మట్టిని పట్టి.. కోట్లు కొల్లగొట్టి!

ABN , First Publish Date - 2022-05-27T06:09:44+05:30 IST

జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలకు అనుమతులు లేకున్నా అక్రమార్కులు అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టల్లో పొక్లెన్లతో తవ్వుతూ టిప్పర్‌లు, లారీల ద్వారా ఇటుక బట్టిలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, గోదామ్‌లకు సరఫరా చేస్తున్నారు.

మట్టిని పట్టి.. కోట్లు కొల్లగొట్టి!
కంజర చెరువులో తవ్వకాలు చేయడంతో గుంతలు పడ్డ దృశ్యం


జిల్లాలోవిచ్చలవిడిగా మట్టి, మొరం తవ్వకాలు                    

ఇటుక బట్టీలు, వెంచర్లకు సరఫరా చేస్తున్న అక్రమార్కులు 

అనతి కాలంలోనే రూ. లక్షల్లో సంపాదిస్తున్న కేటుగాళ్లు       

మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు 

నిజామాబాద్‌, మే 26:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలకు అనుమతులు లేకున్నా అక్రమార్కులు అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టల్లో పొక్లెన్లతో తవ్వుతూ టిప్పర్‌లు, లారీల ద్వారా ఇటుక బట్టిలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, గోదామ్‌లకు సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో, కొందరు అధికారులు అక్రమర్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉండడంతో మట్టి, మొరం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీల పేరున తవ్వకాలను చేస్తూ మట్టి, మొరం తవ్వుతున్నారు. చెరువులు, గుట్టలను గుల్లచేస్తున్నారు. 

అనుమతులు లేకుండానే..

జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని గనులు, భూగర్భ జల శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు ఇతర శాఖల అనుమతులను తీసుకుని తవ్వకాలు చేయాలి. జిల్లాలో అనుమతులు తీసుకున్న క్వారీలు పదిలోపే ఉన్నాయి. మిగతా చోట్ల కిందిస్థాయి అధికారులను మేనేజ్‌ చేసుకొని తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలోని మోపాల్‌, నిజామాబాద్‌రూరల్‌, ఎడపల్లి, బోధన్‌, రుద్రూర్‌, మోస్రా, డిచ్‌పల్లి, వేల్పూర్‌, ఆర్మూర్‌, నందిపేట, భీమ్‌గల్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌, బాల్కొండ, జక్రాన్‌పల్లి మండలాల పరిధిలో ఈ తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ ప్రాంతంలోని గుట్టల్లో తవ్వకాలు చేస్తున్నారు. పొక్లెన్‌లను పెట్టి ఈ మట్టి తవ్వకాలు చేస్తూ టిప్పర్‌లు, లారీల ద్వారా తరలిస్తున్నారు. 

గుల్ల అవుతున్న చెరువులు

మోపాల్‌ మండలం కంజరలోని చెరువును మొత్తంగుల్లచేశారు. పంటచేళ్లలో చెరువు మట్టి వేసుకునేందుకు రైతుల పేరున తవ్వకాలు చేస్తూ లారీలు, టిప్పర్‌ల ద్వారా ఇటుక బట్టిలు, ఇళ్లకు తరలిస్తున్నారు. పొక్లెన్‌లతో తవ్వకాలు చేస్తూ లారీల ద్వారా టిప్పర్లద్వా రా తరలిస్తున్నారు. గ్రామస్థులు ఇదేమిటని నిలదీసి ధర్నాలు చేసి నా అక్రమార్కులు తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఈ విషయంపైన రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులను వివరణ కోరితే తాము ఎలాంటిఅనుమతులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల అవసరాల కోసం కొన్ని చెరువుల్లో తవ్వుతున్నారని వివరించారు. కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీల పేర్లుచెప్పి తప్పించుకుంటున్నారు. 

ఇతర ప్రాంతాలకు సరఫరా..

