నైరుతిలో అభివృద్ధికి

ABN , First Publish Date - 2022-04-23T16:02:53+05:30 IST

జీఓ-111 ఆంక్షలు తొలగిస్తే పశ్చిమాన అభివృద్ధిపై ప్రభావం పడొచ్చు. కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో విస్తరిత అభివృద్ధి

నైరుతిలో అభివృద్ధికి

పశ్చిమాన పరిస్థితి ఏంటో? 

ఉన్నత స్థాయి సమావేశంలో రియల్టర్ల సందేహాలు

సీఎం వద్దా దీనిపై చర్చ.. 

అభివృద్ధి మందగించే అవకాశం?


హైదరాబాద్‌ సిటీ: ‘జీఓ-111 ఆంక్షలు తొలగిస్తే పశ్చిమాన అభివృద్ధిపై ప్రభావం పడొచ్చు. కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో విస్తరిత అభివృద్ధి మందగించే సూచనలున్నాయి’ 

- ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులతో 

కొందరు రియల్టర్లు


ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్ద గతంలో జరిగిన సమావేశంలో అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం హైదరాబాద్‌కు లార్జర్‌ డెవల్‌పమెంట్‌ స్కోప్‌ ఉంది. ఎంత భూమి అందుబాటులోకి వచ్చినా ఇబ్బందేం ఉండదన్నారని ఓ అధికారి చెప్పారు. 

హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పటి వరకు పశ్చిమం వైపునే కేంద్రీకృతమైంది. మాదాపూర్‌ మొదలు నల్లగండ్ల, తెల్లాపూర్‌, ఇటు పటాన్‌చెరు వరకు జెట్‌ స్పీడ్‌తో అభివృద్ధి జరుగుతోంది. విల్లాల నుంచి ఆకాశహర్మ్యాల వరకు కోకొల్లలుగా కొత్త రియల్‌ ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. ఇప్పుడీ అభివృద్ధికి కొంత కాలం స్పీడ్‌ బ్రేకులు పడతాయా, ఆయా ప్రాంతాల్లోని శరవేగవంతమైన రియల్‌ పురోగతి మున్ముందు మందగించే సూచనలున్నాయా అంటే ఔననే అంటున్నారు అధికారులు, రియల్‌ రంగ నిపుణులు. 

మార్గదర్శకాలు కీలకం

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్నా జీఓ 111 పరిధిలో ఉండడంతో కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఆంక్షల ఎత్తివేత నిర్ణయం నేపథ్యంలో మంచిరేవుల, వట్టినాగులపల్లి, ఖానాపూర్‌, అజీజ్‌నగర్‌ తదితర గ్రామాల్లో నయా అభివృద్ధికి అడుగులు పడతాయని నిపుణులు చెబుతున్నారు. గోపన్‌పల్లి, గౌలిదొడ్డిలోని కొన్ని ఏరియాలకూ మహర్దశ పట్టనుంది. సర్కారు తాజా నిర్ణయంతో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. జీఓ రద్దు నిర్ణయంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఐటీ కారిడార్‌కు సమీపంలోని గ్రామాల్లో మొన్నటి వరకు ఎకరం రూ.5-6 కోట్లు పలకగా.. ఇప్పుడు రెట్టింపు అయింది. మున్ముందు డిమాండ్‌ను బట్టి ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.50-60 కోట్లు పలుకుతున్న కోకాపేట, తెల్లాపూర్‌ ప్రాంతాలతో పోలిస్తే అంతే దూరంలో ఉన్న జీఓ-111 పరిధిలోని కొన్ని ఏరియాల్లో తక్కువ ధరకు భూమి లభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రియల్‌ రూటు మారుతుందని వ్యాపారులు చెబుతున్నారు.


