మానవత్వం చాటుకున్న ఆటోడ్రైవర్‌

ABN , First Publish Date - 2021-05-17T07:18:38+05:30 IST

కరోనా బారిన పడి మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి పామూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు.

మానవత్వం చాటుకున్న ఆటోడ్రైవర్‌
మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న డ్రైవర్‌

మరో  కరోనా మృతుడికి అంత్యక్రియలు 

పామూరు, మే 16 : కరోనా బారిన పడి మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి పామూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పామూరుకు చెందిన సురేంద్ర (40) తన భార్యాబిడ్డలతో బతుకుదెరువు కోసం చెన్నైకు వలన వెళ్ళి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్వగ్రామమైన పామూరు వచ్చిన ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌లో చేర్పించారు. పది రోజుల నుంచి అక్కడ వైద్యం పొందుతున్న సురేంద్ర శనివారం కన్నుమూశాడు. ఒంగోలులోనే అంత్యక్రియలు చేసేందుకు  ప్రయత్నించిన తల్లిదండ్రులకు అక్కడ రూ.40వేలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని వారు పామూరులో కరోనా మృతులకు సేవాభావంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్‌ కె.ప్రభాకర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం స్థానిక స్మశాన వాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చారు. బంధువుల సమక్షంలో వారి సంప్రదాయాల ప్రకారం ఆయన మృతదేహానికి ఆటో డ్రైవర్‌ దహన సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. 

Updated Date - 2021-05-17T07:18:38+05:30 IST