జిల్లాలో ఈ మట్టి, మొరాన్ని ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చే స్తూ నిజామాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఇళ్లు, గోదామ్‌లు నిర్మాణంతో పాటు వెంచర్‌లకు మట్టిని వినియోగిస్తున్నారు. కిందిస్థాయిలో అధికారుల సహకారం తీసుకుంటూ అనుమతుల్లేకుండానే తవ్వకాలు చేస్తున్నారు. అనుమతులు తీసుకుంటే ఆయా శాఖలకు రాయల్టీ చెల్లించాలి. అలా కాకుం డా అధికారులకు ముడుపులు ముట్టజెప్పడంతోవాఆరు చూసీ చూనడట్లు చూసీచూడనట్లు వ్యవహరిన్నారని ఆరోపణలున్నాయి. మట్టి, మొరం అక్రమ తవ్వకాలపై నిఘావర్గాలతో పాటు పలుసంఘాలు ప్రభుత్వంతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. అక్రమంగా తవ్వకాలు చేసి పర్యావరణానికి దెబ్బకొడుతున్నారని మైనింగ్‌, విజిలెన్స్‌, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. చర్యలు తీసుకోవాలని కోరారు. పలు శాఖల ఉన్నతాధికారులకు, సీఎం కార్యాలయానికి లేఖలు రావడంతో ప్రభుత్వం కదిలి ప్రధానంగా కొన్ని జిల్లాలపై దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. 

అనుమతులు లేని ఇటుక బట్టీలు..

జిల్లాలో చాలా ఇటుక బట్టీలకు అనుమతులు లేవు. కొంతమంది అనుమతులు తీసుకున్నా మిగతావారు అనుమతులు తీసుకోలేదు. వీటికి కావాల్సిన ఎర్రమట్టి, నల్లమట్టిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ ప్రాంతంలోని గుట్టల్లో తవ్వకాలు చేస్తూ తరలిస్తున్నారు. మండలస్థాయిలో అధికారులు సహకారంతో తవ్వకాలు చేస్తున్నారు. జిల్లా జైలుకు పక్కనే నిత్యం తవ్వకాలు జరుగుతున్నా ఆ వైపు అధికారులు చూడడంలేదు. నగరం చుట్టూ నాగారం, సారంగపూర్‌, మల్లారంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఈతవ్వకాలు చేస్తూ ఇటుక బట్టీలతో పాటు ఇతర పనులకు వినియోగిస్తున్నారు.

అక్రమ బట్టీలపై ప్రభుత్వం నజర్‌

జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపైన రాష్ట్ర ప్రభుత్వం నజర్‌పెట్టింది. వీటిపైన దృష్టిసారించడంతో పాటు తగి న చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఈ ఇటుక బట్టీలు ఉ న్నాయో వివరాలతో సహ పంపించారు. ఇటుకబట్టీల్లో అక్రమంగా ఇటుకలు తయారుచేయడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని ఎగ్గోడుతున్నారని ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వారితో పనిచేయించుకుంటున్నారని ఆయా జిల్లాల కలెక్టర్‌లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఇటుకల నిర్మాణంకు అనుమతులు లేకుండా మట్టిని తవ్వకాలు చేస్తున్నారని కిందిస్థాయిలోని రెవెన్యూ, మైనింగ్‌, ట్రాన్స్‌కో కార్మికశాఖ, రవాణాశాఖతో పా టు ఇరిగేషన్‌, ఇతర శాఖల అధికారులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై న నిఘాపెట్టి సరైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆయా జిల్లా కలెక్టర్‌లకు పంపిన లేఖల్లో పేర్కొన్నారు. 

చర్యలు చేపట్టని అధికారులు

జిల్లాలో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలపైన అధికారులు దృష్టిపెడితే ప్రభుత్వ భూముల్లో ఈ అనుమతులు లేకుండా తవ్వకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఇటుకబట్టీలపైన చర్యలు తీసుకుంటే భారీగా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కిందిస్థాయిలోని  ఆయా శాఖల అధికారులు చర్యలు చేపడితే ఈ అక్రమ తవ్వకాలు ఆగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు చేపడితే జిల్లాలో అనుమతులతో ఇటుకబట్టీలు, మట్టి తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2022-05-27T06:09:44+05:30 IST