ఔటర్‌కు దగ్గరగా ఉండడం.. మౌలిక సదుపాయాల ఇబ్బందులు అంతగా లేకపోవడం ఈ ప్రాంతాలకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అయితే ప్లానింగ్‌ మార్గదర్శకాలు అభివృద్ధిలో కీలకమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవనాల ఎత్తుపైనా ఆంక్షలుంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎకరంలో 10 అంతస్తులు నిర్మిస్తే.. ఎక్కువ ఫ్లాట్‌లు విక్రయించవచ్చు. అదే స్థలంలో ఐదంతస్తులు నిర్మిస్తే ఫ్లాట్‌లు తక్కువగా ఉంటాయి. నిర్మాణ వ్యయాన్ని పక్కన పెడితే భూమి ధరను ఆయా ఫ్లాట్ల నుంచే నిర్మాణదారులు తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి చెప్పారు. దీంతో చదరపు అడుగు ధర ఎక్కువగా ఉండొచ్చు. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ నివేదిక వస్తే కానీ.. జీఓ-111 పరిధిలో అభివృద్ధికి ఎలాంటి ఆస్కారం ఉంటుంది, పశ్చిమం వైపు డెవల్‌పమెంట్‌పై ప్రభావం ఉంటుందా, లేదా..? అన్న దానిపై ఓ అంచనాకు రావచ్చని పట్టణ ప్రణాళికా విభాగం అధికారొకరు చెప్పారు. 


ఎకరం కోట్లు.. 

నగరంలో కీలక ఉపాధి కేంద్రంగా ఐటీ కారిడార్‌ మారింది. ఈ క్రమంలో మాదాపూర్‌, గచ్చిబౌలి, చందానగర్‌, మియాపూర్‌, నానక్‌రాంగూడ, మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి తదితర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్‌లూ అదే దారిలో నడుస్తున్నాయి. కొంత కాలంగా బడా నిర్మాణ సంస్థల ప్రాజెక్టుకు ఈ ప్రాంతాలే అడ్డా. ఔటర్‌కు ఆనుకొని ఉన్న కొల్లూరు వరకు అభివృద్ధి పరుగులు తీస్తోంది. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌ వైపూ అభివృద్ధి విస్తరించింది. ప్రగతినగర్‌, బాచుపల్లి ఐటీ కారిడార్‌కు 20 నుంచి 25 కి.మీల దూరంలో ఉంటాయి.


అయినా బడ్జెట్‌ లెక్కలు వేసుకునే కొందరు ఆయా ప్రాంతాల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. గచ్చిబౌలి నుంచి ఎనిమిది, పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట, తెల్లాపూర్‌, నల్లగండ్ల ప్రాంతాల్లో భూమి బంగారమైంది. నివాస సముదాయాలతో పాటు ఐటీ, ఇతరత్రా సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. కోకాపేటలో కొన్ని నెల క్రితం హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.60 కోట్లు పలికింది. భూముల ధరలు రూ.50 కోట్లు దాటడంతో ఆ స్థలాల్లో నివాసాలు, వాణిజ్య నిర్మాణాలకూ కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఐటీ కారిడార్‌ పరిసరాల్లో ఏ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలన్నా.. కనీసం రూ.2 కోట్ల నుంచి మూడు కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. సదుపాయాలను బట్టి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు పలుకుతోంది. విల్లాల ధరలు రూ.20-30 కోట్లకు చేరుకున్నాయి. నివాస సముదాయాల్లో చదరపు అడుగు ఫ్లాట్‌కు ఏరియాను బట్టి రూ.8 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. పశ్చిమాన భూమి లభ్యత పరిమితంగా ఉండడం.. కొనుగోలుకు పోటీ ఎక్కువవడంతో ఎకరం రూ.కోట్లలో పలుకుతోందని ఓ రియల్టర్‌ తెలిపారు.  


వేచి చూడాలి

పశ్చిమాన అభివృద్ధిపై ప్రభావం ఉంటుందా, లేదా..? అంటే ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న పెరి అర్బన్‌ జోన్‌లో స్థల విస్తీర్ణంలో కేవలం 25 శాతమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తరహా నిబంధనలుంటాయా, లేదా జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ అంతటా ఒకేలా ఉంటాయా అనేది చూడాలి. ఏదేమైనా హైదరాబాద్‌కు నలువైపులా అభివృద్ధి విస్తరిస్తోంది. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ల రూపురేఖలు మారాయి. కొన్నాళ్లపాటు స్తబ్ధత ఉన్నా అనంతర కాలంలో పశ్చిమం వైపు అభివృద్ధికి ఢోకా ఉండదు. 

-శేఖర్‌రెడ్డి, సీఐఐ,  ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌

Updated Date - 2022-04-23T16:02:53+05:30 IST