హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అదుపు లేని ఎన్నికల కమిషన్‌

ABN , First Publish Date - 2021-10-19T06:03:54+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అదుపు తప్పిందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యంఠాగూర్‌ అన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అదుపు లేని ఎన్నికల కమిషన్‌
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యంఠాగూర్‌

 కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న టీఆర్‌ఎస్‌

 తెలంగాణ రాష్ట్రం రూ. 4లక్షల కోట్ల అప్పుల్లో ఉంది

 కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యంఠాగూర్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 18: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అదుపు తప్పిందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యంఠాగూర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఖర్చు పెడుతుందన్నారు. కోట్ల డబ్బులు హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో పంచుతున్న ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోటీ అన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు రూ. 4లక్షల కోట్ల అప్పుల్లో కూలుకుపోయిందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఇంకా పది రోజల టైం ఉందని, మా టీమ్‌లు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికలో ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల కమిషన్‌ సహకరిస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని, ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావులు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు డబ్బులతో గెలవాలని చూస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక చిన్న ఎన్నిక అంటున్న కేటీఆర్‌ ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ఒకటేనన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావుకు క్లీన్‌ ఈమేజ్‌ ఉందని దీమా వ్యక్తం చేశారు. దేశంలోని అత్యంత అవినీతి సీఎం కేసీఆర్‌ అని, రాష్ట్రంలో నియంత పాలన జరుగుతుందన్నారు. సమావేశంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ నేతలు శ్రీనివాసకృష్ణన్‌, మల్లు రవి, బలరాంనాయక్‌, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్‌వి

- మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నించే వారిని పోలీసులతో అణగదొక్కుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తులు, గల్లిలో కుస్తీలుగా వ్యవహరిస్తున్నారన్నారు.


 తెలంగాణను రాబందుల కుటుంబం దోచుకుంటుంది

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌


తెలంగాణను రాబందుల కుటుంబం ఏడేళ్లుగా దోచుకుంటుందని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కుల ప్రతిపాదికన సమావేశాలు పెడుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. దళితులను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-19T06:03:54+05:30 IST