అన్నీ కోతలేనా..?

ABN , First Publish Date - 2020-12-04T06:22:16+05:30 IST

పేదలందరికీ స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తామని పాలకులు ప్రగల్భాలు పలికారు. అంతా ఉచితమని ఊదరగొట్టారు. ఇక సొంతింట్లో చేరిపోయినట్లేనన్నంత భ్రమను లబ్ధిదారుల్లో కలిగించారు. ఆచరణలో మాత్రం అంతా తూచ్‌ అంటున్నారు.

అన్నీ కోతలేనా..?

పేదలందరికీ ఉచితంగా ఇల్లు 

ఒట్టి మాటేనా?

అహుడా, మున్సిపాలిటీ పరిధిలోనే మంజూరు

38 మండలాల  ప్రజలకు మొండిచెయ్యి

జిల్లాలో 978 ప్రాంతాల్లో పంపిణీకి కసరత్తు

19 చోట్ల కోర్టు కేసులతో ఆగిన వైనం

యూనిట్‌ ధర రూ.1.80 లక్షలుగా నిర్ధారణ

 రూ.70 వేలు కోత

కేంద్రం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారార్భాటం..


పేదలందరికీ స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తామని పాలకులు ప్రగల్భాలు పలికారు. అంతా ఉచితమని ఊదరగొట్టారు. ఇక సొంతింట్లో చేరిపోయినట్లేనన్నంత భ్రమను లబ్ధిదారుల్లో కలిగించారు. ఆచరణలో మాత్రం అంతా తూచ్‌ అంటున్నారు. అన్నీ కొనాల్సిందే.. అన్నింటికీ రేటు కట్టాల్సిందేనని నీటుగా చెబుతున్నారు. తక్కువ ధరకే ప్రభుత్వం మెటీరియల్‌ మొత్తం ఇస్తుందంటూ మరో పల్లవి అందుకున్నారు. ప్రభుత్వ ప్లాన్‌ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలంటూ కొత్త నిబంధన తెరపైకి తెచ్చారు. ఇంటికి ఇచ్చే డబ్బులో సైతం కోత పెడుతున్నారు. అది ఎంతగానంటే టీడీపీ హయాంలో ఇచ్చిన దాంట్లోనే ఇంకా తగ్గిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న సొమ్మునే తమదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైసా ఇవ్వకుండానే చేతులు దులిపేసుకునే తెలివి ప్రదర్శిస్తున్నారు.


అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 3: పేదలందరికీ ఇళ్లు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీ హయాంలో చెల్లించిన యూనిట్‌ ధర కంటే ప్రస్తుతం తక్కువ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి లబ్ధిదారుడికి రూ.70 వేల వరకు కోత పెట్టింది. మొదటి విడతలో అహుడా పరిధిలోని ప్రాంతాలతోపాటు మున్సిపాలిటీల్లో మాత్రమే ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. మిగిలిన 38 మండలాల ప్రజలకు మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. అహుడా పరిధిలోని 25 మండలాలు, 12 మున్సిపాలిటీల్లో ఈనెల 25న ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ హయాంలో మంజూరు చేసిన వాటితో కలిపి 111099గా నిర్ణయించింది. ప్రభుత్వం మొదట రూ.5 లక్షల వరకు యూనిట్‌ ధర ఉంటుందని ప్రకటిస్తూ వచ్చింది. తీరా చూస్తే గతంలో కన్నా తక్కువ ధర ఇవ్వాలని నిర్ణయించటంతో లబ్ధిదారుల నుంచి నిరాశ వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో చెల్లించిన దాంట్లోనే కోత పెట్టడం శోచనీయం. గతంలో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు ఇచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.1.8 లక్షల వరకు చెల్లిస్తుంటే.. అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు చెప్పుకొస్తుండటం శోచనీయం.


సెంటు స్థలమే పంపిణీ

పేదలకు సెంటు స్థలంలోనే ఇళ్ల పట్టాలిస్తోంది. 271 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. లివింగ్‌ రూం 77, వంటగది 35, బెడ్‌రూం 82, మరుగుదొడ్డి 24 అడుగులు ఉండాలని సూచించింది. ఓపెన్‌ వరండా 68 అడుగుల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలో నుంచి నగదు మినహాయించుకుని, హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మాణ మెటీరియల్‌ సరఫరా చేస్తుంది. సచివాలయ ఉద్యోగులు నిర్మాణాలను పర్యవేక్షిస్తారనీ, లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపింది. మెటీరియల్‌ కొనుగోలుకు జిల్లాస్థాయి కమిటీలు ధరలను నిర్ణయించి, పంపిణీ చేయనున్నాయి.


111099 మందికే..

జిల్లావ్యాప్తంగా ఈనెల 25న 978 ప్రాంతాల్లో 111099 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఇంటికి రూ.1.8 లక్షలు మాత్రమే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్‌ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలనే నిబంధన విధించింది. టీడీపీ హయాంలో ఇంటికి రూ.2.5 లక్షల వరకు రాయితీ ఇచ్చేది. లబ్ధిదారుడు తనకనుకూలంగా ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక ఉచితంగా అందజేస్తామంటూనే.. రవాణా ఖర్చులు మూడింతలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా అన్నింటా లబ్ధిదారులకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంటి పట్టాలు పంపిణీ చేయకనే ఆయా ప్లాట్లలో మంచినీరు, విద్యుత్‌, రహదారులు, మురుగుకాలవల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లాలో ఎక్కడా ఆ మేరకు చర్యలు చేపట్టలేదు.


19 ప్రాంతాల్లో  కేసులతో నిలుపుదల

ఈనెల 25న ఇంటి పట్టాల పంపిణీని పలు ప్రాంతాల్లో నిలుపుదల చేశారు. 19 చోట్ల కోర్టు కేసులుండటంతో సుమారు 10 వేల మందికి నివేశన స్థలాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ధర్మవరం పోతులనాగేపల్లిలోనే సుమారు 5236 మంది లబ్ధిదారులకు కోర్టు కేసులతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలుపుదల చేసినట్లు సమాచారం. అనంతపురం రూరల్‌ మండలంలోని కక్కలపల్లి, ఆకుతోటపల్లి, రాజీవ్‌కాలనీ, ఇటుకలపల్లి, సోములదొడ్డి, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి, మరూరు తదితర ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు జాప్యమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ అసమర్థతతోనే పేదలకు ఇంటి పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందని బాధిత లబ్ధిదారులు వాపోతున్నారు.


మెటీరియల్‌ ప్రభుత్వమే సరఫరా చేస్తుంది

త్వరలో నిర్మించబోయే ఇళ్లకు తక్కువ ధరకు ప్రభుత్వమే మెటీరియల్‌ సరఫరా చేస్తుంది. ఇసుక రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. సిమెంటు, ఇనుము, ఇంటికి తలుపులు ఇలా మొత్తం ప్రభుత్వం ఇస్తుంది. నిర్దేశించిన ప్లాన్‌ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. మొదటి విడతలో జిల్లాలో 111099 మందికి ఇంటి పట్టాలు అందజేసి, అదేరోజు నిర్మాణాలు ప్రారంభిస్తాం. 2021 జూన్‌ చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపడతాం.

- వెంకటేశ్వరరెడ్డి, పీడీ, హౌసింగ్‌

Updated Date - 2020-12-04T06:22:16+05:30 IST