ప్రయాణం సాగేదెలా?

ABN , First Publish Date - 2022-05-31T05:02:56+05:30 IST

రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ..

ప్రయాణం సాగేదెలా?
గుంతలమయంగా మారిన ఎక్వాయిపల్లి రోడ్డు, జాపాల-ఆగాపల్లి రహదారి చెట్ల కొమ్మలు

  • అధ్వానంగా ఎక్వాయిపల్లి - ముద్విన్‌ రోడ్డు
  • కంకర తేలి గోతులేర్పడి నరకప్రాయంగా మారిన దారి
  • రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • డబుల్‌ రోడ్డుగా విస్తరించాలని స్థానికుల వినతి


రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.  కడ్తాల మండల పరిధిలో గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. అదేవిధంగా మంచాల మండలపరిధిలో రోడ్ల పక్కన చెట్ల కొమ్మలు అడ్డంగా పెరగడంతో కనీసం  రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది.  అధికారులకు విన్నవించినా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


కడ్తాల్‌ , మే 29: మండల పరిధిలోని శ్రీశైలం - హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి ఎక్వాయిపల్లి, ముద్విన్‌ మీదుగా చరికొండ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల క్రితం పీఎంజీఎ్‌సవై కింద నిర్మించిన బీటీరోడ్డు నిర్వహణ లేక కళాహీనంగా మారింది. అడుగడుగున బీటీ కొట్టుకుపోయి, కంకర తేలి మోకాళ్ల లోతు గోతులేర్పడ్డాయి. పాడైన రోడ్డుతో ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన పడుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు నుంచి నిత్యం రాకపోకలకు సాగిస్తుంటారు. కర్కల్‌పహాడ్‌ - ఎక్వాయిపల్లి మధ్యలో మైసమ్మగుడి సమీపంలో బీటీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కలిపే ఈ రోడ్డు డబుల్‌ రోడ్డుగా విస్తరిస్తే సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎక్వాయిపల్లి రోడ్డును ఆధునికీకరించాలని ప్రజలు కోరుతున్నారు.


ఎవరూ పట్టించుకోవడం లేదు

కర్కల్‌పహాడ్‌ నుంచి ఎక్వాయిపల్లి మీదుగా చరికొండ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడైంది. రోడ్డు మరమ్మతు, విస్తరణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 14 కిలోమీటర్ల ఈ రోడ్డును ఆధునికీకరించి డబుల్‌ రోడ్డుగా విస్తరించాలి. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేకచొరవ తీసుకోవాలి. 

- జంగం సుగుణ సాయిలు, సర్పంచ్‌, ఎక్వాయిపల్లి


రోడ్డు మరమ్మతుకు రూ.91 లక్షలు మంజూరు

పంచాయతీ రాజ్‌ శాఖ ఆధీనంలో ఉన్న కర్కల్‌పహాడ్‌ - చరికొండ బీటీ రోడ్డు మరమ్మతు గురించి ప్రభుత్వానికి నివేదించాం. కల్వకుర్తి ఎమ్మెల్యేగుర్కా జైపాల్‌ యాదవ్‌ సహకారంతో ఇటీవల ఎంఆర్‌ఆర్‌లో 7 కిలోమీటర్ల రెన్యువల్‌కు రూ.91 లక్షలు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. మిగిలిన రోడ్డు రెన్యువల్‌,  డబుల్‌ రోడ్డు విస్తరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

- దశరథ్‌నాయక్‌, జడ్పీటీసీ, కడ్తాల్‌ 


ప్రమాదకరంగా జాపాల-ఆగాపల్లి రహదారి

రోడ్డు పక్కన భారీగా పెరిగిన చెట్లు 

రహదారి మూసుకుపోయేలా అడ్డంగా కొమ్మలు 

పొంచిఉన్న ప్రమాదం.. పట్టని యంత్రాంగం


మంచాల, మే 29 : రోడ్డుకు అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలతో జాపాల-ఆగాపల్లి రహదారి మూసుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా సంబంధిత యంత్రాంగంలో చలనం లేకుండా పోయింది. ఆరు కిలోమీటర్ల మేర ఉన్న జాపాల-ఆగాపల్లి రహదారిలో జాపాల నుంచి కాగజ్‌ఘట్‌ వరకు రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం చెట్లు ఇటీవలికాలంలో ఏపుగా పెరిగాయి. వీటితోపాటు పలుచోట్ల కంపచెట్లు సైతం ఏపుగా పెరిగి కొమ్మలన్నీ రహదారికి అడ్డంగా వచ్చాయి. ఈ చెట్లకొమ్మలన్నీ బీటీరోడ్డుకు సగం వరకు రావడంతో పలుచోట్ల రహదారి సగం వరకూ మూసుకుపోయింది. ముఖ్యంగా మూలమలుపుల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది.. దీంతో అటుగా వచ్చే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనం దగ్గరికి వచ్చే వరకు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై సంబంధిత యంత్రాంగానికి సమాచారం ఉన్నా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రమాదం ఉందని తెలిసినా చర్యలు తీసుకోవడంలేదు..

జాపాల నుండి కాగజ్‌ఘట్‌ వెళ్లే మార్గంలో మూలమలుపులు చాలా ఉన్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరిగి పలుచోట్ల కొమ్మలన్నీ రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చేదాకా కనిపించడంలేదు. ఈ దారిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలి. 

- ఓరుగంటి భాస్కర్‌, జాపాల


అధికారులకు నివేదించాం

ప్రమాద పరిస్థితిపై అధికారులకు నివేదించాం. ఉపాధిహామీ పథకంలో చెట్ల కొమ్మలు తొలగిస్తామంటూ అధికారులు హామీఇచ్చారు. అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపునకు సత్వర చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.

-నౌహీద్‌బేగం, సర్పంచ్‌, జాపాల



Updated Date - 2022-05-31T05:02:56+05:30 IST