హార్టికల్చర్‌ పథకం.. ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2022-01-28T05:08:53+05:30 IST

డ్రైల్యాడ్‌ హార్టికల్చర్‌ పథకం ప్రశ్నార్థకంగా మారింది.

హార్టికల్చర్‌ పథకం.. ప్రశ్నార్థకం
ముత్యాలపాడులో సాగు చేసిన జామ తోట

  1. బిల్లులు అందక రైతుల ఆందోళన 
  2. ఉపాధి సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు
  3. మొక్కల పెంపునకు తప్పని అప్పులు

   డ్రైల్యాడ్‌ హార్టికల్చర్‌ పథకం ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధికారం చేపట్టాక ఆ పథకాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో బిల్లులు మంజూరుకాక అన్నదాతలు నానాఅవస్థలు పడుతున్నారు. మొక్కలు పెంచి, అప్పులు తెచ్చి వాటిని సంరక్షించుకోలేక దిక్కులు చూస్తున్నారు. బిల్లుల కోసం ఉపాధి హామీ పథకం సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బిల్లులు పెట్టామని, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు.


చాగలమర్రి, జనవరి 27: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులను ఎంపిక చేసి ఆ పథకం కింద మామిడి, జామ, చీని, నిమ్మ మొక్కలు నాటించే పథకానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంతలు తవ్వకం నుంచి మూడేళ్లపాటు చెట్లు ఎదుగుదల, నీరు తదితర యాజమాన్య పద్ధతుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకు అనేక నిబంధనలు ముడిపెట్టి పథకం అమలు చేసినప్పటికీ లక్ష్యం నెరవేరలేదన్న విమర్శలున్నాయి. గుంతల తవ్వకానికి సంబంధించి కూలీల బిల్లులు మినహా రెండున్నరేళ్లుగా ఒక మొక్కకు కూడా బిల్లులు మంజూరుకాక పోవడంతో పేద రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఐదు ఎకరాల్లో 350 మొక్కలు నాటాలి. ఒక మొక్కకు నెలకు నీరందిస్తే రూ.4.15, దుక్కి దున్నితే ఎకరాకు రూ.1,000, ఎరువులకు, మొక్కకు రూ.25, మొక్కలు నాటినందుకు రూ.56 ప్రకారం రైతుల ఖాతాలో జమ కావాలి. ఏడాదిగా పైసా కూడా ఇవ్వడం లేదు. దీంతో  రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. 


బిల్లుల కోసం ఎదురుచూపులు

మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో 30 మంది రైతులు 53 ఎకరాల్లో జామ, మామిడి, నిమ్మ మొక్కలు నాటారు. వాటి కోసం రూ.20 లక్షల దాకా ఖర్చు చేశారు. డి.వనిపెంటలో ఐదుగురు రైతులు 10 ఎకరా ల్లో పండ్ల మొక్కలు నాటేందుకు రూ.5 లక్షలు, శెట్టివీడులో పది మంది రైతులు 15 ఎక రాలు రూ.8 లక్షలు, గొట్లూరులో ఆరుగురు రైతులు 12 ఎకరాలు రూ.7 లక్షలు, కలుగొట్ల పల్లె, చిన్నబోదనం, చింతలచెరువు గ్రామాల్లో పది మంది రైతులు రూ.3 లక్షల దాకా మొక్కల పెంపకం కోసం మూడేళ్లపాటు ఖర్చు చేశారు. బిల్లుల కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. రైతు ఖాతాలో ఇంత వరకు పైసా కూడా జమ కాలేదు. దీంతో మొక్కలు బతికించుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొక్కలను బతికించుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలకు బిందెలతో నీరు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎం బుక్కులు నమోదు చేసి ఆన్‌లైన్‌లో జన్‌రేట్‌ చేశామని టెక్నికల్‌ అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తే రైతుల ఖాతాలో జమ అవుతాయని పేర్కొంటున్నారు. అలాగే రెండేళ్ల క్రితం వెలుగు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హార్టికల్చర్‌లో కూడా పైసా బిల్లులు అందలేదు. వెలుగు శాఖ కార్యాలయంలో హార్టికల్చర్‌కు సంబంధించిన రికార్డులు కూడా లేవని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హార్టికల్చర్‌కు సంబంధించిన బిల్లులను మంజూరు చేసి, గల్లంతైన రికార్డులపై విచారణ జరిపాలని రైతులు కోరుతున్నారు. 


బిల్లులు అందలేదు

 మూడు ఎకరాల్లో చీని మొక్కలు నాటాను. ఎకరాకు వంద మొక్కలు నాటి పెంచుకుంటున్నా. రూ.1.20 లక్షలు దాకా ఖర్చు చేశా. ఇంతవరకు బిల్లులు అందలేదు. మొక్కలను బతికించుకునేందుకు కష్టాలు పడుతున్నా. 

- కొండయ్య, ముత్యాలపాడు

Updated Date - 2022-01-28T05:08:53+05:30 IST