నేను ‘ప్రత్యేక’ం

ABN , First Publish Date - 2021-07-22T05:28:23+05:30 IST

గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారుల పాలన సమయంలో మండల అధికారి ఒకరు నిబంధనలకు నీళ్లొదిలిన వైనం గరుగుబిల్లి మండలంలో వెలుగులోకి వస్తోంది. గతంలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. గతంలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.

నేను ‘ప్రత్యేక’ం


తనకు తానుగా ప్రకటించుకున్న అధికారి
కలెక్టర్‌ ఉత్తర్వులు లేకుండానే...
పంచాయతీల్లో పూర్తి నిధుల డ్రా
గరుగుబిల్లి, జూలై 21:
గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారుల పాలన సమయంలో మండల అధికారి ఒకరు నిబంధనలకు నీళ్లొదిలిన వైనం గరుగుబిల్లి మండలంలో వెలుగులోకి వస్తోంది. గతంలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. గతంలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి కలెక్టర్‌ అనుమతులు విధిగా ఉండాలి. ఆ మధ్య కొత్తగా వచ్చిన మండల కీలక అధికారి అనుమతి లేకుండా కొన్ని గ్రామాలకు ప్రత్యేకాధికారిగా నియమించుకున్నట్లు తెలిసింది. గ్రామ ప్రత్యేకాధికారిగా ఉండాలంటే విధిగా కలెక్టర్‌ అనుమతులు తీసుకోవాలి. ఆయన మాత్రం తనకు తానుగా ఆర్డీవలస, వల్లరిగుడబ, చినగుడబ, పెదగుడబ, బీవీపురం, గరుగుబిల్లి, దళాయివలస, ఉద్దవోలు, మరుపెంట, గొట్టివలస పంచాయతీలకు ప్రత్యేకాధికారిగా నియమించుకున్నారు. ఆ తర్వాత పంచాయతీల్లో పనులకు ఏకదాటిగా చెల్లింపులు చేసినట్లు సమాచారం. పంచాయతీల పరిధిలోని బిల్లులను నామమాత్రంగా పరిశీలించినట్లు విమర్శలు ఉన్నాయి. కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకోకుండా వివిధ పంచాయతీల్లో సుమారు రూ.2 కోట్లకు పైగానే చెల్లింపులు జరిగినట్లు సమాచారం. కార్యదర్శులు అందించిన బిల్లులు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించకుండా మత్తులోనే బయోమెట్రిక్‌ వేశారన్న ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. పంచాయతీల ప్రత్యేకాధికారి నియామకంపై పార్వతీపురం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కె.రాజ్‌కుమార్‌ను బుధవారం వివరణ కోరగా.. కలెక్టర్‌ అనుమతులు విధిగా ఉండాలని తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు నిర్వహిస్తామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మండల అధికారి వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


Updated Date - 2021-07-22T05:28:23+05:30 IST