సేవలకు సలాం

ABN , First Publish Date - 2020-12-06T05:14:41+05:30 IST

పలు రకాల పోలీసు భద్రతా విభాగాల్లో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి. గొడవలు, ఆందోళనలు, ధర్నాలు, వీఐపీల పర్యటనల్లో తొలి వరుసలో ఉండి హోంగార్డులు బందోబస్తు నిర్వహిస్తుంటారు.

సేవలకు సలాం

శాంతిభద్రతలు కాపాడడంలో హోంగార్డులు భేష్‌

విధి నిర్వహణలో నిబద్ధత

విపత్కర పరిస్థితుల్లోనూ ముందడుగు

చాలీ చాలని జీతాలు, అందని హెల్త్‌కార్డులు 

నేడు 58వ హోంగార్డుల దినోత్సవం

ఖమ్మంక్రైం, డిసెంబరు 5:  పలు రకాల పోలీసు భద్రతా విభాగాల్లో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి. గొడవలు, ఆందోళనలు, ధర్నాలు, వీఐపీల పర్యటనల్లో తొలి వరుసలో ఉండి హోంగార్డులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇంక్రిమెంట్లు రూ వేలల్లో ఉంటాయి. కానీ హోంగార్డులకు మాత్రం ఏడాదికి రూ.1000 మాత్రమే అధికంగా చెల్లిస్తారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు  సెలవు పెట్టినా ఆరోజు జీతం కట్‌చేస్తారు. వీరు పోలీసుశాఖలో మాత్రమే కాకుండా ఆర్టీసీ, రవాణా, మార్కెట్‌, ట్రాఫిక్‌, జైళ్లు, అగ్నిమాపక కేంద్రాలలో విధులు నిర్వహిస్తుంటారు.  అలుపెరుగక విధినిర్వహణలో రాజీపడక శాంతిభద్రతల పరిరక్షణలో చెమటోడుస్తున్న హోంగార్డులకు సలాం కొట్టాల్సిందే.. 

1963లో ప్రారంభం

1963వ సంవత్సరంలో డిసెంబరు 6న అప్పటి ప్రధానమంత్రి మొరార్జీదేశాయ్‌ హోంగార్డుల వ్యవస్థను  ప్రారంభించారు. 1992లో హోంగార్డులకు  రోజుకు రూ.22చెల్లించేవారు. ప్రస్తుతం ప్రభుత్వవారికి రోజుకు రూ.745చొప్పున నెలకు రూ.22,350 జీతంగా ఇస్తున్నారు. గతంలో వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీతాలు ఇచ్చేవి. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లిస్తుంది. ముందు వీరిని గార్డులు అని పిలిచినా తర్వాత హోంగార్డులు అనే పేరు స్థిరపడింది.

ఉమ్మడి జిల్లాలో 1165మంది

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,165మంది హోంగార్డుల ఉన్నారు.  వీరిలో ఖమ్మం జిల్లాలో 625మంది హోంగార్డులు ఉన్నారు. మహిళా హోంగార్డులు 66మంది, ఓడీ డ్యూటీలో 176మంది, ట్రాఫిక్‌లో 22మంది, మిగతావారు జిల్లాలోని పోలీసుస్టేషన్లలో, కమిషనరేట్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

హెల్త్‌కార్డులు లేవు

రోడ్లపై, పోలీసుస్టేషన్లలో దుర్భత వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వమించే హోంగార్డులకు హెల్త్‌కార్డులు ఇప్పటి వరకు లేవు. ఏదైనా కష్టం వస్తే సిబ్బంది ఒకరికి ఒకరు సహకరించుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. పలుసార్లు సిబ్బంది మంత్రులకు, అధికారులకు వినతులు అందించారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందనలేదు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని హోంగార్డులు కోరుతున్నారు.

ఎక్స్‌గ్రేషియా లేదు

ఏదైనా ప్రమాదం సంభవించి కాలం కలిసిరాక కన్నుమూస్తే హోంగార్డులకు ప్రభుత్వం నుంచి కాని డిపార్టుమెంట్‌ నుంచి కాని ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందదు. కేవలం విధులు నిర్వహించినందుకు దినసరి వేతనం మాత్రమే ఇస్తారు. ఒకరోజు హోంగార్డులు మరణించినా, రిటైర్డు అయినా వారికి జిల్లాలోని హరోంగార్డులు అందరు కలిసి వారి ఒకరోజు వేతనం ఎక్స్‌గ్రేషిషియాగా వారికి వారే ప్రకటించుకుని యూనియన్‌ ద్వారా అందిస్తున్నారు.

హోంగార్డులకు ఇళ్లు మంజూరుచేయాలి

దామెర రవి, హోంగార్డు లసంఘం ఉపాధ్యక్షుడు

హోంగార్డులకు ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరుచేయాలి. ఇస్తామని గతంలో ప్రభుత్వం హామి ఇచ్చింది. హెల్త్‌కార్డులు మంజూరు చేసి ఇబ్బందులు పడుతున్న హోంగార్డులను ఆదుకోవాలి

Updated Date - 2020-12-06T05:14:41+05:30 IST