15 రోజుల్లో ‘హైడల్‌’కు మరమ్మతులు

ABN , First Publish Date - 2021-03-03T04:44:53+05:30 IST

15 రోజుల్లో ‘హైడల్‌’కు మరమ్మతులు

15 రోజుల్లో ‘హైడల్‌’కు మరమ్మతులు

లాక్‌డౌన్‌తో పనుల జాప్యం

పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ దేశ్యానాయక్‌

కూసుమంచి, మార్చి 2: పాలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో మరో 15రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని పులిచింతల ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపారు. పాలేరులోని జల విద్యుత్‌ కేంద్రంలో గత ఆర్నెళ్లుగా సుమారు రూ.2కోట్ల విలువైన విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన వైనంపై మంగళవారం ‘హైడల్‌లో నిర్లక్ష్యపు నీడ’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ దేశ్యానాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. వాస్తవానికి గత వేసవిలోనే మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో పనులు నిర్వహించలేకపోయినట్టు ఆయన తెలిపారు. తర్వాత ఎడమకాల్వకు నీటివిడుదల కారణంగా డ్రాఫ్ట్‌ట్యూబ్‌ గేట్లు ఎత్తడం సాధ్యం కాలేదని తెలిపారు. అయినప్పటికీ మరమ్మతులు ప్రారంభించామని, డీటీ గేట్లకు రోలర్స్‌, బేరింగ్‌లు కొత్తవి అమర్చి మరో 15 రోజుల్లో పూర్తిచేసి ఈ సీజన్‌లోనే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టులో ఓఅండ్‌ఎం అదనపు సిబ్బంది ఉన్నమాట వాస్తవమేనన్నారు. పులిచింతల ప్రాజెక్టులో సిబ్బంది కొరత ఉన్నందున ఇక్కడ వారికి అక్కడ డిప్యుటేషన్‌పై విధులు కేటాయించినట్టు తెలిపారు. ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

Updated Date - 2021-03-03T04:44:53+05:30 IST