పెద్దాసుపత్రిలో పడకలు ఫుల్‌

ABN , First Publish Date - 2021-04-16T06:22:19+05:30 IST

పెద్దాసుపత్రిలో పడకలు ఫుల్‌

పెద్దాసుపత్రిలో పడకలు ఫుల్‌
కరోనా ఐసోలేషన్‌ వార్డు

కరోనా ఐసోలేషన్‌ వార్డులో 110మందికి వైద్యసేవలు

అత్యవసరంగా మహిళా వార్డు ఖాళీ

మరో 40పడకలు ఏర్పాటు

క్వారంటైన్‌ సెంటర్లు పునఃప్రారంభమైతేనే వెసులుబాటు

ఖమ్మం సంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 15: కరోనా వైరస్‌ తీవ్రత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డును తాకింది. తొలి విడత కరోనా వైరస్‌ సమయంలో జిల్లా ఆసుపత్రిలో వంద పడక ల్లోకి కరోనా బాధితులు చేరేందుకు రెండు నెలల కాలం పట్టగా రెండో విడతలో మాత్రం కేవలం పక్షం రోజుల్లోనే 110 పడకలు నిండాయి అంటే ఖమ్మం జిల్లాలో కరోనా ఉధృతి ఇట్టే తెలుస్తోంది. 

పెద్దాసుపత్రిలో 110పడకలు ఫుల్‌

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గతేడాది కరోనా వైద్యసేవల కోసం దశల వారీగా 150పడకలను ఏర్పాటుచేశారు. తర్వాత కరోనా తీవ్రత తగ్గటంతో కరోనావార్డులను మార్పు చేసి పురుషులు, స్త్రీల వైద్య సేవలు, ఆపరేషన్‌ విభాగాలను ఏర్పాటు చేసి సాధారణ వైద్య సేవలు ప్రారంభించారు. ఈసారి ఏప్రిల్‌ మొదటి వారం నుంచే కరోనా తీవ్రత గణనీయంగా పెరగటంతో జిల్లా ఆసుపత్రిలోని ఐసో లేషన్‌ వార్డులో చేరే రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు పది మంధి కరోనా రోగులు చేరుతుండగా ఇద్దరు మాత్రమే ఇంటికి వెళ్తున్నారు. గురువారం నాటికి జిల్లా ఆసుపత్రిలో 110పడకలతో  కరోనా ఐసోలేషన్‌ వార్డు పడకలు నిండాయి.

అత్యవసరంగా మహిళా వార్డు మార్పు

ఐసోలేషన్‌ వార్డులోని పడ కలు నిండడంతో మహిళా వార్డులో చికిత్స పొందుతున్న వారిని అత్యవసరంగా ఇతర విభాగాల్లోకి మార్చి అందులో 40పడకలను కరోనా సేవలకు ఏర్పాటు చేశారు.

క్వారంటైన్‌ సెంటర్లు లేక పెరిగిన రద్దీ

జిల్లా ఆసుపత్రిలో 110పడకల్లో ఉన్న రోగుల్లో 40మందిని కరోనా తీవ్రత ఎక్కువగా లేని వారిగా డాక్టర్లు గుర్తించారు. కానీ ఆయా రోగుల ఇళ్ల వద్ద ఉండేందుకు సదుపాయాలు లేక పోవటం తో జిల్లా ఆసుపత్రిలోనే ఉంటామంటున్నారు.దీంతో ఐసోలేషన్‌ వార్డు పడకలు నిండుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లా పరిపాలన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తిరిగి జిల్లాలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. 

Updated Date - 2021-04-16T06:22:19+05:30 IST