నిధుల్లేవ్‌

ABN , First Publish Date - 2022-07-11T05:11:49+05:30 IST

వసతిగృహాల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు.

నిధుల్లేవ్‌
గుంటూరు నగరంలో నిలిచిపోయిన గుంటూరు నగరంలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన నిర్మాణం.. చిత్రంలో మందు బాటిళ్లు

సంక్షేమ హాస్టళ్లపై.. అలసత్వం!

వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలు

పైసా నిధులివ్వని ప్రభుత్వం 

నాడునేడు పనులకు దూరంగా సంక్షేమ హాస్టళ్లు 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఇక్కట్లు  

శిథిలావస్థలో పలు భవనాలు  

సంక్షేమ హాస్టళ్లలో తిష్టవేసిన సమస్యలు


విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సంక్షేమ హాస్టళ్లు తెరుచుకునున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల కాలంలో వీటి నిర్వహణలో తీవ్ర అలసత్వం ఏర్పడింది. ఈ ఏడాది హాస్టళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.. కానీ అక్కడ విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాడు నేడు అంటూ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం హాస్టళ్లను మాత్రం విస్మరించింది. ప్రభుత్వం నుంచి పైసా నిధులు రాకపోవడంతో వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. గదులు పెచ్చులూడుతున్నాయి. పరిశుభ్రమైన నీటివసతి లేదు. ఫ్యాన్లు ఊడిపోయాయి. ఇరికిరుకు గదులు.. ఇంకో వైపున సిబ్బంది కొరత.. ఇన్ని సమస్యల నడుమ హాస్టళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి హాస్టల్‌ భవనాల మరమ్మతులు చేపట్టి.. మౌలిక వసతులపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. 


ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, జూలై 10: వసతిగృహాల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. హాస్టళ్లలో సమస్యల కారణంగా పిల్లలు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. నిధుల విషయంలో పాలకులు శీతకన్ను వేయడంలో ఏళ్ల తరబడి సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లపై దృష్టి పెట్టారే తప్ప వాటికి అనుబంధంగా ఉన్న వసతిగృహాలను మాత్రం కనికరించలేదు. కరోనాతో రెండేళ్లపాటు మూతబడిన వసతిగృహాలను గతేడాది సెప్టెంబరులో భయభయంగానే తెరిచారు. కనీసం ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికన్నా హాస్టళ్లలో సదుపాయాలను మెరుగుపరచే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందనుకుంటే నిరాశే ఎదురైంది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని భవనాలు, శుభ్రమైన తాగునీరు లేకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, ఇరుకిరుకు గదులు ఇలా ఒకటేమిటీ చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సమస్యలు వసతిగృహాల్లో రాజ్యమేలుతున్నాయి. ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఆ గృహాల్లో క్షేమంగా ఉండేనా అని మదనపడుతున్నారు.

గతేడాది చాలావరకు మూత...

గతేడాది అడ్మిషన్లు కనీసస్థాయిలో కూడా లేకపోవడంతో చాలావరకు వసతిగృహాలు మూతపడ్డాయి. ప్రస్తుతం అన్నీ తెరుచుకున్నప్పటికీ వాటిలో అడ్మిషన్లు ఎన్ని వస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికైతే వచ్చే విద్యార్థుల సంఖ్య మందకొడిగానే ఉంది. ఇప్పుడే విద్యాసంస్థలు తెరుచుకున్నందున పలుచగా ఉన్నారని రాబోయే రోజుల్లో వందశాతం విద్యార్థులు వసతిగృహాలకు వస్తారనే ఆశాభావాన్ని సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారం ప్రతి వసతిగృహానికి ముగ్గురు సిబ్బంది ఉండాలి. కానీ దాదాపు 60శాతం హాస్టళ్లలో ఇద్దరు సిబ్బందితోనే లాగించేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే మరీ దారుణంగా ఒక్కరే ఉండడం సిబ్బంది కొరతను సూచిస్తోంది. వెంటనే తగినంత స్టాఫ్‌ను కేటాయించాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.

బాపట్ల జిల్లాలో మొత్తం 81 హాస్టళ్లు..

పోస్ట్‌ మెట్రిక్‌, ఫ్రీ మెట్రిక్‌ రెండూ కలిపి జిల్లాలో 81 సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 ఉండగా, బీసీలకు 42, ఎస్టీలకు 12 వసతిగృహాలు సేవలందిస్తున్నాయి. వాస్తవానికి వీటిలో ఒక్కో హాస్టల్లో వందమంది విద్యార్థులు ఉండాలి. కానీ వసతులు అంతంత మాత్రంగా ఉండడంతో తల్లిదండ్రులు పిల్లలను వీటిలో చేర్పించడానికి నిరాసక్తత  కనబరుస్తున్నారు. గత సంవత్సరం అడ్మిషన్లు 60శాతానికి కూడా మించలేదనేది సమాచారం. ఈ సంవత్సరం విద్యార్థులను సంక్షేమ వసతిగృహాల వైపు తీసుకురావడానికి ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లు యంత్రాంగం చెబుతోంది. పర్చూరులోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులకు పక్కనున్న కాలువ నీరే తాగునీరుగా వాడుకోవాల్సిన దుస్థితి ఉంది. నామమాత్రంగా ఉన్న ప్యూరిఫయర్‌ ద్వారా ఆ నీటినే శుభ్రపరచుకుని విద్యార్థులు తాగాల్సి ఉంది. ఇక మరుగుదొడ్లు అయితే కనీస వసతులు లేకుండా అధ్వానంగా ఉన్నాయి. అద్దంకిలోని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్సీ బాలుర వసతిగృహంలో అయితే పిచ్చి మొక్కలు పెరిగి పరిసరాలు బీడుభూమిని తలపిస్తున్నాయి. ఇక మరుగుదొడ్ల డోర్లకు రంధ్రాలు దర్శనమిస్తున్నాయి. వేమూరు ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌ భవనాలయితే శిధిలావస్థకు చేరుకుని పెచ్చులూడి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఇలా దాదాపు ఉన్న వసతిగృహాల్లో 50శాతం వరకు ఏదో ఒక సమస్యతో కునారిల్లుతూనే ఉన్నాయి.


గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇలా.. 

జిల్లా పరిధిలోని సంక్షేమ హాస్టల్స్‌ అధ్వాన్నంగా తయారు అయ్యాయి. హాస్టల్స్‌ మరమ్మతుల కోసం ఏటా విడుదల చేసే నిర్వహణ నిధులు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.  జిల్లాలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌ 135 ఉన్నాయి. ఇందులో కొన్ని అద్దెభవనాల్లో కొనసాగుతుండగా సొంతభవనాలు ఉన్నా మరమ్మతుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. గుంటూరు నగరం బృందావన్‌గార్డెన్స్‌లో ఎస్సీ, వికలాంగుల సంక్షేమహాస్టల్‌, రాజాగారితోటిని హాస్టల్స్‌లో మరమ్మతులకు రెండేళ్ల నుంచి నిధులు విడుదల కావడం లేదు. మరోవైపు బీఆర్‌ స్టేడియం ఎదురుగా ఐదేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ అసంపూర్తిగానే నిలిచిపోయింది. కాంట్రాక్టర్‌లకు సుమారు కోటి రూపాయలు బకాయిలు ఉండటంతో భవన నిర్మాణం పూర్తిచేయలేదు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు.. తమకు రూ.50 లక్షలు చెల్లించినా భవన నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు.  తెనాలి పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లలో పలు సమస్యలు తిష్ట వేశాయి. కొత్తపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌, ఎస్టీ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ ఒకే ప్రాంగణంలో ఉండటంతో వసతి చాలక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.  పొన్నూరు మండలంలోని మునిపల్లె గ్రామం వద్ద నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ప్రహరీ కూలి ఏళ్లు గడుస్తున్నా వసతి గృహం వైపు కన్నెత్తి చూసే వారే లేకపోయారు. పంట పొలాల్లో వసతి గృహం నిర్మించండంతో విషసర్పాలు గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చేబ్రోలు మండంలోని బీసీ హాస్టల్‌ కూడా అధ్వానస్థితిలో ఉంది.  

పల్నాడు జిల్లాలో..

వినుకొండ నియోజకవర్గంలో 12 సంక్షేమ హాస్టల్స్‌, 3 కేజీబీవీలు, 2 సాంఘిక గురుకుల పాఠశాలలు ఉన్నాయి. హాస్టల్స్‌లో విద్యార్థులకు మౌలిక వసతులు అరకొరగా ఉన్నాయి. పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ శ్లాబ్‌ పెచ్చులూడి ఉన్నాయి. విద్యార్థులపై ఎప్పుడు పడతాయోయన్న భయం ఉంది. నూజెండ్లలో ఉన్న బీసీ హాస్టల్‌లో ప్రహరీ లేకపోవడంతో హాస్టల్‌ ఆవరణలో పశువులు తిరుగుతూ మురుగునీరు నిలిచి విద్యార్థులకు అసౌకర్యంగా ఉంది. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో టాయిలెట్స్‌ తలుపులు ఊడిపోయాయి.  గురజాల నియోజకవర్గ పరిధిలో మోర్జంపాడులో ఉన్న బీసీ బాలుర వసతిగృహం, దాచేపల్లిలో ఇంటర్మీడియట్‌ బాలికల వసతిగృహం, గురజాల ఎస్సీబాలికల వసతిగృహం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దాచేపల్లిలోని ఇంటర్‌ బాలికల వసతిగృహం రేకుల షెడ్‌లో సరైన వసతులు లేక  ఇరుకుగా అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. మోర్జంపాడు, గురజాలలోనూ భవనాలు కాస్త పాతవి కావటంతో వర్షాకాలంలో అక్కడక్కడ నెర్రెలు ఇస్తున్నాయి.  అచ్చంపేట గురుకుల బాలుర పాఠశాల వసతిగృహం మరమ్మత్తులకు నోచుకోలేదు. కిటికీలు, దర్వాజాలు లేకపోవటంతో కొన్ని గదుల్లో బండలు కూడా లేచి ఉన్నాయి.  క్రోసూరులో బీసీ బాలుర వసతి గృహం, కళాశాల విద్యార్థుల వసతి గృహం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని పలు వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

ధరలు పెరిగినా అదే మెనూ..

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా పాత మెస్‌చార్జీలతో భోజన మెనూ సాగిస్తున్నారు. మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలతో పాటు కళాశాల హాస్టల్స్‌లో కూడా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్‌ నుంచి పీజీ వరకు కళాశాలల వసతి గృహాల్లో  ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.1,400 మెస్‌చార్జీ చెల్లిస్తుంది. దీనిలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంటగ్యాస్‌, చికెన్‌, గుడ్డు, బియ్యం సహా కొనుగోలు చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.1,000 నుంచి రూ.1,950 వరకు కేటగిరిల వారీగా అందజేస్తుంది. పాత మెస్‌చార్జీల్లో నేడు కొనసాగించడం కష్టతరంగా ఉందని వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌ బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. 



Updated Date - 2022-07-11T05:11:49+05:30 IST