హాంగ్ కాంగ్ ప్రజాస్వామికవాదులు రాసిన పుస్తకాలపై సమీక్ష

ABN , First Publish Date - 2020-07-05T20:18:18+05:30 IST

చైనా తీసుకొచ్చిన కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టానికి అంతా అనుకూలంగా

హాంగ్ కాంగ్ ప్రజాస్వామికవాదులు రాసిన పుస్తకాలపై సమీక్ష

హాంగ్ కాంగ్ : చైనా తీసుకొచ్చిన కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టానికి అంతా అనుకూలంగా ఉందా? లేదా? అనే పరిశీలనలు హాంగ్ కాంగ్‌లో జోరందుకున్నాయి. ఈ చట్టాన్ని విమర్శిస్తూ ఎవరైనా మాట్లాడుతున్నారా? రాస్తున్నారా? అని నిశితంగా పరిశీలిస్తున్నారు. హాంగ్ కాంగ్ గ్రంథాలయాలు 9 పుస్తకాలపై సమీక్ష చేపట్టాయి. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 


స్థానికవాదులు, ప్రజాస్వామికవాదులు రాసిన 9 పుస్తకాలను హాంగ్ కాంగ్ గ్రంథాలయాలు చలామణి నుంచి తొలగించాయి. ఈ పుస్తకాలు చైనా కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టంతో ఘర్షణ పడేవిధంగా ఉన్నాయేమో సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. 


బార్ అసోసియేషన్ చైర్మన్ ఫిలిప్ డైక్స్ మాట్లాడుతూ, ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందని, ఈ హక్కును పరిమితం చేయడం సరైనదేనా? అనే అంశంపై అధికారులు వివరణ ఇవ్వాలని అన్నారు. గ్రంథాలయాలు 9 పుస్తకాలను సమీక్ష పేరుతో వెనుకకు తీసుకోవడం ఆందోళనకరమని, భయానకమని అన్నారు. 


హాంగ్ కాంగ్ పబ్లిక్ లైబ్రరీలను నిర్వహిస్తున్న లీజర్ అండ్ కల్చరల్ సర్వీసెస్ కూడా కొన్ని పుస్తకాలను వెనుకకు తీసుకున్నట్లు ధ్రువీకరించింది. కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టానికి అనుగుణంగా ఉన్నాయో, లేదో చూసేందుకు కొన్ని పుస్తకాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ పుస్తకాల గురించి వివరాలను తెలియజేయలేదు. 


ఉద్యమకారుడు జోషువా వోంగ్ చి-ఫుంగ్, లోకలిస్ట్ హొరాస్ చిన్ వాన్-కాన్, సివిక్ పార్టీ లా మేకర్ టాన్యా చాన్ రాసిన పుస్తకాలను సమీక్షిస్తున్నారు. వీరు రాసిన 9 పుస్తకాలు సమీక్షలో ఉన్నట్లు గ్రంథాలయాల వెబ్‌సైట్‌లో పరిశీలించినపుడు తెలిసింది. 


గ్రంథాలయ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని, దానికి అనుగుణంగా ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు పుస్తకాలను సమీక్షిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పుస్తకాలను పాఠకులకు అందజేయడం సాధ్యం కాదన్నారు. 


ఇదిలావుండగా, చైనా అమల్లోకి తెచ్చిన కొత్త చట్టం చాలా తక్కువ మందికి మాత్రమే వర్తిస్తుందని మెయిన్ ల్యాండ్ చైనీస్, హాంగ్ కాంగ్ అధికారులు చెప్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం, సమావేశమయ్యేందుకు హక్కులకు రక్షణ ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-07-05T20:18:18+05:30 IST