవోలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ హితవు పలికారు. మున్సిపాలిటీల పరిధిలో సమస్యల రాజ్యమేలుతున్నాయని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  చిరువ్యాపారులకు రుణాలు ఇప్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశించారు.  సమావేశంలో జిల్లా ఆదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు పాల్గొన్నారు.


హత్నూర : హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో కొనసాగుతున్న రైతు వేదిక నిర్మాణం పనులను బుధవారం కలెక్టర్‌ హన్మంతరావు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, తహసీల్దార్‌ జయరాంనాయక్‌, ఎంపీడీవో సువర్ణ, నాయకులు ఉన్నారు.


సదాశివపేట : సదాశివపేట టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ పి.లక్ష్మీపతిని కలెక్టర్‌ హన్మంతరావు సరెండర్‌ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సదాశివపేట మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు అధికారులకు ఎలాంటి సమాచారమివ్వలేదని కలెక్టర్‌ తెలిపారు. రివ్యూ సమావేశాలకు హాజరు కాకపోవడంతో పాటు ముఖ్య పనుల సమయంలో అనధికారికంగా గైర్హాజరైనట్లు తెలిపారు. లక్ష్మీపతిని హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌కు కలెక్టర్‌  సరెండర్‌ చేశారు. 

Updated Date - 2020-08-06T07:24:40+05:30 IST