కరోనా తగ్గాక ఆహారం ఎలా?

ABN , First Publish Date - 2020-08-16T19:04:12+05:30 IST

కోవిడ్‌ -19 వచ్చి తగ్గిన తరువాత కూడా ఆకలి తక్కువగా ఉండడం, ఆహారం రుచించకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం కష్టం.

కరోనా తగ్గాక ఆహారం ఎలా?

కరోనా వచ్చి తగ్గాక నాకు శక్తి కూడా తగ్గింది. త్వరగా కోలుకొని బలం రావాలంటే ఎలాంటి పౌష్టికాహారం అవసరం?

- పి జి ఆర్‌, వరంగల్‌ 

కోవిడ్‌ -19 వచ్చి తగ్గిన తరువాత కూడా ఆకలి తక్కువగా ఉండడం, ఆహారం రుచించకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం కష్టం. అందువల్లే నీరసంగా అనిపిస్తుంది. 


ఆహారంలో శక్తినిచ్చే పిండిపదార్ధాలు, మంచి కొవ్వులు, మాంసకృత్తులు, జీవవ్యవస్థలన్నిటి పనితీరు సక్రమంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, అన్నిటినీ తగు పాళ్ళలో తీసుకుంటేనే త్వరగా కోలుకోగలుగుతారు. ఉదయం అల్పాహారంలో గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అన్నం లేదా రొట్టెలతో పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, చికెన్‌, చేప వంటి మాంసాహారం, పెరుగు తీసుకోండి.


రాత్రి నిద్ర పోయే రెండు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. స్నాక్స్‌గా వేయించిన లేదా ఉడికించిన వేరుశెనగ, వేయించిన బఠాణీలు, సెనగలు, నానబెట్టిన బాదం, ఆక్రోట్‌, అన్ని రకాల పండ్లు, ఉడికించిన సెనగలు, అలసందలు, బొబ్బర్లు, పెసలు లాంటి పప్పులు తీసుకుంటే కావలసిన శక్తితో పాటు ప్రోటీన్లు, ఐరన్‌, జింక్‌, వివిధ రకాల విటమిన్లు అందుతాయి. రాత్రి పడుకోబోయే ముందు మరొక కప్పు పాలు తాగవచ్చు. సరైన ఆహారంతో పాటు శక్తిని బట్టి తేలికపాటి వ్యాయామం కూడా చేస్తే తీసుకున్న ఆహారంలోని పోషకాలు చక్కగా వంటబడతాయి. తగినన్ని నీళ్లు తీసుకోవాలి. కాఫీలు, టీలు, ధూమపానం, మద్యపానం ఆకలిని మందగింపచేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ముఖ్యం.



డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.com)

Updated Date - 2020-08-16T19:04:12+05:30 IST