Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాస్టళ్లలో ఆకలి కేకలు!


మెనూలో భారీగా కోత

మూడేళ్లుగా మెస్‌ చార్జీలు పెంచకపోవడమే కారణం

అర్ధాకలితో గడుపుతున్న విద్యార్థులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

సంక్షేమ వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. కోడిగుడ్డు వారానికి ఆరు రోజుల పాటు ఇవ్వాలి. కానీ రెండు రోజులే పెడుతున్నారు. చికెన్‌ను ఒక రోజుకే పరిమితం చేస్తున్నారు. కూరలు, ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడుతోంది. ఇదేమని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం అందిస్తున్న మెస్‌ చార్జీలకు ఇంతకంటే పెట్టలేమని హాస్టల్‌ వార్డెన్లు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు వెనుకబడిన తరగతులకు సంబంధించి 136 వరకూ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 48, గిరిజన సంక్షేమ శాఖ - 50, గురుకులాలకు సంబంధించి 38 హాస్టళ్లు నడుస్తున్నాయి. మూడో తరగతి నుంచి పోస్టుమెట్రిక్‌ వరకూ 7,600 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌కు సంబంధించి మూడు నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థికి రూ.1,000, 6 నుంచి పదో తరగతి వరకూరూ.1,250, ఇంటర్‌ విద్యార్థులకు రూ.1,400 వరకూ మెస్‌చార్జీల రూపంలో చెల్లిస్తున్నారు.   పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ చార్జీలు చాలడం లేదని వసతిగృహ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కాస్మెటిక్‌ చార్జీలు పెంచాలని, సక్రమంగా చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. హెయిర్‌ కటింగ్‌, నూనె, సబ్జుల కొనుగోలుకు వీలుగా విద్యార్థులకు ప్రభుత్వం కాస్మెటిక్‌ చార్జీలను చెల్లిస్తోంది. 3 నుంచి 7 తరగతుల వరకూ రూ.125, 8 నుంచి పదో తరగతి వరకూ రూ.160  అందజేస్తోంది. కానీ ఇవి తమకు సక్రమంగా చెల్లించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 

 మూడేళ్ల కిందట పెంపు

టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా 2018లో మెస్‌ చార్జీలను పెంచారు. అప్పట్లో ఉన్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెంచడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తూ వచ్చారు. కానీ గత ఏడాది కరోనా వ్యాప్తితో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పాత ధరలకు అనుగుణంగా ప్రస్తుతం భోజనం పెట్టడం భారమవుతోంది. ప్రభుత్వం చెల్లించే ధరకు.. బయట మార్కెట్‌లో ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉండడంతో ఏం చేయాలో వార్డెన్లకు పాలుపోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉన్నతాధికారులు ఎక్కడ బాధ్యులను చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

మెస్‌ చార్జీలు పెంచాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. వార్డెన్ల నుంచి ఇవే వినతులు వస్తున్నాయి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి విన్నవించాం. 2018లో ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచింది. అప్పటికీ ఇప్పటికీ నిత్యావసరాల ధరలు చాలా పెరిగాయి. 

- జి.రాజారావు, బీసీ వెల్ఫేర్‌ అధికారి, శ్రీకాకుళం.


2018లో పెంచిన ధరలతో పోలిస్తే..

===============================================

సరుకు             ప్రభుత్వం చెల్లిస్తున్నది           ప్రస్తుత ధర (కిలో)

===========================================

పామాయిల్‌           రూ.70                          రూ.140

వేరుసెనగ            రూ.100                          రూ.115

బఠానీ                రూ.40                           రూ.80

కంది పప్పు            రూ.75                           రూ.130

చింతపండు           రూ. 30                           రూ.55

ఎండు మిర్చి          రూ.140                           రూ.175

చికెన్‌                రూ.120                           రూ.240

కారం                రూ.140                           రూ.220

పసుపు               రూ.120                          రూ.180

కూరగాయలు          రూ.20                           రూ.40

పాలు (లీటరు)       రూ.40                            రూ.60

గుడ్లు (ఒకటి)        రూ. 3.50                          రూ.5.50
Advertisement
Advertisement