Abn logo
Apr 6 2021 @ 12:18PM

కొవిడ్‌ నుంచి కాలేయానికి రక్ష!

ఆంధ్రజ్యోతి(06-04-2021)

కళ్లు పచ్చబడితే కామెర్లు... ఈ విషయం అందరికీ తెలిసిందే! పత్యం చేస్తూ, విశ్రాంతి తీసుకుంటే చాలు!... కామెర్లకు అదే మందు అనుకుంటాం! కానీ కొవిడ్‌ సమయంలో కామెర్లను, ఇతర కాలేయ సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం!


ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొవిడ్‌ చేసే కీడు ఎక్కువే! అయితే కొవిడ్‌ బాధితుల్లో కాలేయ సమస్యలు తలెత్తడానికి... పూర్వం నుంచీ కాలేయం జబ్బుపడి ఉండడం లేదా కొవిడ్‌ చికత్సలో వాడే మందుల మూలంగా కాలేయం పనితీరులో మార్పులు చోటు చేసుకోవడం.. ఇలా రెండు కారణాలు ఉండే వీలుంది. కొవిడ్‌ కారణంగా జరిగే లివర్‌ డ్యామేజీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గే క్రమంలో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. కొవిడ్‌ సోకినప్పుడు ఆ ఇన్‌ఫెక్షన్‌ కాలేయ కణాలకు నేరుగా సోకుతుంది లేదా శరీర వ్యాధినిరోధకశక్తి ప్రభావానికి కాలేయ కణాలు గురవడం మూలంగా కాలేయం జబ్బుపడుతుంది. మరీ ముఖ్యంగా తీవ్ర కాలేయ వ్యాధులు, హెపటైటిస్‌ ‘బి’, హెపటైటిస్‌ ‘సి’ కలిగి ఉండి, కొవిడ్‌ సోకిన వారికి ప్రమాదం రెండింతలు ఎక్కువ. వీరి కాలేయ పనితీరు అస్తవ్యస్థమవుతుంది. కాలేయ వ్యాధులు కలిగిన కొవిడ్‌ బాఽధితుల్లో కాలేయ స్రావాలు పెరుగుతాయి. అలా స్రావాలు పెరగడం కాలేయం తాత్కాలికంగా డ్యామేజీ అయిందనడానికి సంకేతం. సిర్రోసిస్‌ దశకు చేరుకున్న వారికి కొవిడ్‌ సోకే అవకాశాలు, జరిగే నష్టం ఎక్కువ. హెపటైటిస్‌ ‘బి’, ‘సి’ కారణంగా కాలేయ కేన్సర్‌కు గురయినవారికి కీమోథెరపీ మూలంగా, వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి ఉంటుంది. కాబట్టి వారికి కొవిడ్‌ సోకే అవకాశాలు మరింత ఎక్కువ. కాబట్టి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా కాలేయ వ్యాధిగ్రస్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి.


వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం లాంటి కొవిడ్‌ నియమాలు తూచ తప్పక పాటించాలి.

హెపటైటి్‌సకు చికిత్స తీసుకుంటున్నవారు చికిత్సను ఆపకుండా, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి.

మద్యపానానికి దూరంగా ఉంటూ, పౌష్ఠికాహారం తీసుకోవాలి.


తీవ్ర కాలేయ వ్యాధులు కలిగి ఉంటే?

నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటి్‌స(నాష్‌) కలిగి ఉన్నవారికి గుండె సమస్యలు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, ఊబకాయం, మధుమేహం కూడా ఉండి, కొవిడ్‌ సోకిన పక్షంలో వీరికి ప్రమాదం మరింత ఎక్కువ. అయితే ఈ వ్యాధులు కలిగి ఉండి కూడా కాలేయం గట్టిపడకుండా, కాలేయం మీద మచ్చలు (స్కారింగ్‌) ఏర్పడకుండా ఉంటే, కొవిడ్‌ సోకే అవకాశాలు కొంత తక్కువగా ఉంటాయి. అయితే సిర్రోసిస్‌ దశకు చేరుకున్న వ్యక్తుల్లో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి ఉంటుంది. కాబట్టి వీరికి కొవిడ్‌ సోకే అవకాశాలు, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాలేయ మార్పిడి అవసరమై, దాత కోసం వేచి చూస్తున్న వాళ్లకు కూడా కొవిడ్‌ ముప్పు ఎక్కువే!


