గృహ నిర్బంధాలు.. అరెస్టులు..నిరసనలు..

ABN , First Publish Date - 2021-03-02T07:59:36+05:30 IST

సోమవారం జిల్లా అంతా ఎమర్జెన్సీ తరహా వాతావరణం కనిపించింది. భారీగా మొహరించిన పోలీసులతో, బలవంతపు అరెస్టులు, తరలింపులతో అట్టుడికిపోయింది.

గృహ నిర్బంధాలు.. అరెస్టులు..నిరసనలు..
చిత్తూరులో టీడీపీ రాస్తారోకోను అడ్డుకుంటున్న పోలీసులు

అట్టుడికిన జిల్లా

తిరుపతి ఎయిర్‌పోర్టులో  10 గంటలు నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన

రాత్రి 7.15 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమైన టీడీపీ అధినేత


చిత్తూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సోమవారం జిల్లా అంతా ఎమర్జెన్సీ తరహా వాతావరణం కనిపించింది. భారీగా మొహరించిన పోలీసులతో, బలవంతపు అరెస్టులు, తరలింపులతో అట్టుడికిపోయింది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థులపై అధికారపార్టీ  దౌర్జన్యాలపై చిత్తూరులో నిరసన తెలుపడానికి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించిన తీరు ప్రజలను నివ్వెరపరిచింది. ఆయనను పదిగంటల పాటు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ దాటనివ్వని పోలీసులు... టీడీపీ నాయకులను తెల్లవారుజామునుంచే గృహనిర్బంధాల్లో ఉంచారు. పార్టీ అధినేతను కలవడానికి వచ్చిన నాయకులను ఎయిర్‌పోర్ట్‌ బయటే బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ పరిణామాలపై ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లమీద నిరసనలకు దిగాయి. ధర్నాలు,రాస్తారోకోలకు దిగారు. ప్రభుత్వ తీరును ఖండించారు. చిత్తూరులోనూ, తిరుపతిలోనూ సోమవారం రోజంతా ఉద్రిక్తవాతావరణం నెలకొంది.


విమానాశ్రయంలో చంద్రబాబు నిర్బంధం

సోమవారం ఉదయం 9.30గంటలకు  తిరుపతిలో  విమానం దిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు ఎయిర్‌పోర్టు దాటనివ్వలేదు.  దాదాపు పది గంటలపాటు ఎయిర్‌పోర్టులో ఆయన నేల మీదే కూర్చుని నిరసన తెలిపారు. చంద్రబాబు వెంట పీఏ రాజగోపాల్‌,వ్యక్తిగత వైద్యుడు తప్ప ఇతర నాయకులెవరూ లేరు. ఆయన ఫోన్‌ను కూడా పోలీసులు లాక్కోవడానికి ప్రయత్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి ఉదయాన్నే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించినా, చంద్రబాబును కలవనివ్వలేదు. మధ్యాహ్నం 1.15 గంటలకు తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనకనరసా రెడ్డి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం 6.30గంటలకు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ కూడా అక్కడకు చేరుకున్నారు. పోలీసు నిర్బంధంలోనే సాయంత్రం దాకా గడిపిన చంద్రబాబు 7.30గంటలకు విమానంలో తిరిగి బయలుదేరారు.


ఎయిర్‌పోర్టు బయట అరెస్టులు

ఎయిర్‌పోర్టులో ఉన్న పార్టీ అధినేతను కలవకుండా జిల్లా టీడీపీ నాయకులను పోలీసులు  అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనీయకుండా ఆవరణలోనే అరెస్టు చేశారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి జేడీ రాజశేఖర్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష, టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత రవినాయుడు, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురవారెడ్డి తదితరులను ఎయిర్‌పోర్టు బయటే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ అనుచరులతో ఎయిర్‌పోర్టు వద్దకు రాగా వారిని బయటే అడ్డుకున్నారు. 


