తప్పిన ముప్పు... కేటీపీఎస్‌ ఐదోదశలో హైడ్రోజన్‌ గ్యాస్‌లీక్‌

ABN , First Publish Date - 2020-08-11T21:01:35+05:30 IST

కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో సోమవారం హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. జనరేటర్‌ తిరగటానికి ప్రాణవాయువులా పనిచేసే హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అవడంతో కార్మికులు, ఇంజనీర్లు భయంతో పరుగులు తీశారు.

తప్పిన ముప్పు... కేటీపీఎస్‌ ఐదోదశలో హైడ్రోజన్‌ గ్యాస్‌లీక్‌

పరుగులు తీసిన ఇంజనీర్లు, కార్మికులు

చాకచక్యంగా ఎగ్జిట్‌ వాల్వ్‌లను తెరిచిన ఇంజనీర్లు

త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

ఇంజనీర్లను అభినందించిన జెన్‌కో సీఎండీ


పాల్వంచ(ఖమ్మం): కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో సోమవారం హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. జనరేటర్‌ తిరగటానికి ప్రాణవాయువులా పనిచేసే హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అవడంతో కార్మికులు, ఇంజనీర్లు భయంతో పరుగులు తీశారు. పాల్వంచ కేటీపీఎస్‌ ఐదోదశ కర్మాగారంలోని 250మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తొమ్మిదో యూనిట్‌లో రెండు నెలలుగా వార్షిక మరమ్మతులు నిర్వహిస్తున్నారు. యూనిట్‌కు సంబందించిన బాయిలర్‌, టర్బైన్‌, జనరేటర్‌ల మరమ్మతులు పూర్తవడంతో ఒక్కో విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ట్రయల్‌రన్‌లో భాగంగా బాయిలర్‌, టర్బైన్‌లను విజయవంతంగా లైటప్‌ చేశారు. ఈక్రమంలోనే యూనిట్‌కు గుండెలా పనిచేసే జనరేటర్‌ ట్రయల్‌రన్‌ సందర్భంగా విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసే పనిలో భాగంగా జనరేటర్‌లో హైడ్రోజన్‌ (హెచ్‌-2)ను నింపుతుండగా జనరేటర్‌ కింద పైపుల్లోంచి అతి స్వల్పంగా గ్యాస్‌ లీకవుతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే గ్యాస్‌ నింపే ప్రక్రియను నిలిపివేసి సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉండే పైపులకు సంబంధించిన వాల్వ్‌లను వదిలేశారు. హైడ్రోజన్‌ గ్యాస్‌ గాలిలో కలిస్తే పెనుముప్పు ఏర్పడే ప్రమాదం ఉండటంతో దానికి సమాంతరంగా కార్బన్‌డయాక్సైడ్‌ను కూడా విడుదల చేశారు. విషవాయువులు విడుదలవుతున్నాయన్న విషయం తెలుసుకున్న కొందరు ఇంజనీర్లు, కార్మికులు పరుగులు తీశారు.  


అయితే ఈ విభాగంలో పనిచేసే 10మంది ఇంజనీర్లు మాత్రం చాకచక్యంగా వాల్వ్‌లను వదలడంతో పెనుప్రమాదం తప్పింది. దీనికి అతి సమీపంలోనే గ్యాస్‌ నింపేందుకు సిద్ధంగా ఉంచిన 50కిలోల ట్యాస్‌ సామర్థ్యం కలిగిన 20భారీ సిలిండర్లను కూడా ఇంజనీర్లే భుజాలపై మోసుకుంటూ వెళ్లి అరకిలోమీటరు దూరంలో పెట్టారు. విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా జనరేటర్‌ నిమిషానికి సుమారు 3వేలసార్లు (రొటేషన్‌ ఫర్‌ మినిట్‌) తిరిగే క్రమంలో జనరేటర్‌లో వచ్చే వేడిని తగ్గించేందుకు హైడ్రోజన్‌ గ్యాస్‌ను ఉపయోగిస్తారని, ఎంతో శక్తివంతమైందని ఈ గ్యాస్‌ లీకైతే ఆ ప్రదేశానికి అరకిలోమీటరు దూరంలో ఎక్కడ నిప్పు రవ్వలు ఉన్నా వాటిని ఆకర్షించే సామర్థ్యం కలిగిన ఈ గ్యాస్‌ వల్ల పెనుప్రమాదం జరుగుతుందని, అప్పుడు దాన్ని అదుపు చేయటం అసాధ్యమని ఇంజనీర్లు తెలిపారు. 1975లో రామగుండం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో ఈ తరహాలోనే గ్యాస్‌ లీకై పెనుప్రమాదం జరిగిందని ఇంజనీర్లు గుర్తు చేశారు. గ్యాస్‌ లీస్‌ విషయం తెలుసుకున్న కేటీపీఎస్‌ 5, 6దశల చీఫ్‌ ఇంజనీర్‌ కె.రవీందర్‌కుమార్‌ కర్మాగారానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్‌ లీకేజీకి సంబందించిన వివరాలు తెలుసుకుని, ఘటన జరిగిన వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన ఇంజనీర్లను అభినందించారు. ఈ ఘటనపై జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కూడా వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్‌ లీకైన వెంటనే పసిగట్టి స్పందించిన ఏఈ, ఏడీఈలను ప్రశంసించారు. అనంతరం యూనిట్‌లో యథావిధిగా మరమ్మతు పనులు కొనసాగించారు. 


ఇకపై ముందుగా గాలిని నింపి పరీక్షలు: రవీందర్‌కుమార్‌,  సీఈ 

యూనిట్‌లో హైడ్రోజన్‌ గ్యాస్‌ లీకైన నేపథ్యంలో ఈసారి పైపుల్లోకి ముందుగా గాలిని నింపి ఒకరోజు పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి హైడ్రోజన్‌ నింపుతామని కేటీపీఎస్‌ 5, 6యూనిట్ల సీఈ రవీందర్‌కుమార్‌ తెలిపారు. క్షుణ్ణంగా పరిశీలించాకే మరోసారి జనరేటర్‌లో హైడ్రోజన్‌ నింపుతామని, ఈ యూనిట్‌నుంచి బుధవారం విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరిస్తామని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2020-08-11T21:01:35+05:30 IST