Abn logo
Mar 15 2020 @ 12:39PM

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

ఆంధ్రజ్యోతి(15-03-2020)

ప్రశ్న: నాకు పందొమ్మిదేళ్లు. బరువు అరవై కిలోలు. బరువు నియంత్రణకు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- జాహ్నవి, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: ఎవరైనా సరే... తమ వయసుకు, ఎత్తుకు తగిన బరువుకు చేరుకున్న తరువాత ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి - సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర. వ్యాయామం చేస్తున్నాం కాబట్టి, ఓ ముద్ద ఎక్కువ తిన్నా ఇబ్బంది ఉండదు అనే భ్రమ పనికిరాదు. రోజుకు అరలీటరు పాలు లేదా పెరుగు, రెండు కప్పుల కూరగాయలు, రెండు రకాల పళ్ళు, మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే వారానికి రెండు మూడు రోజులు అన్నానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు తదితరాలను తీసుకుంటే బరువును నియంత్రించుకోవచ్చు. తీపి పదార్థాలైన పంచదార, బెల్లం, తేనె లాంటివి మితంగా తీసుకోవాలి. స్వీట్లు, చాక్లెట్‌లు, బిస్కెట్లు తదితర చిరుతిళ్లు మాని పళ్ళు, వేరుసెనగ గింజలు, బఠాణీలు, సెనగలు వగైరా తీసుకుంటే మంచిది. నూనెలో వేయించినవి చాలా మితంగా తీసుకోవాలి. రోజుకు కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. కనీసం అరగంట నుంచి ముప్పావుగంట వరకు వ్యాయామం తప్పనిసరి. అలాగే సమయానికి నిద్ర కూడా  ముఖ్యమే. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.

 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement