ప్రశాంత్ కిశోర్‌తో అసంతృప్తిగా ఉంది: టీఎంసీ నేత

ABN , First Publish Date - 2022-02-22T22:51:43+05:30 IST

ఐ-పాక్‌తో రకరకాల సమస్యలు ఉన్నట్లు టీఎంసీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది నాతో చెప్పారు. ప్రశాంత్ కిశోర్, ఐ-పాక్‌తో వారికి ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. ఈ విషయమై నేను వారితో మాట్లాడాను..

ప్రశాంత్ కిశోర్‌తో అసంతృప్తిగా ఉంది: టీఎంసీ నేత

పనాజీ: పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గోవా టీఎంసీ చీఫ్ కిరణ్ కండోల్కర్ అన్నారు. గోవా ఎన్నికలు ముగిసిన అనంతరం టీఎంసీ నేతలను ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐ-పాక్ పూర్తిగా మర్చిపోయిందని, దీనిపై టీఎంసీ నేతలకు కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు. సోమవారం గోవాలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఐ-పాక్‌తో రకరకాల సమస్యలు ఉన్నట్లు టీఎంసీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది నాతో చెప్పారు. ప్రశాంత్ కిశోర్, ఐ-పాక్‌తో వారికి ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. ఈ విషయమై నేను వారితో మాట్లాడాను. ఇదే సందర్భంలో గోవా టీఎంసీ పదవికి రాజీనామా చేయమని వారు నాకు సలహా ఇచ్చారు. అయితే టీఎంసీకి నేను రాజీనామా చేయడం లేదు కానీ, ప్రశాంత్ కిశోర్, ఐ-పాక్‌తో మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాను’’ అని కిరణ్ అన్నారు.


గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 14న జరిగింది. అల్డోనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిరణ్ కండోల్కర్ పోటీ చేశారు. ఆయన భార్య కూడా ఈ ఎన్నికల్లో టీఎంసీ టికెట్‌పై పోటీ చేశారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ స్ట్రాటజిస్టుగా పీకేని మమతా బెనర్జీ నియమించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించి, బెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అనంతరం మరో ఐదేళ్ల పాటు టీఎంసీకి పని చేసేలా ప్రశాంత్ కిశోర్‌తో మమతా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సినియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్‌ ఓ సందర్భంలో వెల్లడించారు.

Updated Date - 2022-02-22T22:51:43+05:30 IST