పరీక్షలొద్దు.. పంపెయ్‌!

ABN , First Publish Date - 2020-06-04T07:35:04+05:30 IST

అప్పుడు.. అనుమానం ఉన్నా క్వారంటైన్‌లో పెట్టారు! ఇప్పుడు.. కరోనా సోకినా, లక్షణాలు పెద్దగా లేకుంటే ఇంట్లోనే ఉండాలంటున్నారు!! వైరస్‌ సోకినవారికి.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు.. ఇలా అందరికీ పరీక్షలు చేయాలన్నారు ఒకప్పుడు! వైరస్‌ సోకినవారిని తాకినప్పటికీ ఎలాంటి లక్షణాలూ లేనివారిలో తక్కువ రిస్కు ఉన్నవారికి పరీక్షలు చేయక్కర్లేదు...

పరీక్షలొద్దు.. పంపెయ్‌!

  • కొద్దిపాటి లక్షణాలున్నా ఇంట్లోనే చికిత్స
  • మొదట్లో అనుమానితులందరికీ పరీక్ష
  • ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులందరికీ..
  • ఇప్పుడు లక్షణాలున్నవారికి మాత్రమే!
  • నానాటికీ మారుతున్న కేంద్రం, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు
  • తెలంగాణలో వైరస్‌ సోకిన 11 మందికి
  • ప్రయోగాత్మకంగా హోం క్వారంటైన్‌



  • అప్పుడు.. అనుమానం ఉన్నా క్వారంటైన్‌లో పెట్టారు! ఇప్పుడు.. కరోనా సోకినా, లక్షణాలు పెద్దగా లేకుంటే ఇంట్లోనే ఉండాలంటున్నారు!! 
  • వైరస్‌ సోకినవారికి.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు.. ఇలా అందరికీ పరీక్షలు చేయాలన్నారు ఒకప్పుడు! వైరస్‌ సోకినవారిని తాకినప్పటికీ ఎలాంటి లక్షణాలూ లేనివారిలో తక్కువ రిస్కు ఉన్నవారికి పరీక్షలు చేయక్కర్లేదు. ఎక్కువ రిస్కు ఉన్నవారికే పరీక్షలు చేయాలని ఇప్పుడు అంటున్నారు.
  • జూ కరోనాకు చికిత్స పొందినవారిని డిశ్చార్జి చేయాలంటే వరుసగా రెండుసార్లు పరీక్షల్లో నెగెటివ్‌ రావాలని అప్పట్లో అన్నారు! వైరస్‌ సోకినా వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే 10 రోజుల తర్వాత పరీక్షలూ చేయకుండానే డిశ్చార్జ్‌ చేయాలన్నది తాజా రూలు! ఇలా, కరోనా సోకినవారికి పరీక్షలు చేయడం, ఐసోలేషన్‌, క్వారంటైన్‌లో ఎవరిని పెట్టాలనే అంశాల నుంచి ఆస్పత్రిలో చేర్చుకోవడం, డిశ్చార్జ్‌ చేయడం దాకా గత 4 నెలల్లో ఐసీఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య శాఖల స్వరం మారుతూ వస్తోంది. ముఖ్యంగా గత నెల 8న విడుదల చేసిన ‘సవరించిన డిశ్చార్జి విధానం’పై తీవ్ర విమర్శలను ముందే ఊహించిన ఆరోగ్య శాఖ కారణాలను కూడా వివరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొవిడ్‌-19 సోకినవారిని ఇంటికి పంపేందుకు పాటించే ప్రమాణాలను ‘పరీక్షల ఆధారిత వ్యూహం’ నుంచి లక్షణాల ఆధారిత వ్యూహానికి లేదా సమయాధారిత వ్యూహానికి మార్చాయి. దానికితోడు.. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రయోగశాలల అధ్యయనం ప్రకారం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స చేస్తే సగటున 10 రోజుల్లో నెగెటివ్‌ వస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం కూడా లక్షణాలు బయటపడడానికి 2 రోజుల ముందే వైరల్‌ లోడ్‌ అధికంగా ఉంటోందని, తర్వాత 7 రోజుల్లో తగ్గిపోతోందని తేలింది. ఈ నేపథ్యంలోనే రోగులను ఇంటికి పంపే మార్గదర్శకాలను మార్చాం’’ అని వివరణ ఇచ్చింది.

పల్చబడిన పరీక్షల లెక్క

మనదేశంలో జనవరి 30న తొలి కొవిడ్‌-19 కేసు నమోదైంది. ఐసీఎంఆర్‌ మొదట్లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారిలో కరోనా అనుమానిత లక్షణాలున్నవారందరికీ పరీక్షలు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగినవారికి లక్షణాలు లేకున్నా, వారితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా చేశారు. 


