Abn logo
Oct 27 2021 @ 11:05AM

హుజురాబాద్: ఓటుకు నోటు పంపిణీకి రహస్య ఏర్పాట్లు!

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓటుకు నోటును పంపిణీ చేసేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మద్యం సీసాలను జోరుగా పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాంసంతోపాటు మద్యం విచ్చల విడిగా పంచినట్లు తెలియవచ్చింది. పోలింగ్‌కు ముందు 28, 29 తేదీల్లో తెరవెనుక జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే.. రేపు, ఎల్లుండి తెరవెనుక జరిగే ప్రచారం మరొక ఎత్తని నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిళాలు, ప్రలోభాల పర్వం అధికంగా కనిపించే వీలుంది.


హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున బలుమూరి వెంకట్... ప్రచారంలో నువ్వా.. నేనా.. అనే రీతిలో పోటీపడుతున్నారు. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption