Abn logo
Jul 21 2021 @ 00:04AM

మొండిగా.. మదింపు

పట్టణాల్లో ఆస్తి విలువ పన్నుపై సర్వే

ప్రజాందోళనలను పట్టించుకోని అధికారులు

వార్డు అడ్మిన్‌ సెక్రెటరీల ద్వారా ఇంటింటి సర్వే

సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆధార్‌ సేకరణ

భారీ మొత్తంలో ఆస్తి పన్ను పెంచేందుకు ఎత్తుగడ


గుంటూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కేంద్రాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నుపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. అయినా మొండిగా ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ మునిసిపాలిటీల్లో కేపిటల్‌ వాల్యూ(సీవీ) వర్కుని ఆయా పురపాలక సంఘాలు తెరచాటున కొనసాగిస్తున్నాయి. ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు చూపించకుండానే అడ్మిన్‌ సెక్రెటరీలు తమ వార్డు పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి బిల్టప్‌ ఏరియాని కొలుస్తున్నారు. ఎందుకు కొలతలు వేస్తోన్నారని ఎవరైనా అడిగితే తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని సమాధానం చెబుతున్నారు. సహకరించకపోతే రేషన్‌ కార్డులు, పింఛన్లు, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక వారు అడిగిన పత్రాలను గృహ యజమానులు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు దేనికీ ఆధార్‌తో ముడి పెట్టవద్దని ఒకపక్క సుప్రీం కోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం మొండిగా దానినే ప్రామాణికంగా తీసుకుంటున్నది. 2002 నుంచి మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంపుదల జరగలేదని చెబుతూ అప్పటి నుంచి పెంచితే ఇప్పుడు ఎంత అవుతుందనే దానిపై కేపిటల్‌ వాల్యూ(సీవీ) వర్కుని చేపట్టింది. ఉదాహరణకు ఏటుకూరులో ఓ ఇంటికి ఆరు నెలలకు రూ.300 ఆస్తి పన్ను ఉంటే సీవీ ప్రకారం ఇప్పుడు అది రూ.1,200లకు పైగా చేరే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి అడ్మిన్‌ సెక్రెటరీలు ప్రతీ ఇంటికి వెళ్లి ప్లింత్‌ ఏరియాని కొలత వేస్తున్నారు. ప్రజల నుంచి కొన్ని చోట్ల ప్రతిఘటనలు రాగా ఆ విషయాన్ని అడ్మిన్‌ సెక్రెటరీలు మునిసిపల్‌ అధికారులకు నివేదించినప్పటికీ ఎలాగోలా సీవీ వర్కు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


మరోపక్క సంక్షేమ పథకాల కోత

కేపిటల్‌ వాల్యూ వర్కుతో ఒకపక్క ఆస్తి పన్నుని మూడు, నాలుగు రెట్లు పెంచే దిశగా మునిసిపాలిటీలు అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల నిర్మించిన అదనపు అంతస్తులు, కట్టడాలు ఇప్పుడు లెక్కలోకి వస్తాయి. ఆయా ఆస్తులకు ఆధార్‌ని లింక్‌ చేస్తుండటంతో పట్టణ ప్రాంతాల్లో ఆరు అంచెల మూల్యాంకనానికి సంబంధించి ఇంటి స్థలం విషయంలో అర్హత కోల్పోతారు. ఎవరికైనా 60 చదరపు గజాలలో స్థలం ఉండి అందులో రెండు అంతస్తులు ఇల్లు నిర్మించుకుంటే ప్లింత్‌ ఏరియా పెరిగి అనర్హత వేటు పడుతుంది. దీంతో రేషన్‌కార్డు మొదలుకుని అన్ని సంక్షేమ పథకాలకు ఆ కుటుంబం అర్హత కోల్పోతుంది. సీవీ వర్కు తర్వాత  జిల్లాలో వేల మందికి సంక్షేమ పథకాల కోత పడే అవకాశం ఉన్నట్లుగా సచివాలయాల వర్గాలే పేర్కొంటున్నాయి.


పెద్దసంఖ్యలో అండర్‌ అసెస్‌మెంట్లు 

ఆస్తిపన్నులో నమోదు చేసిన ప్లింత్‌ ఏరియా కంటే క్షేత్రస్థాయిలో బిల్టప్‌ ఏరియా అధికంగా ఉంటే అది ముమ్మాటికీ రెవెన్యూ ఉద్యోగుల వైఫల్యమే. రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు నిత్యం వీటిని గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలి. అయితే వివిధ మునిసిపాలిటీల్లో బిల్‌ కలెక్టర్లు, ఆర్‌ఐలు భవన యజమానుల వద్ద లంచాలు తీసుకుని అండర్‌ అసెస్‌మెంట్‌లను చూసి చూడనట్లుగా వదిలేస్తుండటం వల్లే ఆస్తిపన్ను రూపంలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి.