ఇంకా 31 వేల మంది ఎదురు చూపు

ABN , First Publish Date - 2022-08-08T06:05:10+05:30 IST

నవరత్నాలు -పేదలందరికి ఇళ్ల పథకం కింద అర్హులైన వారందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవ గణాంకాలకు పొంతన ఉండటం లేదు.

ఇంకా 31 వేల మంది ఎదురు చూపు

ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పటికి పూర్తయ్యేనో?

వాటిల్లో ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి

ఇంకా దరఖాస్తు చేస్తూనే ఉన్న పేద ప్రజలు

గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు -పేదలందరికి ఇళ్ల పథకం కింద అర్హులైన వారందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవ గణాంకాలకు పొంతన ఉండటం లేదు. ఇంకా అర్హులైన ఎవరికైనా ఇంటి స్థలం రాకపోతే 90 రోజుల్లోనే ఇస్తామని ఘనంగా చెబుతున్నారు. ఇదంతా నిజమని భావిస్తే తప్పులో కాలేసినట్లే. విభజిత గుంటూరు జిల్లాలోనే ఇంకా 31 వేల పైచిలుకు మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదని అధికారిక గణాంకాలు చెబుతోన్నాయి. వీటిల్లో సింహభాగం కోర్టు కేసుల వలన పెండింగ్‌లో ఉన్నాయి. కొంతమంది అయితే తమకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం అవసరంలేదని నిరాసక్తత కనబరుస్తు న్నారు. ఇతరత్రా కారణాలతో మూడు వేల మందికి పట్టాల పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో లక్షా 48 వేల 579 మందిని పేదలందరికి ఇళ్ల పథకం కోసం ప్రభుత్వం అర్హులుగా ఎంపిక చేసింది. వారిలో ఇప్పటి వరకు లక్షా 17 వేల 440 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లే అవుట్లలో ప్లాట్లను చూపించారు. మిగతా 31,139 మందికి నేటికీ పట్టాలు చేతికందలేదు. ఇది కూడా ఇళ్ల నిర్మాణం పురోగతి లేకపోవ డానికి ఒక కారణంగా మారింది. భూసేకరణ చేసేటప్పుడు వివాదా లున్న వాటిని పట్టించుకోకపోవడమే ఇన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకపోవడానికి మూల కారణంగా మారింది. ఒక్క తెనాలి డివిజన్‌లో 21,677 మందికి కోర్టు కేసులు కారణంగా పంపిణీ చేయలేకపోయారు. వాటిల్లో మంగళగిరిలో 9,202, తాడేపల్లిలో 12,314, చేబ్రోలులో 161 ఉన్నాయి. గుంటూరు డివిజన్‌లో 4,558 మందికి ఇళ్ల పట్టాలు కోర్టు కేసులు కారణంగా పంపిణీ జరగలేదు. పెదకాకాని, గుంటూరు నగరంలో అత్యధికంగా కోర్టు కేసులున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే ప్రభుత్వం చూపించిన మారుమూల ప్రదేశాల్లో ఇళ్ల పట్టాలు తీసుకొనేందుకు కొంతమంది నిరాకరించారు. గుంటూరు నగరంలో 1,513 మంది ఈజాబితాలో ఉన్నారు. ఇతరత్రా కారణాలతో మరో 3,271 మందికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. ఈకోర్టు కేసులు ఎప్పటికి పరిష్కార మౌతాయో చెప్పలేని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. లిటిగేషన్‌ భూములకు ప్రత్యామ్నా యంగా నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండే భూములను అధికారులు సేకరించడం లేదు. కాగా అమరావతి రాజధానిలో ఇతర ప్రాంతాలకు వారికి ప్లాట్లు కేటాయించడంతో అప్పట్లో హైకోర్టు ఆజీవోని కొట్టి వేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా వారు నివసి స్తోన్న గ్రామాల పరిధిలో భూసేకరణ చేయాల్సిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టలేదు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే స్పష్టమౌతోన్నది. కాగా నేటికీ తమకు ఇంటి పట్టా కావాలనే దరఖాస్తులు అందుతూనే ఉండటం కొసమెరుపు. 


Updated Date - 2022-08-08T06:05:10+05:30 IST