పరివార్‌వాదీలు నన్ను పనిచేయనీయలేదు: మోదీ

ABN , First Publish Date - 2022-02-20T22:07:48+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీని ''కుటంబపాలకులు" (పరివార్‌వాదీలు) అంటూ ప్రధాని మరోసారి విమర్శలు..

పరివార్‌వాదీలు నన్ను పనిచేయనీయలేదు: మోదీ

హర్దోయి: సమాజ్‌వాదీ పార్టీని ''కుటుంబపాలకులు" (పరివార్‌వాదీలు) అంటూ ప్రధాని మరోసారి విమర్శలు గుప్పించారు. 2014-2017లో పరివార్‌వాదీలు తనకు సహకరించలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడుతూ, తాను యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, 2017 వరకూ ఈ కుటుంబ పాలకులు తనను రాష్ట్ర ప్రజల కోసం పనిచేయనీయలేదని చెప్పారు. ''ఇప్పుడు అదే కుటుంబపాలకులను మీరు ఎన్నుకుంటే నన్ను ప్రజల కోసం పనిచేయనిస్తారా? అలాంటి వ్యక్తులు మళ్లీ ఎన్నికకావాలా?" అని  మోదీ ప్రశ్నించారు.


యూపీలోని కుటుంబపాలకులు ఇప్పుడు కులం పేరుతో విషం జిమ్ముతున్నారని మోదీ విమర్శించారు. వాళ్లలో వాళ్లే కుర్చీ కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదని, కేంద్రంలోని ప్రభుత్వం కూడా కుటుంబ పార్టీది కాదని మోదీ అన్నారు. పేదలు, రైతులు, యువత కోసం పనిచేసే ప్రభుత్వం తమదని చెప్పారు.


రెండుసార్లు హోలీ..

యూపీ  ప్రజలు హోలీ రెండు సార్లు ఆడేందుకు సన్నాహాల్లో ఉన్నారని, 10వ తేదీన బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ఒకసారి హోలీ చేసుకుంటారని అన్నారు. మార్చి 10వ తేదీ హోలీకి సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో బీజేపీకి ప్రజల ఓట్లు పడుతున్నట్టు ప్రధాని చెప్పారు. ''ఇవాళ మూడో విడత పోలింగ్‌లో కూడా బీజేపీకి అనుకూలంగా భారీగా ఓటింగ్ జరుగుతోంది. యూపీతో పాటు పంజాబ్‌లో కూడా పోలింగ్ జరుగుతోంది. అక్కడి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్రాభివృద్ధి, పంజాబ్ భద్రత, దేశ సమగ్రత కోసం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు'' అని మోదీ తెలిపారు. యూపీలో తదుపరి విడత పోలింగ్‌ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని, బుజ్జగింపు రాజకీయాల కోసం మన పండుగలను అడ్డుకుంటున్న వారికి మార్చి 10వ తేదీ (ఎన్నికల ఫలితాల రోజు) ఫలితాలతో గట్టి సమాధానం ఇవ్వాలని ప్రధాని కోరారు.

Updated Date - 2022-02-20T22:07:48+05:30 IST