Abn logo
May 29 2020 @ 15:27PM

భార్య ప్రసవించిన 12 గంటలకే భర్త దుర్మరణం.. ఆమెకు విషయం చెప్పకుండానే..

అటు సంతోషం.. ఇటు విషాదం

ఆ వృద్ధ దంపతుల పరిస్థితి కడుదయనీయం

మనవడు పుట్టిన ఆనందంలో ఉండగా..

ఈతకెళ్లి కొడుకు మృత్యువాత

రెడ్డినగర్‌ సమీపంలోని సాగర్‌ కాలువ వద్ద ఘటన

మృతుడిది దర్శి మండలం అబ్బాయిపాలెం

బాలింత కావడంతో భర్త మృతి  విషయాన్ని

భార్యకు చెప్పకుండా దాచిన బంధువులు


ముండ్లమూరు (ఆంధ్రజ్యోతి): ఒకే ఆసుపత్రిలో.. ఒకే కుటుంబంలో... అమ్మగర్భం నుంచి బయటకొచ్చి తల్లి పొత్తిళ్లలో, వెచ్చని స్పర్శలో శిశువు కేరింతలు ఒకవైపు.. ఆరడుగుల భూగర్భంలోకి వెళ్లేందుకు విగతజీవి అయిన శిశువు తండ్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మరోవైపు.. ఆ కుటుంబానికి తీరని, ఆరని శోకం నాన్న ప్రేమను అణువంతైనా పంచలేదు! తనివితీరా తడిమి  ముద్దాడిందీ లేదు!! కొడుకు పుట్టి పన్నెండు గంటలైనా గడవకముందే ఆ ఆనందపు మధురక్షణాల డోలికల్లో విహరిస్తున్న తండ్రిని జలగండం బలితీసుకుంది!! కొడుక్కి ప్రతిరూపం అటు.. కొడుకు మృతదేహం ఇటు.. వయస్సు మళ్లిన ఆ తల్లిదండ్రుల గుండెలు మౌనంగా, దీనంగా రోదిస్తూనే ఉన్నాయి!!!


దర్శి మండలంలోని అబ్బాయిపాలెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఒకరి పుట్టుక, మరొకరి దుర్మరణంతో అంతులేని ఆవేదన ను నింపింది. ఇంతకు అత్యంత దురదృష్టం ఏంటంటే భర్త చనిపోయాడని పచ్చి బాలింత అయిన అతని భార్యకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తెలియనివ్వలేదు. వివరాల్లోకెళ్తే... దర్శి మండలం అబ్బాయిపాలేనికి చెందిన పిట్టం అజయ్‌రెడ్డి(23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌ సమీపంలోని సాగర్‌ కాలువలో ఈత కొట్టేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చాడు. అందరూ సంతోషంగా కాలువలో దిగారు. సరదాగా ఈత కొడుతున్నారు. అజయ్‌రెడ్డి తన స్నేహితులిద్దరూ మునిగిపోతుండడంతో కాపాడి కాలువలో ఉన్న పూడులో ఇరుక్కుపోయి మృతి చెందాడు. స్నేహితులు కేకలు వేసి మృతుడి బంధువులకు అసలు విషయం చెప్పి భయంతో ఎక్కడికో వెళ్లిపోయారు.


అజయ్‌రెడ్డికి గతేడాదే వివాహమైంది. అతని భార్య బుధవారం సాయంత్రం దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు చనిపోవడంతో అజయ్‌రెడ్డి తల్లిదండ్రులు వెంకటసుబ్బారెడ్డి, ప్రభావతిలు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య పచ్చి బాలింతరాలు కావడం, ఆరోగ్య రీ త్యా ఆమెకు భర్త మృతి చెందాడన్న వార్త ఎవరూ చెప్పలేదు. ఈ విషయం తెలియని ఆమె కొడుకు పుట్టాడన్న ఆనందంలోనే గడుపుతోంది. అయితే భర్త మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆమె ఉన్న దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలోకే తరలించారు. పొత్తిళ్లలో కొడుకుతో ఆమె అదే ఆస్పత్రిలో ఒకవైపు,  భర్త మృతదేహం మరోవైపు మార్చురీలో ఉండడం చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. అజయ్‌రెడ్డి మృతిపై కెల్లంపల్లి వీఆర్వో ఎం. పెద్దన్న ఫిర్యాదు మేరకు ఎస్సై కె.రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement