ఇండిపెండెంట్‌కే ఓటు..!

ABN , First Publish Date - 2022-04-18T17:25:00+05:30 IST

నగర శివారులోని పలు గ్రామ, నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా రూపాంతరం చెందడంతో పెట్టుబడులకు కేంద్రంగా మారాయి.

ఇండిపెండెంట్‌కే ఓటు..!

సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపన పడే వారు కొంచెం ఖరీదైనా ఇండిపెండెంట్‌ ఇంటినే తొలి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. నగరానికి దూరంలో అయినా ఇండిపెండెంట్‌ ఇంటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో శివార్లలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. టీఎ్‌సబీపాస్‌ అమల్లోకి వచ్చిన ఏడాదిన్నరలో శివారు ప్రాంతాల్లో 20 వేలకు పైగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వగా, అందులో 92 శాతం వరకు వ్యక్తిగత ఇళ్లేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 111 జీఓ తొలగిస్తే ఐటీ కారిడార్‌లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల కొనుగోలు కంటే శివారులో విల్లాల కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.


శివార్ల నుంచి భారీగా దరఖాస్తులు

ఫ్లాట్‌ కంటే వీటిపైనే ఆసక్తి

ఏడాదిన్నరలో 20వేలకు పైగా అనుమతులు

92 శాతం వ్యక్తిగత ఇళ్లే


హైదరాబాద్‌ సిటీ: నగర శివారులోని పలు గ్రామ, నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా రూపాంతరం చెందడంతో పెట్టుబడులకు కేంద్రంగా మారాయి. బడంగ్‌పేట, మీర్‌పేట, ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌, నాగారం, పోచారం, దమ్మాయిగూడ, కొంపల్లి, నిజాంపేట వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగువడంతో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు  వెలుస్తున్నాయి. కొందరు ఖాళీ జాగాలు కొనుగోలు చేసుకుని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపుతున్నారు.


నిర్ణీత గడువులోపే..

హైదరాబాద్‌తో పాటు శివారులోని ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో ఎకరం నుంచి ఆ పైన ఎన్ని ఎకరాల్లో లేఔట్‌ ఏర్పాటు చేయాలన్నా మెట్రోపాలిటన్‌ అథారిటీ అనుమతులు తీసుకోవాలి. జీ ప్లస్‌ 2 భవనాల నిర్మాణానికి పంచాయతీ అనుమతులిస్తుండగా, అదనపు అంతస్తుల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోవాలి. మున్సిపాలిటీలో జీ ప్లస్‌ 5 వరకు, కార్పొరేషన్లలో జీ ప్లస్‌ ఆరు వరకు అనుమతులిస్తున్నారు. టీఎస్‌ బీపాస్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత 75 చ.గజాల వరకు ఎలాంటి చెల్లింపులు లేకుండానే నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. 240 చదరపు గజాలు, పది మీటర్ల ఎత్తు లోపు నిర్మించే భవనాలకు అవసరమైన డాక్యుమెంట్లను పొందుపరిస్తే నిర్ణీత గడువులోపు అనుమతులిస్తున్నారు. ఏడాదిన్నరలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్మాణ అనుమతుల కోసం 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటి వరకు 20 వేల దరఖాస్తులను పరిశీలించి అనుమతులిచ్చారు.


ఫ్లాట్‌ కంటే..

శివారు ప్రాంతాల్లో ఇటీవల ఇచ్చిన నిర్మాణ అనుమతుల్లో 92 శాతం వరకు వ్యక్తిగత ఇళ్లవే ఉన్నట్లు తెలిసింది. బడంగ్‌పేట, ఫిర్జాదీగూడ, బోడుప్పల్‌, నాగారం, దమ్మాయిగూడ, తుర్కయాంజల్‌, పెద్ద అంబర్‌పేట, బండ్లగూడ జాగీర్‌, దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో ఇండిపెండెంట్‌ ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షలకు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం కంటే 120 చ.గజాల్లో సొంతింటిని నిర్మించుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధికంగా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నాయి. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఏడాదిన్నరలోనే 3,921 పర్మిషన్లు ఇవ్వగా, బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో 2,969 అనుమతులిచ్చారు. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలో 2464 నిర్మాణ అనుమతులిచ్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 32 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా, అత్యధికంగా  బడంగ్‌పేట కార్పొరేషన్‌లో నిర్మాణ అనుమతులివ్వడం విశేషం.

Updated Date - 2022-04-18T17:25:00+05:30 IST