ఈ రోడ్డులో ప్రయాణమెలా...!

ABN , First Publish Date - 2022-07-29T04:30:25+05:30 IST

ఆ రోడ్డులో ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు.

ఈ రోడ్డులో ప్రయాణమెలా...!
కంకర తేలి అధ్వానంగా ఉన్న రాయచోటి-సుండుపల్లె రోడ్డు

అధ్వానంగా ఉన్న రాయచోటి-సుండుపల్లె రోడ్డు

సాగుతూనే ఉన్న డబుల్‌ లేన్‌ రోడ్డు పనులు

ఎప్పటికి పూర్తవుతుందో...

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు


ఆ రోడ్డులో ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ రోడ్డులో గమ్య స్థానానికి చేరుకోవాలంటే దాదాపు గంటన్నర సమయం పడుతోంది. రాయచోటి నుంచి సుండుపల్లెకు డబుల్‌ లేన్‌ రోడ్డు పనులను గత ఏడాది ప్రారంభించారు. ఆ పనులు నత్తను తలపించేలా ఉన్నాయి. రోడ్డంతా తవ్వేసి కంకర వేసి అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


రాయచోటి టౌన్‌, జూలై 28: రాయచోటి-సుండుపల్లె డబుల్‌ లేన్‌ రోడ్డు పనులు నత్తను మరిపిస్తున్నాయి. ఇలా జరిగితే పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలతో ఆ రోడ్డులో ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. రాయచోటి-సుండుపల్లె మార్గంలో 20 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.38 కోట్లు కేటాయించింది. అలాగే ఆ రహదారిలో 6 కిలోమీటర్ల మేర ఉన్న అటవీ శాఖ భూమిలో భూసేకరణ కోసం రూ.20 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.58 కోట్లతో పనులు పొందిన ఓ నిర్మాణ సంస్థ వారు గత సంవత్సర కాలంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు. డబుల్‌ లేన్‌ రోడ్డు పనులకు 2021వ సంవత్సరం ఏప్రిల్‌ నెల 5వ తేదీ ప్రారంభోత్సవం చేసి సెప్టెంబరు నెలలో పనులు మొదలు పెట్టారు. ఈ పనులు 2023 డిసెంబరు 30వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనుల్లో 20 కిలోమీటర్లకు గానూ అనుంపల్లె అటవీ ప్రాంతంలో 6 కిలోమీటర్ల రోడ్డు పనులకు ఫారెస్టు అధికారుల అనుమతులు ఇంకా రాలేదు. అటవీ ప్రాంతంలో భూసేకరణ విషయంలో ఇటు ఆర్‌అండ్‌బీ అధికారులకు, అటు ఫారెస్టు అధికారులకు మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అటవీ ప్రాంతంలో పనుల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగడం లేదు. రోడ్డు నిర్మాణ పనుల విషయంలో ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాయచోటి నుంచి అనుంపల్లె వరకు రోడ్డంతా తవ్వేసి కంకర తోలి తారు వేయకుండా వదిలేయడంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా పాత తారురోడ్డు దెబ్బతినడంతో పాటు రోడ్డు మీద వేసిన కంకర రాళ్లు పైకి తేలి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టని ప్రాంతాల్లో తారు రోడ్డుకు ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురి కావడంతో రాత్రి సమయంలో ప్రయాణం నరకమయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తారు రోడ్డు దిగే అవకాశం లేక వాహనాలు బోల్తా పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. రోడ్డు పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ద్విచక్రవాహనాలతో పాటు ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు బోల్తాపడి ప్రయాణికులు గాయపడి కడప, తిరుపతి, ఏలూరు తదితర ప్రాంతాల్లో ఆసుపత్రుల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. కంకర పనులు పూర్తయిన వరకు తారురోడ్డు పనులు త్వరగా చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి

- కిశోర్‌రాజు, శిబ్యాల

రాయచోటి-సుండుపల్లె రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఆర్‌అండ్‌బీ అధికారులు తగు చర్యలు తీసుకుని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి సత్వరం రోడ్డు పనులు పూర్తి చేయాలి. ఒప్పందం ప్రకారం పనులు సకాలంలో పూర్తి చేయని పక్షంలో కాంట్రాక్టు రద్దు చేయాలి. రోడ్డు పనులు ఆలస్యంగా జరుగుతుండడం వలన ఎంతో మంది వాహనదారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారు. 


ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం

- సురే్‌షనాయక్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ

రాయచోటి-సుండుపల్లె మార్గంలో జరుగుతున్న డబుల్‌ లేన్‌ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుంపల్లె అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల మేర అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన ప్రాంతంలో  కూడా పనులను వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.



Updated Date - 2022-07-29T04:30:25+05:30 IST