ఇంటి దొంగ పనే!

ABN , First Publish Date - 2021-05-17T05:09:36+05:30 IST

అనకాపల్లి పట్టణం చోడవరం రోడ్డు మిరియాలకాలనీలో గత నెల 25న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

ఇంటి దొంగ పనే!
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, మాట్లాడుతున్న డీఎస్పీ మహేశ్వరరావు

ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే సూత్రధారి 

మిరియాలకాలనీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్టు

80.6 తులాల బంగారం స్వాధీనం

 

అనకాపల్లిటౌన్‌, మే 16: అనకాపల్లి పట్టణం చోడవరం రోడ్డు మిరియాలకాలనీలో గత నెల 25న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.  ముగ్గురు నిందితులను శనివారం సాయంత్రం సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద అరెస్టు చేసి 80.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్‌ అతిథిగృహం సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు వివరాలను వెల్లడించారు.  చోడవరం రోడ్డులో గల మిరియాల కాలనీలో పట్నాల శంకరరావు కిరాణా దుకాణంలో చాలా కాలంగా పనిచేస్తున్న ప్రతాపరావు దుర్గారావు (45) విజయరామరాజుపేట ఏఎంసీ కాలనీకి చెందిన పాత నేరస్థుడు బొచ్చా ఎలియరాజు (25)తో కలిసి చోరీకి పథక రచన చేశాడన్నారు. ఎలియరాజు, అతడి స్నేహితుడు దొడ్డి తిమోతితో కలసి  దుర్గారావు గత నెల 25న  దొంగతనానికి అవసరమైన పనిముట్లు సిద్ధం చేసుకుని, రోడ్డుపై తిమోతిని కాపాలా ఉంచి దుకాణంలోని దేవుడి గదిలో గల బీరువాను పగులగొట్టి 80.6 తులాల బంగారు వస్తువులు, రూ.లక్షన్నర నగదు దోచేశారు. మొత్తం బంగారాన్ని ఎలియరాజు ఇంటివద్ద  భూమిలో పాతిపెట్టారు. అందులో కొంత భాగాన్ని తీసి అమ్మేందుకు సిద్ధమవడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద కాపుకాయడంతో దొంగలు పట్టుబడ్డారని డీఎస్పీ వివరించారు. వారి నుంచి 80.6 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా పాత నేరస్థుడైన ఎలియరాజు 2018 ఏప్రిల్‌లో గాంధీనగరానికి చెందిన మంగిపూడి లక్ష్మీ ఇంట్లో  3.5 తులాల బంగారం, 1.5 కిలోల వెండి వస్తువులు, రూ.2.5 లక్షలు నగదు దొంగిలించినట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఈ నేరానికి సంబంధించి రెండు తులాల బంగారం, 800 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు, ఎస్‌ఐలు డి.లక్ష్మీనారాయణ, ఎల్‌.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T05:09:36+05:30 IST