కాలేయ మార్పిడి చేయించుకుంటే?

కాలేయ మార్పిడి చేయించుకున్నవారు వ్యాధినిరోధకశక్తిని అణచి ఉంచే మందులు వాడుతూ ఉంటారు. కాబట్టి వీరికి కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువ. వీరికి కొవిడ్‌ సోకితే ఇన్‌ఫెక్షన్‌ త్వరితగతిన తీవ్రమైపోతుంది. కాబట్టి సాధారణ కొవిడ్‌ నియమాలు పాటించడంతో పాటు, జనసమూహాలకు దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకూ ఇంటి పట్టున గడపడం చేస్తూ, వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలి.


హెపటైటిస్‌ మార్గాలు బోలెడు!

కొవిడ్‌ వైర్‌సతో పాటు కాలేయానికి అత్యంత సాధారణంగా సోకే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ‘హెపటైటిస్‌’! మద్యపానం, కొన్ని రకాల మందులు, టాక్సిన్లు, మూలికా వైద్యాలు, పుట్టుకతో సంక్రమించిన జన్యుపరమైన సమస్యలతో కాలేయం ఇన్‌ఫ్లమేషన్‌కు గురై హెపటైటిస్‌ బారిన పడుతుంది.  ఆ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లే... హెపటైటిస్‌ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘ఇ’.


సంక్రమించే మార్గాలు ఇవే!

కలుషిత నీరు, ఆహారం ద్వారా హెపటైటిస్‌ ‘ఎ’, ‘ఇ’ వైర్‌సలు శరీరంలోకి ప్రవేశించి, కాలేయం మీద దాడి చేస్తాయి. రక్తం, శరీర ద్రవాల ద్వారా హెపటైటిస్‌ ‘బి’, ‘సి’ వైర్‌సలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటాయి. కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి చేరే వైర్‌సను చికిత్సతో పూర్తిగా అదుపు చేయవచ్చు. ఈ వైర్‌సతో కుంటుపడిన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సరిదిద్దవచ్చు. అయితే హెపటైటిస్‌ ‘బి’, ‘సి’ వైర్‌సలు ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే, ఏళ్ల తరబడి తిష్ఠ వేసుకుని పదే పదే తిరగబెడుతూ కాలేయాన్ని గట్టిపరచడంతో పాటు, కాలేయం మీద మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. కాలేయ కేన్సర్‌, సిర్రోసి్‌సలకు కూడా దారితీస్తాయి. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించడం, తాజాగా వండిన ఇంటి భోజనం చేయడం లాంటి అలవాట్లతో కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకే హెపటైటి్‌సలను అదుపులో ఉంచవచ్చు. రక్తమార్పిడి, లేదా శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే హెపటైటిస్‌ బి, సి 


వైర్‌సలు సిరంజీల ద్వారా సోకే అవకాశం ఉంటుంది. మాదకద్రవ్యాల అలవాటు ఉన్నవారు సిరంజీలను పంచుకోవడం ద్వారా ఈ వైరస్‌ సంక్రమిస్తూ ఉంటుంది. అలాగే హీమోడయాలసిస్‌ ద్వారా సంక్రమిస్తుంది. తల్లి నుంచి బిడ్డకూ ఈ వైరస్‌ సోకుతూ ఉంటుంది. టాటూలు, బాడీ పియర్సింగ్‌, రేజర్లు, టూత్‌బ్ర్‌షలు షేర్‌ చేసుకోవడం ద్వారా కూడా ఈ వైరస్‌ సంక్రమిస్తూ ఉంటుంది.


లక్షణాలు ఇవే!

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి, లక్షణాలు బయల్పడడానికి పట్టే సమయాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. హెపటైటిస్‌ ‘ఎ’, ‘ఇ’ వైర్‌సల ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ రెండు నుంచి ఆరు వారాలు. హెపటైటిస్‌ ‘బి’, ‘సి’ల ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ రెండు నుంచి ఆరు నెలలు. ప్రారంభంలో లక్షణాలు ఫ్లూను పోలి ఉంటాయి. నిస్సత్తువ, ముదురు రంగు మూత్రం, జ్వరం, వాంతులు, కామెర్లలో కనిపించే లక్షణాలు (కళ్లు, చర్మం పచ్చబడడం) ఉంటాయి. ఇవి అక్యూట్‌ వైరల్‌ హెపటైటిస్‌ లక్షణాలు. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు స్వల్పంగా బయల్పడి, వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే అరుదుగా ఈ రకం హెపటైటిస్‌ లివర్‌ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది. ఈ పరిస్థితి కొన్ని గంటలు, రోజుల్లోనే తలెత్తవచ్చు. కాబట్టి కాలేయ మార్పిడి సౌకర్యాలు కలిగిన ఆస్పత్రిలోనే ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం అవసరం. ఆరోగ్యం విషమించి, సమయానికి కాలేయ మార్పిడి చేయకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు 80ు ఎక్కువ.


వ్యాక్సిన్లు ఉన్నాయి!

హెపటైటిస్‌ ‘ఎ’, ‘బి’ల నియంత్రణకు వ్యాక్సిన్లు ఉన్నాయి. హెపటైటిస్‌ బి కారక కేన్సర్‌ను ఈ వ్యాక్సిన్‌తో నిలువరించవచ్చు. క్రానిక్‌ హెపటైటిస్‌ బి (కాలేయ వాపు, అత్యధిక కాలేయ స్రావాలు, కాలేయం మీద మచ్చలు) సమర్థమైన చికిత్సలు ఉన్నాయి. ఇంతటి తీవ్రటి లక్షణాలు లేనివారికి కాలేయ కేన్సర్‌ వచ్చే అవకాశాలను గమనించుకంటూ ఫాలో అప్‌ చికిత్స కొనసాగిస్తే సరిపోతుంది. హెపటైటిస్‌ ‘సి’కి డైరెక్ట్‌లీ యాక్టింగ్‌ యాంటీవైరల్‌ డ్రగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మందులతో కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయ సమస్యలు కలిగిన వారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వైద్యులను సంప్రతించి, వారి సలహా మేరకు నడుచుకోవాలి.


వైరల్‌ హెపటైటిస్‌ నివారణ ఇలా...

పరిశుభ్రమైన నీరు: ఇందుకోసం యువి లేదా ఆర్‌ఒ రకం వాటర్‌ ప్యూరిఫయర్స్‌ వాడుకోవచ్చు. వీటిలో మెకానికల్‌ ఫిలే్ట్రషన్‌ కోసం క్యాండిల్‌ రకం ఫిల్టర్లు ఉండాలి. అలాగే ప్రయాణాల్లో తీగునీటి కోసం బ్రాండెడ్‌ మినరల్‌ వాటర్‌ బాటిళ్లు వాడుకోవచ్చు.

చిరుతిళ్లు: రోడ్డు పక్కన అమ్మే పళ్లరసాలు, మిల్క్‌షేక్‌లు, చిరుతిళ్లకు దూరంగా ఉండాలి.

బార్బర్‌ షాప్స్‌: రేజర్‌ బ్లేడ్లు వైట్‌ హెడ్‌, బ్లాక్‌ హెడ్స్‌ తొలగించడానికి వాడే లోహపు స్కేపర్లు షేర్‌ చేసుకోకూడదు. డిస్పోజబుల్‌ రకానికి చెందిన పరికరాలు ఉపయోగించే బార్బర్‌ లేదా బ్యూటీ సెలూన్లకే వెళ్లాలి. లేదా వాటిని సక్రమంగా స్టెరిలైజ్‌ చేసే చోటికే వెళ్లాలి.

లైంగిక సంక్రమణం: హెపటైటిస్‌ బి లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి సురక్షిత లైంగిక సంబంధాలు కొనసాగించాలి.

సిరంజీలు: వీటిని పంచుకోకూడదు.

డాక్టర్‌ ధర్మేష్‌ కపూర్‌

సీనియర్‌ హెపటాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.