గృహమస్తు వసూళ్లు!

ABN , First Publish Date - 2021-10-11T04:12:57+05:30 IST

గృహమస్తు వసూళ్లు!

గృహమస్తు వసూళ్లు!

- కేటగిరీల వారీగా ఓటీఎస్‌

- 1983 నుంచి 2013 వరకు ఇళ్ల రుణాల మంజూరుపై ఆరా 

- జిల్లాలో 2.30 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారణ 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లా గృహనిర్మాణ శాఖ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)పై దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎన్నో ఏళ్ల కిందట లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని ఇప్పుడు వడ్డీతో సహా వసూలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కేటగిరీల వారీగా డబ్బులు వసూళ్లు చేసి.. రిజిస్ర్టేషన్లకు అవకాశం కల్పించనుంది. కాగా.. కరోనా ఇబ్బందుల వేళ రుణాల బకాయిలు చెల్లించడం కష్టమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ నిర్మాణశాఖ వద్ద తనఖా పెట్టిన ఇంటి పట్టాలతో అవసరం ఉన్నవారు మాత్రం.. ప్రభుత్వ నిర్ణయం తమకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1983 నుంచి 2013 వరకు గృహనిర్మాణ శాఖ ద్వారా ఇళ్లు మంజూరై నిర్మించుకున్న వారి పేర్లతోపాటు, వారు తనఖా పెట్టిన పట్టాలను అధికారులు వెలికితీశారు. పేరు, సర్వే నంబరు, ఏ పథకం కింద లబ్ధి పొందారు.. తదితర అంశాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 2,30,000 మంది ఇళ్ల లబ్ధిదారులు రుణ బకాయిలు ఉన్నట్టు లెక్క తేల్చారు. వారందరికీ ఓటీఎస్‌ వర్తింపజేస్తారు. కేటగిరీల వారీగా నగదు వసూళ్లు చేస్తారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో మొత్తం చెల్లించేస్తే మీ ఇల్లు మీకు సొంతం అవుతుందని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. 1983లో ఇల్లు నిర్మించుకుంటే లబ్ధిదారునికి రూ.6వేలు ఇచ్చేవారు. అందులో రూ.3 వేలు రాయితీ కాగా, మిగిలిన రూ.3వేలు రుణం. తాజా లెక్కలు పరిశీలిస్తే యూనిట్‌ విలువ కంటే వడ్డీ  మూడు రెట్లు అధికంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాం(2014) నుంచి ఇళ్లు నిర్మించిన లబ్ధిదారులు మాత్రం నగదు  చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అటువంటి వారికి ఉపశమనం కలగనుంది. 


కేటగిరిల వారీగా వసూళ్లు 

- ‘కేటగిరీ-ఏ’ విభాగంలో హౌసింగ్‌ నుంచి రుణం తీసుకుంటే, ప్రస్తుతం వారి వారసుల పేరు మీద ఇంటి పట్టా ఇస్తారు. గ్రామాల్లో రూ. 10వేలు, మునిసిపాల్టీల్లో రూ.15వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.20వేల చొప్పున చెల్లించాలి. 

- ‘కేటగిరీ-బి’ విభాగంలో... రుణం తీసుకుని, ప్రస్తుతం ఆ ఇంట్లో ఇతరులు ఉంటే.. గ్రామాల్లో రూ.20వేలు, మునిసిపాల్టీల్లో రూ.30వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.40వేల చొప్పున చెల్లించాలి. 

- ‘కేటగిరీ-సి’ విభాగంలో.. రుణం తీసుకోకుండా, వారి వారసుల పేర్ల మీదకు పట్టా మార్చాల్సి వస్తే రూ.10వేలతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. 


మున్సిపాలిటీల్లో ఇలా...

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో బకాయిదారుల నుంచి ఇంటికి రూ.20వేలు వసూలు చేస్తారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగరపంచాయతీ పరిధిలో రూ.15 వేలు చొప్పున లబ్ధిదారులు చెల్లించాలి. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. సచివాలయాల వారీగా పూర్వ లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యదర్శులకు పంపారు. ఆ పేర్లను వలంటీర్లకు అప్పగించి ప్రాథమికంగా సర్వే చేస్తారు. తర్వాత డిజిటల్‌ అసిస్టెంట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి వాటిని ధ్రువీకరిస్తారు. విచారణ పూర్తికాగానే ఆన్‌లైన్‌ నమోదు అనంతరం లబ్ధిదారులు ఏ కేటగిరీ కింద ఉన్నారో తెలుస్తుంది. దాని ఆధారంగా వారు నగదు చెల్లించాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం కల్పిస్తారు. 


తక్షణమే సర్వే 

1983 నుంచి 2013 వరకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని ఇప్పటివరకు చెల్లించని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద అవకాశం కల్పించింది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాను సచివాలయాలకు పంపాం. వాటిపై క్షేత్రస్థాయిలో తక్షణమే సర్వే పూర్తిచేయాలని ఆదేశించాం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తాం.  

- గణపతి, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ 

 

Updated Date - 2021-10-11T04:12:57+05:30 IST