ఇంకా ఎన్నాళ్లిలా...

ABN , First Publish Date - 2022-04-15T05:03:52+05:30 IST

రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయి ఇప్పటికి ఐదు నెలలు కావస్తోంది.

ఇంకా ఎన్నాళ్లిలా...
పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న అన్నమయ్య ప్రాజెక్టు

జగనన్నా... మా గోడు వినవన్నా..... 

అన్నమయ్య వరద బాధితులు


రాజంపేట, ఏప్రిల్‌ 14: 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి...

రాజంపేట ప్రాంత చెయ్యేరు వరద బాధితుల విన్నపం...


అన్నా... రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయి ఇప్పటికి ఐదు నెలలు కావస్తోంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మా బాధలన్నీ విని వెనువెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తిరి. అయితే ఇంతవరకు ఏ పనీ జరగకపోవడం మాకు చాలా బాధను కలిగిస్తోంది. అయ్యా... ప్రాజెక్టులు తెగిపోవడం వల్ల దాదాపు 40 మంది మనుషులు చనిపోయిన విషయం మీకు తెలియనిది కాదు.. ఈ సమయంలో పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు, తాళ్లపాక, రామచంద్రాపురం, మందపల్లె గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ గ్రామాలతో పాటు ఈ నదికి ఇరువైపులా ఉన్న పెనగలూరు, నందలూరు మండలాల్లోని సుమారు 40 గ్రామాలు నీటమునిగిపోయాయి. మీరు స్వయంగా అన్నీ పరిశీలించి వెళ్లారు. వరదకు ముందు ఉన్న దాంట్లో ఏదో కాస్తోకూస్తో బాగా బతుకుతూ మాకున్న ఇళ్లలో హాయిగా ఉంటూ మాకున్న పంట పొలాల్లో పంటలు పండించుకుని జీవిస్తూ ఉంటిమి. ఇల్లు పోయే... పంటలు పోయే.... పొలాలు కనిపించకుండా పోయే.... పశువులన్నీ మటుమాయమాయే.... ఐదు నెలలుగా సుమారు 600 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరోజు నుంచి ఈరోజు వరకు అటు ఎండకు, ఇటు వానకు తడుస్తూ, ఎండుతూ రాత్రింబవళ్లు కారుమబ్బుల్లో పూరి గుడిసెల్లో కాలం గడుపుతూ పిల్లాపాపలతో బతుకుజీవుడా అని జీవిస్తున్నాం. మీరు వచ్చిన వెనువెంటనే రెండు నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పి నేటికీ ఒక్క ఇంటికి కూడా ఒక్క ఇటుక ఇవ్వలేదంటే ఏమని మిమ్ములను వేడుకోగలం. ఇక అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టుల గురించి మీకేమని చెప్పగలం.. ఈ ప్రాజెక్టులు రెండూ కొట్టుకుపోయి తిరిగి మమ్ములను పునర్‌ నిర్మిస్తారా లేదా అని దీనంగా అడుగుతూ శిథిలాలుగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తప్ప మా బతుకులు తెల్లారవు. ఈ ప్రాజెక్టులతోనే ఈ ప్రాంతానికి జీవనాధారం. అన్నమయ్య ప్రాజెక్టు కింద 2500 ఎకరాలు సాగవుతుంది. రాజంపేట, పుల్లంపేట మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు తిరిగి పునర్‌ నిర్మించాలంటే కనీసం రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. మీరు ప్రాజెక్టులను పునర్‌ నిర్మిస్తామని సెలవిస్తిరి. అయినా ఇంతవరకు గత అసెంబ్లీ బడ్జెట్‌లో ఒక్క పైసా నిధులు కేటాయించకపోతిరి. ఈ ప్రాజెక్టు ఆధారంగానే సాగు, తాగునీరు లభిస్తోంది. రాజంపేట పట్టణంలోని లక్ష మంది జనాభాకు ఇక్కడి నుంచే తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే వారికి చుక్క తాగునీరు అందదు. ఇక అన్నమయ్య వెనుక జలాల ఆధారంగా సుండుపల్లె మండలానికి వందల కోట్లతో ఏర్పాటు చేసిన బృహత్తర మంచినీటి పథకం వల్ల ప్రయోజనం ఉండదు. కావున వెంటనే ఈ ప్రాజెక్టుల పునర్‌ నిర్మాణంపై స్పందించి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పింఛా ప్రాజెక్టుతో సుండుపల్లె మండలానికి తాగునీరు, సాగునీరు లభించేది. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును పునర్‌ నిర్మించకపోతే ఆ ప్రాంతం ఎడారిగా మారే అవకాశముంది. వ్యవసాయ భూములలో ఇసుక మేటలు కూడా ఇంకా తొలగించలేదు. ఈ ఇసుక మేటలు తొలగిస్తే కానీ మా భూములు మేము కనుక్కోలేము. ఈ స్థితిలో ఈ ప్రాంతాన్నంతా సర్వే చేయించి ఇసుక మేటలు తొలగించి మా పొలాలను మాకు చూపించి తిరిగి అవి సాగుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. నదికి అటూ ఇటూ తెగిపోయిన రక్షణ గోడలను ఏర్పాటు చేయకపోతే తిరిగి వరదలు వస్తే మరింత ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశముంది. వరదల్లో సర్వస్వం కోల్పోయిన పంట నష్టాలకు ఇప్పటికైనా నష్టపరిహారం అందజేయాల్సి ఉంది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలా అభివృద్ధి చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ప్రభుత్వ వ్యవస్థపై, ముఖ్యమంత్రి ప్రకటనలపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఈ విషయాన్ని పెద్దలు దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పదంతో మమ్ములను ఆదుకోవాల్సిన అవసరం మీ భుజస్కంధాలపై ఉంది. మీరు ఇకనైనా మాపై కరుణించకపోతే మేము అనాథలుగానే మిగలాల్సి ఉంది. దయ వుంచి ఇకనైనా స్పందించి మా గోడును ఆలకించి అన్ని విధాలా సహాయపడాలని వేడుకుంటున్నాం.... 

ఇట్లు

చెయ్యేరు వరద బాధితులు 



Updated Date - 2022-04-15T05:03:52+05:30 IST