చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2021-04-08T06:23:41+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

చిగురిస్తున్న ఆశలు

- ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఎదురుచూపులు

- జిల్లాలో 624 ఖాళీలు

- సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు

జగిత్యాల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగునంగా ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను క్యాడర్‌ల వారిగా గుర్తించి నివేదిక పంపారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌ 2020 చివరి నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేపట్టనుండటంతో ఖాళీలపై ఇంకా స్పష్టత రానుందని విద్యాశాఖాధికారులు అంటున్నారు.  

జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు  

జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో డిసెంబరు 2020నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను అధికారులు సేకరించారు. మొత్తం 624 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎం- 2 పోస్టులు 99 ఖాళీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 275 ఖాళీలు ఉండగా ఇందులో మ్యాథ్స్‌ 43, ఫిజికల్‌ సైన్స్‌ 14, బయాలోజికల్‌ సైన్స్‌ 40, సోషల్‌ స్టడీస్‌ 75, ఇంగ్లీష్‌ 39, తెలుగు 26, హిందీ 31, ఉర్ధు 2, పిజికల్‌ డైరెక్టర్‌ 5 పోస్టులు ఖాళీలుగా గుర్తించారు. లాంగ్వేజ్‌ పండితులు 25 ఖాళీలు, పీఈటీలు 9 ఖాళీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 100 ఖాళీలు, ఎస్జీటీ పోస్టులు 114 ఖాళీలున్నట్లు అధికారులు గుర్తించారు. 

శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు

 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించాయి. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారు కొందరు శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం కారణంగా కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాయి. నిరుద్యోగులు సైతం ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకొందరు స్టడీ మెటీరియల్‌ తెప్పించుకుని సన్నద్ధం అవుతున్నారు. సాధ్యమైనంత తొందరలో డీఎస్సీ ప్రకటన జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

ఖాళీ పోస్టులను గుర్తించాం

- ఇన్‌చార్జీ డీఈఓ జగన్‌మోహన్‌రెడ్డి, జగిత్యాల

అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించాం. ప్రభుత్వ ప్రకటనకు అనుగునంగా సమాచారం సేకరిస్తున్నాము. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. పాఠశాలల్లో అవసరం మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. 

Updated Date - 2021-04-08T06:23:41+05:30 IST