వరస నేరాలకు పాల్పడితే పీడీయాక్ట్‌తో చెక్‌

ABN , First Publish Date - 2021-06-18T18:30:00+05:30 IST

నేరాలు చేసి జైలుకెళ్లినా బుద్ధి మారదు. నేరాల బాట వీడి.. మంచి మార్గం పట్టాలన్న ఆలోచన రాదు. వరస నేరాలకు పాల్పడుతూ

వరస నేరాలకు పాల్పడితే పీడీయాక్ట్‌తో చెక్‌

ఈ ఏడాది హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో 74మందిపై 

హైదరాబాద్‌ సిటీ: నేరాలు చేసి జైలుకెళ్లినా బుద్ధి మారదు. నేరాల బాట వీడి.. మంచి మార్గం పట్టాలన్న ఆలోచన రాదు. వరస నేరాలకు పాల్పడుతూ పలు మార్లు జైలుకెళ్తుంటారు. ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యల్లో భాగంగా పీడీయాక్ట్‌ను ప్రవేశపెట్టారు పోలీసులు. నాలుగేళ్లుగా పీడీయాక్ట్‌పై బాగా ఫోకస్‌ చేస్తున్న పోలీసులు భౌతిక దాడులకు పాల్పడే క్రిమినల్స్‌ మాత్రమే కాకుండా... వైట్‌ కాలర్‌ నేరస్థులు.. సైబర్‌ క్రైం నేరస్థులపైనా ఉక్కు పాదం మోపుతున్నారు. వారిపై కూడా పీడీయాక్ట్‌లు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 74మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 

నేరస్థులకు అడ్డుకట్ట

కరడుగట్టిన నేరస్థులు... హత్యలు, హత్యాయత్నాలు చేయడంలో వెనకాడరు. దోపిడీలు.. చైన్‌స్నాచింగ్‌లు.. మోసాలు.. భూకబ్జాలు ఇలా విభిన్న తరహాలో వివిధ కోణాల్లో నేరాలు చేస్తుంటారు. పిక్‌పాకెటింగ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా వరకు నేరాలు చేయడంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు ఆర్థిక నేరాలు.. వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌, సైబర్‌ నేరస్థులు కూడా వీరి కోవలోకి చేరుకున్నారు. అలాంటి నిందితులు పోలీసులకు చిక్కినా... కొన్ని రోజులు జైల్‌.. ఆ తర్వాత బెయిల్‌ అనే ధీమాతో... దర్జాగా నేరాలు చేస్తుంటారు. చాలాసార్లు తప్పించుకున్నప్పటికీ... కొన్ని సార్లు పోలీసులకు చిక్కుతుంటారు. జైలుకెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చిన తర్వాత పాత బాటే పడతారు. తీరుమారని కరడుగట్టిన నేరస్థులకు చెక్‌ పెట్టడానికి పోలీస్‌ బాస్‌లు పీడీ అనే పాశుపతాస్త్రాన్ని సంధిస్తున్నారు. నిందితుని ధీమా... ధైర్యాన్ని క్షణాల్లో తునాతునకలు చేసి... నేరం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో... పోలీసు అంటే ఏమిటో చూపిస్తున్నారు. నేరస్థులు ఓ నేరం చేసి మరోసారి నేరం చేయాలంటే... పీడీ యాక్ట్‌ను ఊహించుకుంటే చాలు.. నేరం చేసే ముందు పలుమార్లు ఆలోచించాల్సి ఉంటుందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరిస్తున్నారు. 2017 నుంచి పీడీయాక్ట్‌ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోనే ఉంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో గతేడాది 109 మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు. ఈ ఏడాదిలో ఐదున్నర నెలల కాలంలోనే 74మందిపై పీడీయాక్ట్‌ నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మరో ఆరున్నర నెలల కాలం మిగిలి ఉన్నందున పీడీయాక్ట్‌ల సంఖ్య 200 దాటే అవకాశముంది. 

Updated Date - 2021-06-18T18:30:00+05:30 IST