Abn logo
Jun 21 2021 @ 23:33PM

సీఎం ప్రకటనతో గౌరవెల్లి రిజర్వాయర్‌పై ఆశలు

ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీటిని నింపే అవకాశం 

90 శాతం పనులు పూర్తి

హుస్నాబాద్‌, జూన్‌ 21 : శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేసి ఈ ఏడాదే నీటిని నింపాలని సీఎం కేసీఆర్‌ సిద్దిపేట పర్యటనలో ఆదేశించడంతో మెట్ట రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాకుండా రిజర్వాయర్‌ పనులు వేగంగా జరిగేందుకు రూ.89 కోట్లు మంజూరు చేయడంతో త్వరితగతిన పెండింగ్‌ పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పనులు జరుగగా మిగిలిన 10 శాతం పనులను యుద్ధప్రాతిపదికన చేపడితే ఈ ఏడాది చివరివరకు రిజర్వాయర్‌లో నీటిని నింపవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మిడ్‌మానేరు ద్వారా బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి సొరంగం ద్వారా నీటిని తీసుకెళ్లే పనులు పూర్తయ్యాయి. నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటారు పంపులు చైనా నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు, మూడునెలల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రిజర్వాయర్‌ నుంచి ఇతర గ్రామాలకు వెళ్తున్న రెండు రోడ్ల వద్ద గండ్లను పూడ్చాల్సి ఉన్నది. ఇవి పూర్తయితేనే మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. ముంపు భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదని 272 ఎకరాలకు చెందిన 71 మంది రైతులు కోర్టును అశ్రయించగా ఆ భూములకు ఇటీవల ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.సీఎం కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ పనులు, పరిహార పంపిణీకి రూ.89 కోట్లు మంజూరు చేయడంతో ఇక అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు.  

గౌరవెల్లికి నిధుల మంజూరు పట్ల హర్షం 

కోహెడ, జూన్‌ 21 : గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి సీఎం కేసీఆర్‌ రూ.89 కోట్లు మంజూరు చేయడం పట్ల ఎంపీపీ కొక్కుల కీర్తి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ పేర్యాల రాజేశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు. వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, తోట అంజనేయులు, కొక్కుల సురేష్‌, వెంకటస్వామి, రాజు ఉన్నారు.