ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లో హైదరాబాద్‌కు 24వ ర్యాంకు

ABN , First Publish Date - 2021-03-05T07:58:29+05:30 IST

అత్యుత్తమ జీవన పమ్రాణాలతో హాయిగా జీవించేందుకు అనువైన నివాసయోగ్య నగరాల జాబితాలో, మునిసిపల్‌ పనితీరు సూచీలో.. హైదరాబాద్‌ సహా తెలంగాణ నగరాలన్నీ వెనుకబడ్డాయి.

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లో హైదరాబాద్‌కు 24వ ర్యాంకు

మునిసిపల్‌ పనితీరులో 17వ ర్యాంకు

ఉత్తమ నివాసయోగ్య నగరంగా బెంగళూరు

జీవన నాణ్యత సహా 4 అంశాల ఆధారంగా 111 నగరాలకు ర్యాంకింగుల కేటాయింపు

మన నగరాలకు టాప్‌-10లో దక్కని చోటు

విశాఖకు 15.. విజయవాడకు 41వ ర్యాంకు

చిన్న నగరాల్లో కాకినాడకు నాలుగో ర్యాంకు


న్యూఢిల్లీ/హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, మార్చి 4: అత్యుత్తమ జీవన పమ్రాణాలతో హాయిగా జీవించేందుకు అనువైన నివాసయోగ్య నగరాల జాబితాలో, మునిసిపల్‌ పనితీరు సూచీలో.. హైదరాబాద్‌ సహా తెలంగాణ నగరాలన్నీ వెనుకబడ్డాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ-2020లో కేవలం 55.4 స్కోర్‌తో హైదరాబాద్‌ 24 స్థానంలో నిలిచింది. మునిసిపల్‌ పనితీరులో 49.08 స్కోరుతో 17వ ర్యాంకు పొందింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, ఆ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా గురువారం ఈ సూచీలను విడుదల చేశారు. ఈజ్‌ఆప్‌ లివింగ్‌ సూచీలో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. పుణె ఈసారి రెండో స్థానానికి పడిపోయంది. మూడో స్థానంలో అహ్మదాబాద్‌ నిలవగా.. చెన్నై, సూరత్‌ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి.


ఇక పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీలో సిమ్లా అగ్రస్థానంలో నిలవగా.. భువనేశ్వర్‌కు రెండో ర్యాంకు లభించింది. ఏపీలోని కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. జీవన నాణ్యత, నగరాల ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, పౌరుల అభిప్రాయం.. ఈ నాలుగు ప్రమాణాల ఆధారంగా ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీని రూపొందించారు. అలాగే.. సేవలు, ఆర్థిక, సాంకేతిక, ప్రణాళిక, పరిపాలన వంటి 5 ప్రమాణాల ఆధారంగా మునిసిపల్‌ పనితీరు సూచీలను రూపొందించారు. ఈ 2 విభాగాల్లో 111 నగరాలు/పట్టణాలకు కేంద్రం ర్యాంకులను ప్రకటించింది.  పదిలక్షల కన్నా తక్కువ జనాభా కేటగిరీలో మునిసిపల్‌ పనితీరు సూచీ ఆధారంగా ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ తొలి ర్యాంకు దక్కించుకుంది.


వరంగల్‌, కరీంనగర్‌కు ఇలా...

పది లక్షల కన్నా తక్కువ జనాభాగల పట్టణాల విభాగంలో ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లో వరంగల్‌కు 19వ ర్యాంకు, కరీంనగర్‌కు 22వ ర్యాంకు లభించాయి. మునిసిపల్‌ పనితీరులో వరంగల్‌కు 29వ ర్యాంకు, కరీంనగర్‌కు 35వ ర్యాంకు వచ్చింది. ప్రమాణాలవారీగా చూస్తే.. 


వరంగల్‌కు ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ జీవన నాణ్యతలో 4వ ర్యాంకు, ఆర్థిక సామర్థ్యంలో 40, సుస్థిరతలో 8, పౌరుల పర్సెప్షన్‌లో 44వ ర్యాంకు లభించాయి. మునిసిపల్‌ పనితీరు సూచీ మేరకు పౌరసేవల్లో 23వ ర్యాంకు, ఆర్థికంలో 19వ ర్యాంకు, సాంకేతికతలో 29వ ర్యాంకు, ప్రణాళికలో 15వ ర్యాంకు, పరిపాలనలో 29వ ర్యాంకు లభించాయి.


కరీంనగర్‌కు ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ జీవన నాణ్యతలో 25వ ర్యాంకు, ఆర్థిక సామర్థ్యంలో 41, సుస్థిరతలో 21, పౌరుల పర్సెప్షన్‌లో 22వ ర్యాంకు వచ్చాయి. మునిసిపల్‌ పనితీరు సూచీ మేరకు.. పౌరసేవల్లో 18వ ర్యాంకు, ఆర్థికంలో 16, సాంకేతికతలో 20, ప్రణాళికలో 31, పరిపాలనలో 35వ ర్యాంకు లభించాయి. పది లక్షలకు పైచిలుకు జనాభాగల ఉత్తమ నగరాల జాబితాలో జాతీయ స్థాయిలో విశాఖ 15, విజయవాడ 41వ స్థానంలో నిలిచాయి.


హైదరాబాద్‌కు అన్యాయం!

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ, మున్సిపల్‌ పనితీరు సూచీలో హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని నగరాలకు మంచి ర్యాంకులు దక్కకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్రం ప్రకటించిన ఈ రెండు సూచీల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది. హైదరాబాద్‌ను ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. స్కోర్‌ కేటాయింపులో పారదర్శకత పాటించలేదని పేర్కొంటున్నాయి. ర్యాంకుల కేటాయింపు జరిగిన తీరును సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2021-03-05T07:58:29+05:30 IST