రోడ్లమీద నిరసనలు

చంద్రబాబు తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా చిత్తూరు వెళ్తారని షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. పుత్తూరులో ఆయన ఆగుతారని భావించారు.పుత్తూరు, వడమాలపేట, నారాయణవనం మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు కార్వేటినగరం కూడలిలో గుమిగూడారు. ఎయిర్‌పోర్టులోనే అధినేతను అడ్డుకున్నారని తెలియడంతో ఆవేశానికి లోనై కార్వేటినగరం కూడలి వద్ద అరగంట సేపు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అందర్నీ అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.నారాయణవనం నుంచి బయల్దేరిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరన్‌, మాజీ ఎంపీపీ గోవిందస్వామితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు పుత్తూరు వద్ద అడ్డుకోవడంతో వారు కూడా రోడ్డుపై ధర్నాకు దిగారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డిని హౌస్‌ అరెస్టు చేయగా.. తర్వాత ఆయన టీడీపీ నాయకులతో కలిసి రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. 


గృహనిర్బంధాలు

సోమవారం తెల్లవారుజాము నుంచే జిల్లావ్యాప్తంగా గృహనిర్భంధాలు మొదలయ్యాయి.  చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబును, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నానీని తెల్లవారుజామునే గృహనిర్బంధం చేశారు. పోలీసుల అనుమతితో  ఆ తర్వాత వారు జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పరిణామాలు తెలిసి ఆగ్రహంతో సమీప మండలాల నుంచి పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు గురజాల సందీప్‌, వైవీ రాజేశ్వరి, అరుణ, కాజూరు బాలాజి, సురేంద్రకుమార్‌, కఠారి హేమలత, షణ్ముగం, మోహన్‌రాజ్‌, జయచంద్ర నాయుడు, సుబ్రి తదితరులు టీడీపీ కార్యాలయానికి చేరుకు న్నారు.  చాలామంది నేతలను పోలీసులు కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో పులివర్తి నాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురు గోడలు దూకి కార్యాలయంలోకి వచ్చారు.కార్యాలయంలోనే ధర్నా చేశారు.అనంతరం పెద్దసంఖ్యలో చిత్తూరు- పుత్తూరు రహదారిలోని షర్మన్‌ స్కూల్‌ వద్ద రాస్తారోకో చేసేందుకు బయల్దేరారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. రోడ్డుపై టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. రాస్తారోకో విరమించాలని పోలీసులు కోరినా.. చంద్రబాబును పర్యటనకు అనుమతించాలని నినాదాలు చేశారు. 

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తిరుపతిలో గృహ నిర్భంధం చేయడంతో ఆమె ఇంట్లోనే నేల మీద కూర్చొని నిరసన తెలిపారు.

కుప్పంలో టీడీపీ నాయకులు పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌, రాజ్‌కుమార్‌, ప్రేమ్‌ కుమార్‌ తదితర నేతలను, శాంతిపురంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును హౌస్‌ అరెస్టు చేశారు. కుప్పం, శాంతిపురం ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారు. 

మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. మార్పురి సుధాకర నాయుడు, ఎస్‌ఏ మస్తాన్‌, రాటకొండ మధుబాబు, పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, మోడల్‌ సిద్ధప్ప, దొరస్వామి నాయుడు, తంబళ్లపల్లెలో పర్వీన్‌తాజ్‌లను పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. ఆయా మండలాల్లో పార్టీ మండల అధ్యక్షులను కూడా ఇళ్లకే పరిమితం చేశారు.

శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు విజయ్‌కుమార్‌, ప్రసాద్‌ నాయుడులను, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షుడు గాలి మురళీ నాయుడిని హౌస్‌ అరెస్టు చేశారు.ఏర్పేడు మండల అధ్యక్షుడు పొన్నారావును జంగాలపల్లె వద్ద అరెస్టు చేశారు.

పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి మల్లారపు రవిప్రకాష్‌ను కలకడ మండలం బాటవారిపల్లెలో, టీడీపీ జిల్లా కార్యదర్శి దుద్దాల హరిప్రసాద్‌ నాయుడును గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో హౌస్‌ అరెస్టు చేశారు.

వెదురుకుప్పంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మోహన్‌ మురళిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. మధ్యాహ్నం తన ఇంటి వద్దే పోలీసుల సమక్షంలో ప్రభుత్వ, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, గంగాధర నెల్లూరు మండలాల్లో టీడీపీ నాయకులు రహదారులపై పెద్దఎత్తున బైఠాయించారు.

Updated Date - 2021-03-02T07:59:36+05:30 IST