‘హాట్‌స్పాట్లలో ఇంటింటికీ కోవిడ్-19 పరీక్షలు చేయాలి’

ABN , First Publish Date - 2020-04-10T20:47:18+05:30 IST

ఇంటింటికీ వెళ్ళి కోవిడ్-19 పరీక్షలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం

‘హాట్‌స్పాట్లలో ఇంటింటికీ కోవిడ్-19 పరీక్షలు చేయాలి’

న్యూఢిల్లీ : ఇంటింటికీ వెళ్ళి కోవిడ్-19 పరీక్షలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా ప్రభుత్వం ప్రకటించిన నగరాలు, పట్టణాల్లో ఈ వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించేందుకు భారీ ఎత్తున ఇంటింటికీ వెళ్ళి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాలని కోరారు. 


శశ్వత్ ఆనంద్, అంకుర్ ఆజాద్, ఫయీజ్ అహ్మద్, సాగర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 హాట్‌స్పాట్ నగరాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటిలోని వ్యక్తులను పరీక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనివల్ల కోవిడ్-19 సోకినవారిని గుర్తించేందుకు, వారిని ఒంటరిగా ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించవచ్చునని కూడా తెలిపారు.


ఇంటింటికీ వెళ్ళి పరీక్షలు చేయడం వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఈ వైరస్ వ్యాపించకుండా నిరోధించవచ్చునని తెలిపారు. కరోనా వైరస్ ప్రభావిత హాట్‌స్పాట్ నగరాలు, పట్టణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఇంటింటికీ వెళ్ళి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. 


ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పరీక్షలు జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టింగ్ రేటు తక్కువగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. 


Updated Date - 2020-04-10T20:47:18+05:30 IST