విజ్ఞాన వనం..వందేళ్ల సిటీ కళాశాల

ABN , First Publish Date - 2021-10-06T17:06:28+05:30 IST

భాగ్యనగర ఒడిలో... మూసీ నది ఒడ్డున ఠీవిగా తలెత్తుకొని నిలిచిన అద్భుతమైన కట్టడం సిటీ కళాశాల. ఇండో సారాసెనిక్‌ శైలిలో నిర్మితమైన ఆ భవనం నగర చరిత్రకు తలమానికం. ఉర్దూ

విజ్ఞాన వనం..వందేళ్ల సిటీ కళాశాల

భాగ్యనగర ఒడిలో... మూసీ నది ఒడ్డున ఠీవిగా తలెత్తుకొని నిలిచిన అద్భుతమైన కట్టడం సిటీ కళాశాల. ఇండో సారాసెనిక్‌ శైలిలో నిర్మితమైన ఆ భవనం నగర చరిత్రకు తలమానికం. ఉర్దూ మహాకవి మగ్దూం అక్కడే చదివి, అదే కాలేజీలో అధ్యాపకుడిగా సేవలందించారు. జాతీయోద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకూ, మరెన్నో పోరాటాలకు నెలవు సిటీ కళాశాల. శాస్త్రవేత్తలు, ఆచార్యులు, రాజకీయనేతలు, మేధావులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులను సమాజానికి అందించిన విజ్ఞాన వనానికి వందేళ్లు.


హైదరాబాద్‌ సిటీ: నగరంలో కొలువుదీరిన చరిత్రాత్మకమైన భవనాల్లో ప్రముఖమైంది సిటీ కాలేజీ. 1921, అక్టోబర్‌ 5న నిర్మితమైన ఆ భవన చరిత్ర ఘనమైంది. 1908, మూసీ వరద బీభత్సం అనంతరం ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు మూసీకి ఇరువైపులా నిర్మించిన ప్రజా ప్రయోజన భవనాల నిర్మాణంలో సిటీ కాలేజీ ఒకటి. భవన నమూనాను ప్రఖ్యాత బ్రిటీష్‌ ఆర్కిటెక్టు, ఉస్మానియా ఆస్పత్రి భవన రూపశిల్పి విన్సెంట్‌ హెచ్‌ రూపొందించారు. ఇండో సార్సనిక్‌ శైలిలో దర్శనమిచ్చే భవనంలో రాజసం ఉట్టిపడే ముఖద్వారం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మూసీ వరద నీటిని తట్టుకునేలా అత్యంత పటిష్టంగా మొదటి అంతస్తును లేత గులాబీ రంగు గ్రానైట్‌తో నిర్మించారు. శంషాబాద్‌, గగన్‌పహాడ్‌ ప్రాంతాల్లోని కొండను తొలిచి తవ్విన రాళ్లతో అది కట్టారు. హైకోర్టు నిర్మాణానికీ అదే రాయిని వాడినట్లు ఆర్కిటెక్టు సూర్యనారాయణ మూర్తి వివరిస్తున్నారు. ఆ పై రెండు అంతస్తులు మాత్రం డంగుసున్నం, ఇటుకలతో నిర్మించారు. భవనం పైన అత్యంత సుందరంగా కనిపించే మినార్లు, చిన్న డోములతో పాటు బ్రాకెట్స్‌, సజ్జ వంటివన్నీ హిందూ నిర్మాణ శైలిని తలపిస్తాయి. భవనంలో మొత్తం 64 గదులున్నాయి. అందులోని 24 తరగతి గదులను గాలి, వెలుతురు ప్రసరించే విధంగా నిర్మించడం ఆనాటి ఇంజినీర్ల దార్శనికతకు నిదర్శనం. భవన నిర్మాణానికి 1919లో నిజాం ప్రభుత్వం రూ.8,36,919 వెచ్చించినట్లు చరిత్ర అధ్యయనకారుడు యూనస్‌ లసానియా చెబుతున్నారు. భవన నిర్మాణానికి చీఫ్‌ ఇంజనీరుగా నవాబ్‌ ఖాన్‌ బహదూర్‌ మిర్జా అక్బర్‌ బేగ్‌ సేవలందించారు. 


రవీంద్రుడి సందర్శన

సిటీ కాలేజీలోని సెంట్రల్‌ హాల్‌ ప్రత్యేక సమావేశాలకు వేదిక. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి ప్రముఖులు సైతం సిటీ కళాశాలను సందర్శించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహాకవి మగ్దూం మొహియుద్దీన్‌ అదే కాలేజీలో చదివి, అనంతరం అక్కడే అధ్యాపకుడిగానూ కొన్నాళ్లు సేవలందించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి పూర్తి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో తన కొలువుకి రాజీనామా చేశా రు. అక్కడ కొలువుదీరిన అతి పెద్ద గ్రంథాలయంతో పాటు రసాయన శాస్త్ర ప్రయోగశాల, మ్యూజియం ప్రత్యేకమైనవి. ప్రస్తుతం డిగ్రీ, పీజీలలోని బయోటెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మకమైన 55 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 4,500 మంది విద్యార్థులు చదువుతున్నారు.


