ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ, ఎస్టీల ఏకరువు

ABN , First Publish Date - 2021-07-18T04:30:26+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లస్థలాల కోసం ఎస్సీ, ఎస్టీలు ఏళ్లతరబడి ఏకరువు పెడుతున్నారు.

ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ, ఎస్టీల ఏకరువు
పంచేడుకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా గుడిసెల్లో కాపురాలు ఉంటున్న గిరిజనులు


 రోడ్డు పక్కనే గుడిసెల్లో నివాసాలు

పట్టించుకోని అధికారులు


బుచ్చిరెడ్డిపాళెం, జూలై 17: మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లస్థలాల కోసం ఎస్సీ, ఎస్టీలు ఏళ్లతరబడి ఏకరువు పెడుతున్నారు. కొంతమంది గిరిజనులు ఇళ్ల స్థలాలు లేక వ్యవసాయ పొలాల వద్ద ప్రధాన రహదారులకు ఇరువైపులా పూరిగుడిసెల్లో పురిటి బిడ్డలతో కాపురాలుంటున్నారు. ఇలా కాపురాలు సాగించే పలువురు గిరిజన పిల్లలు, కుటుంబ యజమానులు విషసర్పాల ధాటికి బలైపోవడంతో భార్యాపిల్లలు అనాథలైన సంఘటనలు ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, నేతలు కూడా పట్టించుకోవడం లేదని బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసిన వైనమిది.

మండలంలోని పంచేడు గ్రామానికి వెళ్లే మార్గంలోని ఓ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా పూరి గుడిసెల్లో నివాసాలు ఉంటూ ఎండకు..వానకు ఇబ్బందులు పడుతూ కాపురాలు ఉంటున్నారు. పలుమార్లు ఆ మార్గంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెళ్తున్నా వారిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పంచేడు గ్రామ పంచాయతీ పరిధిలో 2 గిరిజన కాలనీలు, 2 ఎస్సీ కాలనీలతో పాటు ప్రధాన గ్రామం ఉంది. ఇక్కడ సుమారు వెయ్యి కుటుంబాలు, 3వేలకు పైగా జనాభా ఉన్నారు. పంచాయతీ పరిధిలో 100 మందికిపైగా ఎస్సీలు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం 37 మందిని అర్హులుగా గుర్తించారు. దీంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నవారిని ప్రశ్నార్థకంలో పడేసింది. 15ఏళ్ల క్రితం పంచేడులో పట్టాలు పొందిన పేదలను పక్కనపెట్టి, పట్టాలిచ్చిన లేఅవుట్‌కే మళ్లీ వైసీసీ రంగులు పూసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఓ నాలుగు కుటుంబాల వారు ఆ లేఅవుట్‌లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు.  


పట్టాలిచ్చి మూడేళ్లయినా దక్కని స్థలాలు 

గత ప్రభుత్వ హయాంలో పంచేడు, మినగల్లు మార్గంలో రోడ్డు పక్కన కాపురాలు వెళ్లదీస్తున్న 25 కుటుంబాల గిరిజనులకు ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి 3ఏళ్లు గడచినా నేటికీ వారికి స్థలాలు దక్కలేదు. 2018లో అప్పటి రెవెన్యూ అధికారులు ముందు చెల్లని పట్టాలు చేతిలో పెట్టి వారిని మభ్యపెట్టారు. అప్పట్లో ‘చల్లా యానాదులకు చెల్లని పట్టాలు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు స్పందించిన నాటి కలెక్టర్‌ ఆదేశాలతో ఆ గిరిజనులకు చెల్లుబాటు పట్టాలు ఇచ్చారు. అయితే  నేటికీ స్థలాలు చూపించకపోవడంతో వారు రోడ్డు పక్కన గుడిసెలకే పరిమితమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాపురాలు వెళ్లదీస్తున్నారు.  

 

ఇంటి స్థలం అడిగితే  ఇల్లు రాదంటున్నారు

మూడేళ్ల క్రితం ఇచ్చిన పట్టాను వలంటీరుకు చూపించి తమకు ఇంటి స్థలం ఇప్పించమని అడిగితే ఆన్‌లైన్‌లో ఇల్లు ఇచ్చినట్లు ఉంది. కాబట్టి మీకు ఇంటి స్థలం ఇవ్వరని చెప్పారు. సరే ఆన్‌లైన్‌లో చూపించిన ఇళ్లైనా చూపిస్తే కాపురముంటామని అడిగితే నాయకుల వద్దకు వెళ్లమన్నారు. నాయకుల వద్దకు పోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇళ్లడిగితే మేమేం చేయగలమంటున్నారు. కలెక్టర్‌ మాకు న్యాయం చేయాలి.

- కొమరగిరి అరుణ, గిరిజన మహిళ

 

యానాదుల కోసం భూమి ఇస్తే పైర్లు పెట్టుకున్నారు

చల్లా యానాదుల కోసం అప్పటి కలెక్టర్‌ పట్టాలు మంజూరు చేయించి 55 సర్వేనెంబరులో భూమి చూపించి 12సెంట్లతో స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. అయితే స్థలాల భూమిలో వరిపైరు వేసుకుని మాకు స్థలాలు ఇవ్వడం లేదు. దీంతో మేము రోడ్డుపక్కనే గుడిసెల్లోనే నివాసముంటూ విషసర్పాల భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. కలెక్టర్‌ మా యానాదులకు స్థలాలు ఇచ్చి ఆదుకోవాలి.

- యాకసిరి రమణయ్య, గిరిజన పెద్ద, ఎస్టీ కాలనీ 


 

Updated Date - 2021-07-18T04:30:26+05:30 IST