Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిరుత్సాహాన్ని ఎలా తరమాలి?

ఆంధ్రజ్యోతి(30-07-2021)

ప్రశ్న: సంవత్సరం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాను. ఇలా ఇంట్లోనే ఉండడం వల్ల నిర్లిప్తంగా, నిరుత్సాహంగా ఉంటోంది. ఉత్సాహాన్ని పెంచే ఆహారం ఉంటుందా?


 - అభిజ్ఞ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, తగిన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు లాంటి అనేక కారణాల వల్ల మానసికస్థితి ప్రభావితమవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు పనితీరును, తద్వారా మానసికస్థితిని ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. కుంగుబాటు, ఆందోళన లక్షణాలను నివారించడానికి, మెరుగుపరచడానికి సమతులాహారం సహాయపడుతుంది. ఒమేగా-3 కొవ్వులు అధికంగా ఉండే చేపలు; థియోబ్రొమెన్‌, ఫ్లేవనాయిడ్స్‌ గల డార్క్‌ చాక్‌లెట్‌లు; ప్రోబయాటిక్స్‌ను కలిగి ఉండే పెరుగు, మజ్జిగ; అరటి, ఆపిల్‌, దానిమ్మ, నల్లద్రాక్ష లాంటి పండ్లు; పోషకాలు ఎక్కువగా ఉండే ముడిధాన్యాలు, గింజలు; బి విటమిన్లు అధికంగా ఉండే పప్పుధాన్యాలు మొదలైనవన్నీ ఉత్సాహపరిచే ఆహారాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. స్వీట్లు, కాఫీ, టీలు, ఇన్ల్ఫమేషన్‌ను అధికం చేసే ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూనె పదార్థాలన్నీ కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై, మానసికస్థితిపై చెడుగా ప్రభావితం చేస్తాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఎండ తగలక, విటమిన్‌-డి లోపం వస్తే కూడా మానసికస్థితిపై దుష్ప్రభావాలు ఉంటాయి. రోజులో కనీసం అరగంటైనా ఎండలో గడపడం మంచిది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...