భర్త హత్య.. భార్య ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-04-15T05:51:47+05:30 IST

భర్త హత్యకు గురయ్యాడని తెలుసుకున్న వెంటనే..

భర్త హత్య.. భార్య ఆత్మహత్య!
హత్యకు గురైన నాగరాజు (ఫైల్‌).. ఆత్మహత్య చేసుకున్న శ్రీవల్లి (ఫైల్‌)

మర్లపాడు సమీపంలో గల వాగులో యువకుడి మృతదేహం

భర్త మృతి వార్త తెలిసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్న భార్య 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసాద్‌


ఒంగోలు: భర్త హత్యకు గురయ్యాడని తెలుసుకున్న వెంటనే భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఒంగోలులో బుధవారం సంచలనంగా మారింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒంగోలు సీతారామపురానికి చెందిన ఆటోడ్రైవర్‌గా పనిచేసే కభాలి నాగరాజు(27) హత్యకు గురయ్యాడు. బుధవారం టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలో ఇనగలేరు వాగులో మృతదేహం పడి ఉంది. ఆ సమాచారం తెలుసుకున్న భార్య శ్రీవల్లి (21) ఒంగోలు సంజీవ్‌గాంధీ నగర్‌లో గల అద్దె ఇంటిలో ఉరివేసుకుంది. నాగరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణం అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 


మూడేళ్ల క్రితం వివాహం

మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన శ్రీవల్లి ఒంగోలు పెద్దమసీదు వద్ద వస్త్రదుకాణంలో పనిచేసేది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే నాగరాజును ప్రేమించింది. వారి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికి వారు వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనిపై పోలీసుస్టేషన్‌లో కేసులు నడుస్తున్నాయి. నాలుగునెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. నాగరాజు సీతా రామపురం హిల్‌కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. శ్రీవల్లి సంజీవ్‌గాంధీ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ వస్త్రదుకాణంలో పనిచేస్తుంది.


జాళ్ళపాలెం తిరునాళ్ళకు అని నాగరాజు ఇంటి నుంచి మంగళవారం ఉదయం వెళ్లాడు. అయితే రాత్రి 8గంటలకు తన సోదరుడు లారీడ్రైవర్‌గా పనిచేసే రంగయ్యకు ఫోన్‌ చేసి తాను జాళ్ళపాలెం తిరునాళ్లకు వెళుతున్నానని చెప్పాడు. అయితే రంగయ్య తాను ఊటీలో ఉన్నానని తిరునాళ్లకు రాలేనని బదులిచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెల్లవారేసరికి మర్లపాడు సమీపంలో ఇనగలేరు వాగులో నాగరాజు మృతదేహం కనిపించింది. గ్రామ వీఆర్వో శ్రీదేవి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.


మృతదేహంపై తీవ్రగాయాలు

ఆటోడ్రైవర్‌ నాగరాజు మృతదేహంపై గాయాలున్నాయి. పదునైన ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. తల వెనుక భాగంలో బలమైన గాయం ఉంది. అంతేకాకుండా గొంతులో, ఛాతిపైనా, ముఖంపైన గాయాలు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతని దగ్గర దొరికిన సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతుడిని గుర్తించారు. 


పోలీసులు రావడంతో శ్రీవల్లి ఆత్మహత్య

నాగరాజు మృతిచెందాడని తెలిసి స్థానిక సీతారామపురంలోని అత్తగారి ఇంటికి శ్రీవల్లి తన తల్లి, సోదరితో కలిసి వెళ్లింది. అయితే అక్కడ ఎవరు లేరు. అదేసమయంలో పోలీసులు వారిని వెతుకుంటూ అక్కడకు వెళ్లారు. శ్రీవల్లిని విచారించాలి రమ్మని పిలిచారు. వారివెంట కొంతదూరం వచ్చిన శ్రీవల్లి పర్సు తీసుకువస్తాను అని చెప్పి ఆమె నివాసముండే సంజీవ్‌ గాంధీ నగర్‌కు వెళ్ళింది. వెళ్లిన శ్రీవల్లి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లి, సోదరి ఆందోళనతో వెళ్లి చూడగా ఇంట్లో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను కిందకు దించి చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పోలీసులు సహకరించి ఉంటే తమ బిడ్డ బతికేదని శ్రీవల్లి తల్లి విలపించింది. 


వివాహేతర సంబంధాలపై పోలీసుల ఆరా

ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్న వారు ఎందుకు విడిపోయారు, ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా భర్త మృతిచెందాడన్నా తర్వాత భార్య ఆత్మహత్యకు పాల్పడటంపైన కూడా విచారిస్తున్నారు. నాగరాజు ఇంటి నుంచి బయిటకు వెళ్లిన తర్వాత ఎవరితో తిరిగాడు. జాళ్లపాలెం వెళతానని సోదరుడితో చెప్పాడు. అప్పటి నుంచి ఎవరిని కలిశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


డీఎస్పీ పరిశీలన

నాగరాజు మృతదేహం పడవేసిన ప్రాంతాన్ని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ పరిశీలించారు. ఘటనను హత్యకేసుగా నమోదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వారి మధ్య కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. అలాగే శ్రీవల్లి ఆత్మహత్య చేసుకుందని, ఈ కేసును ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేశాన్నారు.



Updated Date - 2021-04-15T05:51:47+05:30 IST