అటవీ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు

ABN , First Publish Date - 2020-08-07T10:03:04+05:30 IST

పర్యావరణం.. పచ్చతోరణం అంటూ ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలు..

అటవీ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు

ఆగని బామ్మర్ది ఆగడాలు

జక్కంపూడి షాబాదతో పాటు కొండపల్లికీ టెండర్

అటవీ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు

రూ.20కోట్ల విలువచేసే గ్రావెల్ తరలింపు

అటవీ, విజిలెన్స్ మెరుపు దాడులు

8 ఎక్స్‌కవేటర్లు.. 6 భారీ టిప్పర్లు స్వాధీనం

రాజకీయ ఒత్తిళ్లతో అరకొర జరిమానా


విజయవాడ, ఆంధ్రజ్యోతి: పర్యావరణం.. పచ్చతోరణం అంటూ ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం పచ్చటి అడవులను.. చక్కటి కొండలను ఎంచక్కా తవ్వేస్తున్నారు. ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం జరిగిన ఇబ్రహీంపట్నానికి కూతవేటు దూరంలో స్థానిక ఎమ్మెల్యే బామ్మర్ది పర్యావరణ విధ్వంసానికి తెరతీశారు. అడవిలో కాసులవేటకు తెగబడ్డారు. బామ్మర్ది ధనదాహానికి జక్కంపూడి షాబాద, కొండపల్లిలోని కొండలు కరిగి సుమారు రూ.20 కోట్ల పైచిలుకు గ్రావెల్‌ రూపంలో తరలిపోతోంది.


మైలవరం నియోజకవర్గ పరిధిలో పేదల నివేశన స్థలాల కోసం లోతట్టు భూములు కొన్నారు. వాటిని మెరక చేయాలన్న సాకుతో ఎమ్మెల్యే బామ్మర్ది నియోజక వర్గంలోని కొండలను పిండి చేసేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే దేవదాయ భూములు, రెవెన్యూ పోరంబోకు, అటవీశాఖ పరిధిలోని కొండలను నెల రోజులుగా తవ్వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి షాబాదలో కొండలను అక్రమంగా తవ్వడం ప్రారంభించినప్పుడే వాటి వెనుక ఎమ్మెల్యే బామ్మర్ది హస్తం ఉందని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. షాబాదలో కూలీలు, డ్రైవర్ల ప్రాణాలను పణంగా పెట్టిమరీ రూ.10 కోట్ల విలువచేసే అక్రమ తవ్వకాల బాగోతం నడిపించారు. తాజాగా కొండపల్లి అటవీ భూముల్లో ఉన్న కొండల్ని తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. సుమారు నెలరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు కొండపల్లి కపిలవాయి సత్రం దేవాలయ భూముల్లోనూ ఎటువంటి అనుమతులు లేకుండా 40 అడుగుల మేర 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. 


20వేలలారీల గ్రావెల్‌ తరలింపు

అటవీ భూముల్లో తవ్వకాలపై స్థానికులెవరైనా ప్రశ్నిస్తే.. మైలవరం నియోజకవర్గ పరిధిలో నివేశన స్థలాల లే అవుట్లకు సుమారు 1.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరమని, అందుకు 20వేల లారీల మట్టిని తరలించాల్సి ఉందని ఎమ్మెల్యే బామ్మర్ది నమ్మబలుకుతున్నారు. తాము అధికారికంగానే మట్టిని తరలిస్తున్నామని చెప్పడంతో స్థానికులూ వెనక్కి తగ్గారు. అనుమతి పత్రాలు చూపాలని నిలదీసిన ఒకరిద్దరు సొంత పార్టీ కార్యకర్తలపై బామ్మర్ది చేయి కూడా చేసుకోవడం గమనార్హం. దీంతో స్థానికులెవరూ బామ్మర్ది దందాను ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. దీంతో కొండపల్లి అటవీ భూముల్లో నిత్యం కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్‌తో వందలాది లారీలు అడ్డూ అదుపు లేకుండా వెళ్తున్నాయి.


పేదల నివేశన స్థలాలకు అటవీ భూమిలోని మట్టిని తరలించడం ఏమిటంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అటవీ భూముల్లో మట్టిని ఉచితంగా తరలించి ప్రభుత్వం నుంచి డబ్బును కాజేయడంతో పాటు తవ్విన గ్రావెల్‌ను బయట అమ్ముకుని కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారులను మామూళ్లతోనో.. భయపెట్టో లొంగదీసుకుంటున్నారు. చివరికి బామ్మర్ది ఆగడాలపై సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు కొరడా ఝళిపించినట్లు సమాచారం. అక్రమ తవ్వకాలపై జరిమానా విధించడంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. 



తవ్వింది కోట్లలో.. జరిమానా లక్షల్లో..!

కొండపల్లి అటవీ క్వారీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై రెండు రోజుల క్రితం అటవీశాఖ, విజిలెన్స్‌ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఫారెస్ట్‌ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుని 8 ఎక్స్‌కవేటర్లు, 6 భారీ టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.  భారీ ఎత్తున జరిగిన అక్రమ తవ్వకాలను చూసి అధికారులే నివ్వెరపోయారు. సుమారు రూ.10 కోట్ల పైచిలుకు గ్రావెల్‌ను తరలించారని అంచనా. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేవలం రూ.10 లక్షల జరిమానాతో అధికారులు సరిపెట్టారు. అటవీశాఖ చట్టం ప్రకారం అక్రమంగా తవ్వేసిన గ్రావెల్‌ విలువకు ఐదురెట్ల వరకు జరిమానా విధించవచ్చు. అంటే.. సుమారు రూ.50 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నా అధికారులు రూ.10 లక్షలతో సరిపెట్టారు.


వందల కోట్ల దోపిడీపై చర్యలేవి : దేవినేని ఉమా

జి.కొండూరు: మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న రూ.100 కోట్ల దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. ‘కొండపల్లి రిజర్వు ఫారెస్టులో మూడు రోజుల కిత్రం అక్రమ క్వారీయింగ్‌ చేస్తూ పట్టుబడిన 8 ఎక్స్‌కవేటర్లు, 6 టిప్పర్లు ఎవరివి..? దేవదాయ, ఫారెస్ట్‌ అధికారులు ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..? ఎంత జరిమానా విధించారు..?’ చెప్పాలన్నారు. ‘బామ్మర్ది బెదిరింపుల వెనుక ఉంది మీ ప్రజాప్రతినిధి కాదా..’ అని ప్రశ్నించారు. 


షాబాదలో ఆగని తవ్వకాలు

షాబాద గ్రామంలోని రెవెన్యూ సర్వే నెంబరు 85లో కొండలను అక్రమంగా తవ్వే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడి నుంచి నిత్యం వెయ్యి లారీల మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కొండకు ఓవైపు పేదలకు నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలు ఉండగా, మరోవైపు కొండను తవ్వడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2020-08-07T10:03:04+05:30 IST