అక్కడివారు వాటిని రోజుకు లక్షల్లో లాగించేస్తుంటారు.. వెయ్యికిపైగా దుకాణాల్లో ఏటా మూడు కోట్లకుమించిన వ్యాపారం..అవేమిటంటే?

ABN , First Publish Date - 2021-12-18T16:22:24+05:30 IST

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆహార ప్రియులకు..

అక్కడివారు వాటిని రోజుకు లక్షల్లో లాగించేస్తుంటారు.. వెయ్యికిపైగా దుకాణాల్లో ఏటా మూడు కోట్లకుమించిన వ్యాపారం..అవేమిటంటే?

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన నగరం. ఇక్కడ దొరికే ఆహారపానీయాల రుచి చూసేందుకు ఇక్కడికి వచ్చే పర్యాటకుల తహతహలాడిపోతుంటారు. ఒక్క జోధ్‌పూర్‌లోనే రోజుకు లక్ష మిర్చిబజ్జీలు ఇక్కడున్నవారు తింటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అది శీతాకాలమైనా, వేసవి అయినా, భారీ వర్షం పడుతున్నా లేదా దట్టమైన పొగమంచు అలముకున్నా... వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఇక్కడివారు మిర్చి బజ్జీలను ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటాడరు. సోజ్తీ గేట్,  సర్దార్‌పురా, జలోరీ గేట్, జల్జోగ్ స్క్వేర్, కబూతర్ చౌక్, ఖాండా ఫాల్సా, జూని మండి, ఆదా బజార్ ఇలా నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ మిర్చి బజ్జీలు హాట్ హాట్‌గా అమ్ముడుపోతుంటాయి.


మిర్చి బజ్జీల దుకాణాల ముందు నిత్యం జనాలు బారులుతీరి ఉంటారు. ఈ మిర్చి బజ్జీలో బంగాళదుంప ముద్ద, మసాలా నింపి, శనగపిండిలో ముంచిన తరువాత దానిని నూనెలో వేయిస్తారు. వేడివేడి మిర్చి బజ్జీలు తినేందుకు వినియోగదారులు గంటల తరబడి వేచివుంటారు. గత 45 ఏళ్లుగా ఇక్కడ భారీ స్థాయిలో మిర్జి బజ్జీ విక్రయాలు జరుగుతున్నాయని మిర్చి బండీ యజమాని సత్యనారాయణ అగర్వాల్‌ తెలిపారు. తన తండ్రి, తాత కూడా వీటిని విక్రయిస్తూనే జీవనం సాగించారని తెలిపారు. జోధ్‌పూర్‌లోని జానపద సంస్కృతిలో ఆహార పానీయాల అభిరుచి కూడా ఒక భాగమని 80 ఏళ్ల గోవింద్ కల్లా తెలిపారు. ఈ మిర్చి బజ్జీలను తయారు చేసేందుకు ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, మెత్తగా చేసి సిద్ధం చేసుకోవాలి. తరువాత ఉప్పు, మిరపకాయలు, ఇంగువ, ఆవాలు, కొత్తిమీర మొదలైన మసాలా దినుసులు జత చేస్తారు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర దానిలో కలుపుతారు. జీడిపప్పు ముక్కలు కూడా దానిలో వేస్తారు. పెద్ద పచ్చి మిరపకాయలను మధ్యకు చీల్చి దానిలో  ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని నింపుతారు. దానిని శనగ పిండిలో ముంచి వేయిస్తారు. వీటిని గ్రీన్, స్వీట్ చట్నీలతో ఆహార ప్రియులకు అందిస్తారు. 


స్థానికంగా పెళ్లిళ్లు జరిగినప్పుడు అక్కడ జోధ్‌పురి మిర్చి బండీలను ఏర్పాటు చేస్తారు. దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా ఇక్కడ ప్రతి ఈవెంట్‌లోనూ మిర్చి బజ్జీలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. జోధ్‌పూర్‌లోని దాదాపు వెయ్యి షాపుల్లో మిర్చి బజ్జీల దుకాణాలు ఉన్నాయి. ఒక్కో మిర్చి బజ్జీ ధర 15 నుంచి 20 రూపాయల వరకూ ఉంటుంది. ఇక్కడి మిర్జి బజ్జీల దుకాణాల ద్వారా ఏటా రూ. 300 కోట్లకు మించిన టర్నోవర్ జరుగుతుంది. కాగా గత ఏడాది జూలై 18 న లండన్‌లో స్థిరపడిన రాజస్థానీయులు జోధ్‌పురి మిర్చి బజ్జీ ఫెస్టివల్‌ను నిర్వహించారు.



Updated Date - 2021-12-18T16:22:24+05:30 IST