చదివేదెలా..?

ABN , First Publish Date - 2021-02-24T05:04:38+05:30 IST

పాఠశాల ఆవరణలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయడమేంటీ? విద్యార్థుల ఇబ్బందులను గుర్తించరా..

చదివేదెలా..?
మార్కెట్‌లో అరుపులకు తరగతి గదుల కిటికీలు మూసేసిన దృశ్యం

మార్కెట్‌ ఏర్పాటుతో విద్యార్థులకు ఇబ్బందులు

రూ.80.27 లక్షలతో తాత్కాలిక మార్కెట్‌కు అంచనాలు

ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు


ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 23: ‘‘ఒరేయ్‌ ఇదేమైనా బడి అనుకున్నారా.. సంత అనుకున్నారా.. చదువుకోకుండా ఈ అల్లరేంటి..’’ ఇదీ తరచుగా తరగతి గదుల్లో అల్లరి చేస్తున్న విద్యార్థులను ఉద్ధేశించి ఉపాధ్యాయుల మందలింపు. ప్రొద్దుటూరు పట్టణంలో పాఠశాల పక్కనే కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయడంతో ఈ మందలింపు కాస్త నిజమైపోయింది. సరస్వతీ నిలయం సంతలా మారింది.

ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం సెంటర్‌లోని కూరగాయల మార్కెట్‌ అధునికీకరణలో భాగంగా కొన్ని రోజుల క్రితం తొలగించారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క తాత్కాలిక నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క వ్యాపారులు తమ దుకాణాలను తరగతి గదులకు సమీపంలోనే ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయల విక్రయాలు వారి జీవనాధారమైనా.. తరగతి గదులకు సమీపంలో అరుపులు, కేకలు విద్యార్థులకు ఇబ్బంది కల్గిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తరగతి గదులకు కిటికీలు మూసివేసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, వెలుతురు అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే, పాఠశాల వదిలే సమయంలో వందలాది మంది విద్యార్థులు కూరగాయల దుకాణాల మధ్య నుంచి రావాల్సివుంది. పాఠశాల అవరణలో లగేజీ ఆటోలు కూడా తిరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అంతేగాకుండా అక్కడే గ్రంఽథాలయం ఉంది. దాని పక్కనే కూరగాయల అంగళ్లు ఉండటంతో అక్కడికొచ్చే పాఠకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.


తాత్కాలిక కట్టడాలకు అంచనాలు

మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు కోసం రూ.80.27లక్షల వ్యయంతో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అంచనాలు తయారుచేసంది. ఏ, బీ రెండు బ్లాకులుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ రెండు బ్లాకుల్లో వ్యాపారులకు అనుకూలంగా షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం రూ.65.20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇన్‌, ఆవుట్‌ గేట్లు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ.8.29 లక్షలు ఖర్చు చేస్తున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.6.78లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తంలో నుంచే బోరు, ట్యాంకు నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈ టెండర్లు ఆహ్వానించారు. త్వరలో పనులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక మార్కెట్‌ను పాఠశాల మైదానంలో కాకుండా మరోచోట ఎక్కడైనా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


పాఠశాల ఆవరణలో మార్కెట్టా?

- కొవ్వూరు బాలచంద్రారెడ్డి, బీజేపీ నేత

పాఠశాల ఆవరణలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయడమేంటీ? విద్యార్థుల ఇబ్బందులను గుర్తించరా.. నిత్యం మార్కెట్‌కు వేలాది మంది వస్తుంటారు. ఇప్పుడిపుడే కరోనా నుంచి తేరుకుంటున్నాము. ఎవరైనా కరోనా వైరస్‌ సోకినవారు అక్కడికొస్తే, వందలాది మంది విద్యార్థులున్న ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తిని ఏవిధంగా నిరోధిస్తారు. పాఠశాల ఆవరణలో కూరగాయల మార్కెట్‌ మార్కెట్‌ ఏర్పాటుపై కోర్టులో పిల్‌ వేశాము. పాఠశాల ఆవరణలో మార్కెట్‌ను ఏర్పాటు చేయడం తగదు.

Updated Date - 2021-02-24T05:04:38+05:30 IST