హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దు : మేయర్ బొంతు

ABN , First Publish Date - 2020-07-11T21:08:13+05:30 IST

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు.

హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దు : మేయర్ బొంతు

హైదరాబాద్ : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. సచివాలయ కూల్చివేత విషయమై ప్రతిపక్షాలు గత నాలుగైదు రోజులుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చిన మేయర్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయం కూల్చివేతతో మతాలను అవమానపర్చినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో అభివృద్ధిలో భాగంగా ప్రార్థన మందిరాలను కూల్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ నేతలకు బొంతు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కూడా ప్రార్థన మందిరాలను కూల్చారన్నారు. ఆ చరిత్రలను ప్రతిపక్షాలు మరువద్దని రామ్మోహన్ చెప్పుకొచ్చారు. 


కుట్రల రాజకీయం చేయొద్దు!

గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో ఎప్పుడు మత ఘర్షణలు, కర్ఫ్యూలు ఉండేవని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ సీఎం అయ్యాక కర్ఫ్యూ అంటే తెలియకుండా చేశారన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మత ఘర్షణలు సృష్టించాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. కోర్టు తీర్పుకు లోబడి కూల్చివేత పనులు మొదలయ్యాయన్నారు. సచివాలయంలో జరిగిన ఘటనలపై మత పెద్దలతో కూడా మాట్లాడామని బొంతు చెప్పకొచ్చారు. మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని.. అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు మేయర్ సూచించారు.


ఏజెన్సీకి అప్పగించాం!

కూల్చివేసిన వేస్టేజీని తరలించే బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించామని మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో నగరంలో వేస్ట్ మేనేజ్మెంట్‌కు సరైన విధానం లేకుండే.. కానీ ఇప్పుడు జీడిమెట్లలో రీ-సైకిల్ అండ్ రీ యూజ్ కోసం ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. డేబ్రెజ్‌ను మొత్తం పతుళ్ళ గుడా, జీడిమెట్లకు తరలించే ఏర్పాటు చేశామని మీడియా ముఖంగా బొంతు రామ్మోహన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-11T21:08:13+05:30 IST