షూటింగులకు అడ్డా..

ప్రభుత్వ సిటీ కాలేజీ ఆవరణం సినిమా షూటింగులకు అడ్డా.! టాలీవుడ్‌, బాలీవుడ్‌లోని మరెన్నో చిత్రాలలో సిటీ కాలేజీ పరిసరాలను చూడొచ్చు. వెంకటేశ్‌ నటించిన ‘గణేశ్‌’, ‘యాత్ర’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘జవాన్‌’ తదితర చిత్రాలెన్నో సిటీ కాలేజీలో షూటింగులు జరిగాయి. సల్మాన్‌ఖాన్‌ ‘‘తేరేనామ్‌’’ చిత్రం మూడు నెలల పాటూ అదే కాలేజీలో చిత్రీకరణ జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ ముగిసిన అనంతరం కళాశాల భవనానికి రంగులు వేయించేందుకు సల్మాన్‌ఖాన్‌ కొంత నగదు విరాళంగా ఇచ్చినట్లు అధ్యాపకులు చెబుతున్నారు.


విద్యావనంలో విరిసిన కుసుమాలు

హైదరాబాద్‌కు 1944లో మాస్టర్‌ ప్లాన్‌ అందించిన మహ్మద్‌ ఫయాజుద్దీన్‌, కేంద్రమంత్రిగా సేవలందించిన పి.శివశంకర్‌, లోక్‌సభ పదో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్‌పాటిల్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, భారత క్రీడాకారుడు అర్హద్‌ అయూబ్‌, సినీ ప్రముఖులు ప్రభాకర్‌రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, ఉత్తేజ్‌, ఒలింపిక్స్‌లో ఆడిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు యూసుఫ్‌ ఖాన్‌, కోచ్‌ ఎస్‌ఏ రహీమ్‌, ఆచార్యులు కేశవరావు జాదవ్‌, వెలిచాల కొండలరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, ఎస్వీ సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరితో పాటు పలువురు న్యాయకోవిదులు, సివిల్‌ సర్వీసులో సేవలందిస్తున్న వారు మరెందరో సిటీ కాలేజీ విద్యావనంలో విరిసిన కుసుమాలే.! అక్కడ విద్యను అభ్యసించిన కొందరు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ రాణిస్తున్నారు.


ఇది మినీ విశ్వవిద్యాలయం : నవీన్‌ మిట్టల్‌

చార్మినార్‌ : సిటీ కళాశాల మినీ విశ్వ విద్యాలయం అని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరుకుంటున్నారని విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్నారు. మంగళవారం  ప్రభుత్వ సిటీ కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విస్తృతమైన బోధనానుభవం, ప్రగాఢమైన పరిశోధన దృష్టి కలిగిన అధ్యాపకులు సిటీ కళాశాలలో మాత్రమే ఉన్నారని కొనియాడారు. కళాశాలలో అదనపు తరగతి గదుల అవసరం ఉందని, సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


హైదరాబాద్‌ శాంతినికేతన్‌ : ఘంటా చక్రపాణి 

సామాజిక విశ్లేషకులు, రచయిత ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణలోని తొలి తరం విద్యావేత్తలు చాలా మంది సిటీ కళాశాల పూర్వ విద్యార్థులేనని, ఇది హైదరాబాదు శాంతినికేతన్‌ అని విశ్లేషించారు. కళాశాల పేరులో మాత్రమే సిటీ ఉంది కానీ, రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ విద్యా సంస్థ కొంగుబంగారంగా విలసిల్లిందని అన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నెలనెలా కళాశాలకు వచ్చి తరగతులు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నిజాం వారసుడు నవాబ్‌ నజాబ్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ తన పూర్వీకులు స్థాపించిన కళాశాల వందేళ్లలో ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. తనలాంటి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన చదువుల తల్లి సిటీ కళాశాలని పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది విద్యాధర్‌ భట్‌  అన్నారు. 


కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పి.బాల భాస్కర్‌, ఆచార్యులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ఇంటాక్‌ సంస్థకు చెందిన అనురాధా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శతాబ్ది వేడుకల డిజిటల్‌ లోగోను నవీన్‌ మిట్టల్‌ ఆవిష్కరించారు. లోగో పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆంగ్ల ఆచార్యులు శ్రీకాంత్‌ రెడ్డి సభను ఆద్యంతం సమన్వయం చేయగా, కళాశాల వందేళ్ల చరిత్ర నివేదికను తెలుగు సహాయ ఆచార్యులు డా.కోయి కోటేశ్వరరావు సమర్పించారు. 

Updated Date - 2021-10-06T17:06:28+05:30 IST