  1. మార్చి 17 నాటి మార్గదర్శకాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసినవారందరికీ 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనపడితేనే పరీక్ష చేయాలని ఐసీఎంఆర్‌ పేర్కొంది. వారికి పాజిటివ్‌ వస్తే, వారిని కలిసినవారందరినీ క్వారంటైన్‌కు పంపి, లక్షణాలు కనపడితే పరీక్షలు చేయాలని సూచించింది. వైరస్‌ సోకినవారికి చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి లక్షణాలు కనపడితే పరీక్షలు చేయాలని పేర్కొంది.  
  2. మార్చి 21 నాటి మార్గదర్శకాల్లో పైన పేర్కొన్న వ్యక్తులతో పాటు తీవ్రశ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరినవారికి, వైరస్‌ పాజిటివ్‌గా తేలినవారిని నేరుగా తాకిన హైరిస్క్‌ కాంటాక్టులకు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయాలని పేర్కొంది. తక్కువ రిస్క్‌ విభాగంలో ఉన్నవారికి పరీక్షలు అక్కర్లేదని తెలిపింది.
  3. ఏప్రిల్‌ 9 నాటి మార్గదర్శకాల్లో.. పైన పేర్కొన్న వ్యక్తులతో పాటు హాట్‌స్పాట్లు/క్లస్టర్లలో, వలస కార్మికులు ఉండేచోట్ల.. ఇన్‌ఫ్లూయెంజా తరహా అనారోగ్యంతో బాధపడేవారందరికీ లక్షణాలు కనపడిన 7 రోజుల్లోగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని సూచించింది. 
  4. మే 18 నాటి మార్గదర్శకాల్లో.. విదేశీ చరిత్ర ఉన్నా, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తాకినా లక్షణాలుంటేనే పరీక్షలు. లేకుంటే అక్కర్లేదు. కట్టడి ప్రాంతాల్లో సేవలందించే వైద్యులు, సిబ్బందికి కూడా లక్షణాలుంటేనే పరీక్షలు చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికీ శ్వాసకోశ సమస్యలు ఉంటేనే పరీక్షలు చేయాలని పేర్కొంది. 


ఐసోలేషన్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..

కరోనా ముప్పు నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఎవరుండాలి? క్వారంటైన్‌కు ఎవరిని పంపాలి? ఎవరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాలనే అం శంపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్చి 11 నాటి మార్గదర్శకాల ప్రకారం.. కొవిడ్‌-19 పాజిటివ్‌ వ్యక్తులను/అనుమానితులను తాకినవారంతా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాలి. కానీ, ఏప్రిల్‌ 27 నాటి మార్గదర్శకాల్లో.. కొద్దిపాటి లక్షణాలున్నవారు/వైరస్‌ పాజిటివ్‌కు ముందు లక్షణాలు కనిపించినవారు కావాలనుకుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి, వైద్యుల సంరక్షణలో చికిత్స పొందొచ్చు. వారికి ఛాతీనొప్పి, శ్వాస సమస్యల వంటివి ఎక్కువగా ఉన్నప్పుడే ఆస్పత్రికి తరలించాలి. లక్షణాలన్నీ తగ్గాక పరీక్షలు చేసి నెగెటివ్‌ వస్తే, వైద్యాధికారి ధ్రువీకరణతో వారి హోం ఐసోలేషన్‌ పూర్తవుతుంది. మే 10 నాటి మార్గదర్శకాల్లో ఐసోలేషన్‌ నిబంధనలను మార్చలేదు. హోం ఐసోలేషన్‌ నిబంధనలను మార్చా రు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి. వరుసగా 10 రోజులపాటు జ్వరం రాకపోతే 17 రోజుల తర్వాత వారి ఐసోలేషన్‌ పూర్తయినట్లే. పరీక్ష చేయించుకోవాల్సిన పనిలేదు. కొద్దిపాటి లక్షణాలున్న 11 మంది కొవిడ్‌-19 పేషెంట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా హోం ఐసోలేషన్‌లో ఉంచింది.


టెస్టులెందుకు.. ఇంటికి పంపెయ్‌!

మే 8 మార్గదర్శకాల ప్రకారం.. వైరస్‌ సోకినా కొద్దిపాటి లక్షణాలున్నవారికి/లక్షణాలు బయటపడడానికి ముందు దశలో ఉన్నవారికి వరుసగా 3 రోజులపాటు జ్వరం రాకపోతే 10 రోజుల తర్వాత పరీక్ష చేయకుండానే డిశ్చార్జ్‌ చేయొచ్చు. తర్వాత వారు ఇంట్లో 7 రోజులు ఉంటే చాలు. తీవ్ర లక్షణాలున్నవారికి మాత్రం బాగా కోలుకున్నాక ఒక్కసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేసి, నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపేయొచ్చు. లాక్‌డౌన్‌ సడలింపుతో కేసుల సంఖ్య పెరుగుతుందని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. మరికొందరు మాత్రం టెస్టింగ్‌ కిట్లను కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఇదే పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

-సెంట్రల్‌ డెస్క్


Updated Date - 2020-06-04T07:35:04+05:30 IST